పూజలు.. పర్యటనలు
ముగిసిన ప్రధాని మోదీ మయన్మార్ పర్యటన
యాంగాన్: మయన్మార్ పర్యటనలో భాగంగా చివరి రోజున ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక ప్రాంతాలు, ఆలయాల సందర్శనలో బిజీబిజీగా గడిపారు. మొఘల్ సామ్రాజ్యం చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ సమాధి, 2,500 ఏళ్ల నాటి ష్వెడగాన్ పగోడాను సందర్శించడంతో పాటు కాళిబరి ఆలయంలో పూజలు నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం భారత్‌కు తిరుగు పయనమయ్యారు. ఉదయం మయన్మార్ సాంస్కృతిక వారసత్వ సంపదైన ష్వెడగాన్ పగోడాను సందర్శించారు. అక్కడి ప్రాంగణంలో బోధి మొక్కను నాటారు. ‘మయన్మార్ సాంస్కృతిక చిహ్నమైన ష్వెడగాన్ పగోడాను సందర్శించడం ఎంతో ఆనందంగా ఉంది’ అని మోదీ ట్వీట్ చేశారు.
ఈ పగోడాపై వందల కొద్ది బంగారు పలకాల్ని అమర్చారు. చివరన ఉన్న స్తూపంపై 4531 వజ్రాల్ని పొదిగారు. మయన్మార్ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్ సూచీతో కలిసి బొగ్యోకే ఆంగ్‌సాన్ మ్యూజియాన్ని మోదీ సందర్శించారు. అలాగే బహదూర్ షా జాఫర్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. 1857లో బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు సమయంలో బహదూర్ షాను రంగూన్‌లో నిర్బంధించగా.. అక్కడే ఆయన మరణించారు. అనంతరం అమరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించాక.. కాళిబరి ఆలయాన్ని దర్శించుకుని మోదీ ప్రత్యేక పూజలు చేశారు.
‘యాంగాన్ కాళిబరి ఆలయంలో పూజలు చేయడాన్ని గొప్ప దీవెనగా భావిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. చైనాలో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు 3న విదేశీ పర్యటనకు బయల్దేరిన మోదీ సెప్టెంబర్ 5న మయన్మార్ చేరుకున్నారు. సెప్టెంబర్ 6న ఆ దేశ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్ సూచీతో ఉన్నతస్థాయి ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా 11 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.