వారి ఆందోళనల్ని అర్థం చేసుకున్నాం
♦ సమష్టి చర్చలే ‘రోహింగ్యా’కు పరిష్కారం: ప్రధాని మోదీ
♦ 11 ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు
♦ ఉగ్రవాదంపై పోరు,
♦ భద్రతా సహకారం పటిష్టానికి అంగీకారం మయన్మార్‌కు అండగా..
నేపితా: మయన్మార్ దేశ ఐక్యతను గౌరవిస్తూ రోహింగ్యాల సమస్య పరిష్కారానికి సంబంధిత పక్షాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సవాళ్లతో ఇబ్బందిపడుతున్న మయన్మార్‌కు భారత్ అండగా ఉంటుందని హామీనిచ్చారు. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో అతివాద హింస నేపథ్యంలో ఆ దేశ ఆందోళనల్ని భారత్ అర్థం చేసుకుందన్నారు. మయన్మార్ పర్యటనలో భాగంగా బుధవారం ఆ దేశ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్ సూచీతో ప్రధాని విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రోహింగ్యా ముస్లింలపై మయన్మార్ సైన్యం దాడులతో దాదాపు 1.25 లక్షల మంది బంగ్లాదేశ్‌కు వలసవెళ్లిన నేపథ్యంలో ప్రధాని ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
చర్చల అనంతరం మోదీ, సూచీలు సంయుక్త మీడియా ప్రకటన విడుదల చేశారు. మయన్మార్ ఎదుర్కొంటున్న సమస్యల్ని భారత్ అర్థం చేసుకుందని మోదీ పేర్కొన్నారు. ‘రఖైన్ రాష్ట్రంలో అమాయకులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అతివాద హింసపై మయన్మార్ ఆందోళనల్ని భారత్ అర్థం చేసుకుంది. మయన్మార్ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ సమస్యకు పరిష్కారం కోసం సంబంధిత పక్షాలు కలిసికట్టుగా పనిచేయాలి’ అని సూచించారు. భారత్‌లో పర్యటించాలనుకునే మయన్మార్ పౌరులకు ఎలాంటి రుసుం లేకుండా వీసాల జారీకి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మయన్మార్‌లో భారత్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని భేటీలో ఆయన ప్రస్తావించగా.. మరింత సాయం చేయాలని సూచీ కోరారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మయన్మార్‌కు సరైంది: మోదీ
‘ఇరు దేశాలు భద్రతా సహకారాన్ని పెంచాల్సిన అవసరముంది. రెండు దేశాల్లో ఒకే విధమైన భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నాయి. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మయన్మార్‌కు సరైందని నేను నమ్ముతున్నా.. అందుకే మయన్మార్ కార్యనిర్వాహక వ్యవస్థ, చట్ట సభలు, ఎన్నికల సంఘం, ప్రెస్ కౌన్సిల్, ఇతర సంస్థల్లో నైపుణ్యాలు, సామర్థ్యం పెంచేందుకు భారత్ పెద్ద ఎత్తున మద్దతు కొనసాగిస్తోంది. పలేట్వా దేశీయ జల రవాణా వ్యవస్థ, సిట్వే పోర్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. నాణ్యమైన విద్య, ఆరోగ్య రంగం, పరిశోధన రంగాల్లో సాయం కొనసాగిస్తున్నాం’ అని మోదీ అన్నారు. మోదీ–సూచీ మధ్య చర్చల అనంతరం.. 11 ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. సముద్ర రవాణా, మయన్మార్‌లో ప్రభుత్వ సంస్థల బలోపేతం, ఆరోగ్యం, ఐటీ రంగాలతో పాటు, ఇరు దేశాల ఎన్నికల సంఘాలు, ప్రెస్ కౌన్సిల్స్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. వైద్య ఉత్పత్తుల నియంత్రణ, మయన్మార్ మహిళా పోలీసులకు శిక్షణపై కూడా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.
సూచీకి ప్రత్యేక కానుక...
సిమ్లాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ(ఐఐఏఎస్)లో ఫెలోషిప్ కోసం 1986లో సూచీ సమర్పించిన పరిశోధన పత్రాల అసలు కాపీల్ని ప్రధాని మోదీ సూచీకి బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్నిట్విటర్‌లో ప్రధాని వెల్లడించారు. సూచీ ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. మయన్మార్ పర్యటనలో భాగంగా మోదీ బుధవారం బగన్ నగరంలోని 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఆనంద ఆలయాన్ని సందర్శించారు.