రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి: మైసూరారెడ్డి
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సభ్యుడు ఎంవి మైసూరా రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు తెలిపారు. తండ్రిలా విభజన చేయకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ డిమాండ్ అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉండాలనేది వైఎస్ఆర్సిపి అభిమతం అని తెలిపారు.
తమ పార్టీ ఇచ్చిన లేఖను వక్రీకరిస్తున్నారన్నారని చెప్పారు. రాష్ట్ర విభజనకు తాము ఎప్పుడూ బ్లాంక్ చెక్ ఇవ్వలేదని తెలిపారు. ఎన్నిమార్లు చెప్పినా వారి వాదాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. నిద్ర నటించేవారితో మాట్లాడటం కష్టం అన్నారు. కొన్ని పార్టీలకు మొఖం చెల్లకుండా పోయిందన్నారు. కొన్ని పత్రికలు కూడా విష ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు యథాతథంగా ఉంచమని కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటన చూస్తే ఒంటెద్దు పోకడ పోతున్నట్లుందన్నారు.
16 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు స్పీకర్ ఫార్మాట్లో రాజీ నామాలు చేశారని తెలిపారు. వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ ఇద్దరూ దీక్షలు చేశారన్నారు. వీటిని పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. మిగిలిన పార్టీలు తమని విమర్శించేముందు రాజీనామాలు చేయాలన్నారు. ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖలు ఇచ్చి, ఆయా పార్టీల విధానమేంటో కూడా స్పష్టంగా చెప్పాలని మైసూరారెడ్డి డిమాండ్ చేశారు.