చిక్కని చిరుత!
ఇక్రిశాట్లో క్రూరమృగం సంచారం
నాలుగు నెలలుగా దొరకని పులి
ఉచ్చు వేయడంతో గాయపడిన వైనం
‘‘ ఇనుప తీగల ఉచ్చులో చిక్కినట్టే చిక్కి చిరుత తప్పించుకుంది. ఈ క్రమంలో దానికి గాయాలయ్యాయి. సాధారణంగా గాయపడ్డ క్రూరమృగాలు ఇతర వన్యప్రాణుల్ని వేటాడే శక్తిని కోల్పోతాయి. ఫలితంగా తేలిగ్గా తమకు చిక్కే మనుషులపై దాడి చేసి మ్యానీటర్లుగా మారిపోతాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు ఇప్పుడు గాయపడ్డ చిరుత కూడా మ్యానీటర్‌గా మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు’’
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరులో ఉన్న జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ(ఇక్రిశాట్) ప్రాంగణంలోకి ప్రవేశించిన చిరుత పులి అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నాలుగు నెలలుగా హల్చల్ చేస్తున్న దీన్ని పట్టుకోవడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనివల్ల ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందిలేదని అటవీ శాఖ అధికారులు చెప్తున్నా... ఈ సంస్థ ప్రాంగణం చుట్టూ నివసిస్తున్న ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
వ్యవసాయ క్షేత్రాలతో వందల ఎకరాల్లో సువిశాల ప్రాంగణంలో చెట్లు, పొదలతో విస్తరించి ఉన్న ఇక్రిశాట్లో కుందేళ్లు, నెమళ్లు, అడవి పందుల వంటి వన్యప్రాణులు నివసిస్తుంటాయి. ఇందులోకి క్రూరమృగమైన చిరుత పులి ప్రవేశించిన విషయాన్ని నాలుగు నెలల క్రితం అధికారులు గుర్తించారు. పలుమార్లు చిరుత కదలికల్ని గమనించిన తరువాత విషయాన్ని అటవీ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ అధికారులు ప్రాథమింక పరిశీలనతో సదరు చిరుత ఇక్రిశాట్‌కు 26 కిమీ దూరంలో ఉన్న నర్సాపూర్ లేదా 28 కిమీ దూరంలో ఉన్న ముడినియాల్ అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్లు అంచనా వేశారు. ముడినయాల్ అడవి నుంచి ఇక్రిశాట్ మధ్య మార్గంలో పూర్తిగా అభివృద్ధి చేయని ఔటర్ రింగ్ రోడ్ ఉండటం, దారి పొడవునా చెట్లు, పొదలు ఉండటంతో దఫదఫాలుగా ప్రయాణిస్తూ ఈ మార్గంలోనే వచ్చి ఉంటుందని నిర్థారించారు. చిరుతను పట్టుకోవడానికి ఇక్రిశాట్ సిబ్బంది, అటవీశాఖ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కెమెరా ట్రాప్ పద్ధతి ద్వారా చిరుత కదలికల్ని చిత్రీకరించడానికి ఇక్రిశాట్ ప్రాంగణంలో అనేక చోట్ల కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో దాని కదలికలు ఫొటోల రూపంలో నమోదయ్యాయి. చిరుతను పట్టుకోవడం కోసం ప్రాంగణంలోని అనేక ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు కుక్కల్నీ ఎరగా వేసి ప్రయత్నించారు. ఇవి ఫలితాలు ఇవ్వకపోగా... మృగం తెలివి మీరడంతో నిబంధనలకు విరుద్ధమైనా ఉచ్చు వేయడానికీ అధికారులు సిద్ధమయ్యారు. సన్నని ఇనుప వైర్లతో తయారు చేసిన ఉచ్చుకు నాలుగు రోజుల క్రితం చిక్కినట్లే చిక్కిన చిరుత దాన్ని తెంపుకుని వెళ్లిపోయింది.
ఈ పెనుగులాట నేపథ్యంలో కొన్ని ఇనుప వైర్లు చిరుత మెడకు ఉండిపోవడంతో పాటు దానికి గాయమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సాధారణంగా గాయలపాలైన క్రూరమృగాలు వాటి సహజసిద్ధమైన ఇతర వన్యప్రాణుల్ని వేటాడే శక్తిని కోల్పోతాయి. ఫలితంగా తేలిగ్గా తమకు చిక్కే మనుషులపై దాడులు చేస్తూ మ్యా నీటర్లగా మారిపోతాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
చిరుత సంచారంపై ఇక్రిశాట్ అధికారులు గతంలోనే అటవీ శాఖ అధికారుల దృష్టి తీసుకువెళ్లారు. వైల్డ్ లైఫ్ ట్రాంక్వలైజింగ్ ఫోర్స్ పేరిట దేశ వ్యాప్తంగా క్రూరమృగాల్ని మత్తు మందిచ్చి బంధిస్తున్న, మ్యానీటర్లను హతమారుస్తున్న రెడ్‌హిల్స్ వాసి నవాబ్ షఫత్ అలీ ఖాన్‌ను సైతం వీరు సంప్రదించారు.
అయితే ఆయన ఆపరేషన్ చేపట్టడానికి అవసరమైన పూర్తి సహాయసహకారాలు అందించని కారణంగానే ఇప్పటి వరకు చిరుత పులి చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతోందని ఇక్రిశాట్ సి బ్బంది చెప్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి షఫత్ అలీ ఖాన్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించాలని, చిరుత మ్యానీటర్‌గా మారకముందే బం ధించి అనువైన ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.