మునిగిన నౌక.. 14 మందిని రక్షించిన నేవీ
మునిగిపోతున్న నౌక నుంచి 14 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్‌గార్డ్ బృందాలు రక్షించాయి. ఎంవీ కోస్టల్ ప్రైడ్ అనే నౌక ముంబై తీరానికి 75 నాటికల్ మైళ్ల దూరంలోను, డామన్ తీరానికి 24 నాటికల్ మైళ్ల దూరంలోను బుధవారం ఉదయమే మునిగిపోయింది. ఈ నౌక నుంచి ఎస్ఓఎస్ కాల్ అందడంతో.. వెంటనే ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్‌గార్డ్ బృందాలు రంగంలోకి దిగాయి. సీ కింగ్, చేతక్ అనే రెండు హెలికాప్టర్లు ఈ రక్షణ ఆపరేషన్లోకి దిగాయి.
ఉదయం 8 గంటల సమయంలో సీ కింగ్ హెలికాప్టర్ కొలాబా నుంచి బయల్దేరింది. మరో రెండు కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు మరో అరగంటలో బయల్దేరాయి. మునిగిపోతున్న నౌకలోని సిబ్బంది అందరినీ రక్షించి, వారిని సురక్షితంగా ఉమర్గావ్కు చేర్చారు. రెస్క్యూ ఆపరేషన్ ముగిసేసరికి నౌక సగం మునిగిపోయిందని ఇండియన్ నేవీ అధికార ప్రతినిధి తెలిపారు.