తమిళ సినిమా కల చెదిరింది..
చెన్నై: గీత రచయిత నా.ముత్తుకుమార్ కలం ఆగింది. కవిత కంట తడిపెట్టింది. తమిళ సినిమా కల చెదిరింది. చిత్ర పరిశ్రమ ఒక గొప్ప గీత రచయితను కోల్పోయి దిగ్భ్రాంతికి గురైంది. నా.ముత్తుకుమార్ ఆదివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా పచ్చకామెర్ల వ్యాధితో బాధ పడుతున్న ఆయన అన్నానగర్ వెస్ట్ పార్క్ రోడ్డు, మొదటి అవెన్యూలోని స్వగృహం సింబా ఫ్లాట్‌లో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యానికి గురైన నా.ముత్తుకుమార్‌కు వైద్య పరిశోధనలో పచ్చకామెర్లు అని తెలియడంతో ఇంటి వద్దే వైద్య చికిత్సలు పొందుతున్నారు.
అయితే వైద్యం ఫలించకపోవడంతో మృతి చెందారు. నా.ముత్తుకుమార్ సొంత ఊరు కాంచీపురం జిల్లా కన్నికాపురం. చిన్న వయసులోనే కవితలు రాసే ప్రతిభ కలిగిన ఆయన సినిమా అవకాశాలు వెతుక్కుంటూ చెన్నైకి వచ్చారు. దర్శకులు బాలు మహేంద్రన్ వద్ద నాలుగేళ్లు శిష్యరికం చేశారు. ఆ సమయంలో తన సహచరుడైన సీమాన్ దర్శకత్వం వహించిన వీరనడై చిత్రం ద్వారా గీత రచయితగా పరిచయం అయ్యారు. అయితే ఆయన 32వ చిత్రంగా వీరనడై చిత్రం తెరపైకి వచ్చిందన్నది గమనార్హం. నా.ముత్తుకుమార్ మిన్సార కన్నా, సామి, కాదల్‌కొండేన్, పిదామగన్, కోవిల్, సింగం, మదరాసుపట్టణం, అవన్ ఇవన్, మెరీనా, బిల్లా-2, తెరి వరకూ 100కు పైగా చిత్రాలకు పాటలు రాశారు.
రెండు జాతీయ అవార్డులు: వెయ్యికి పైగా సినీ గీతాలను రాసిన నా.ముత్తుకుమార్ తంగమీన్‌గళ్ చిత్రంలోని ఆనంద మళై మీట్టుగిరాయ్ అనే పాటకు, సైవం చిత్రంలోని అళగే అళగే ఎదువుమ్ అళగే అనే పాటకు రెండు జాతీయ అవార్డులను అందుకున్నారు. 2005లో అయన్ చిత్రానికి గానూ తమిళనాడు ప్రభుత్వ అవార్డును, వెయిల్, అయన్ తదితర చిత్రాలకు గాను నాలుగు సార్లు ఫిలింఫేర్ అవార్డులను, ఒక సైమా అవార్డును అందుకున్నారు. గత నాలుగైదేళ్లుగా ప్రతి ఏడాది అత్యధిక చిత్రాలకు పాటలు రాసిన గీత రచయితగా రికార్డు సాధించిన నా.ముత్తుకుమార్ 2012 సంవత్సరంలో 103 పాటలు రాశారు. ఒక్క ఏడాదిలో ఇన్ని పాటలు రాసిన మరో గీత రచయిత లేరన్నది గమనార్హం.
ప్రముఖుల నివాళులు: కాగా నా.ముత్తుకుమార్ మృతి తమిళ చిత్రపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. డీఎంకే అధినేత కరుణానిధి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరాజన్ తదితర రాజకీయనాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. నటుడు కమలహాసన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. నటుడు విజయ్, జయంరవి, దర్శకుడు సీమాన్, విక్రమన్, భాగ్యరాజన్, బాలా, చేరన్, పాండిరాజన్, యువన్ శంకర్‌రాజా, నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్, గీత రచయిత వైరముత్తు,స్నేహన్, పా.విజయన్ మొదలగు పలువురు నివాళులర్పించారు. నా.ముత్తుకుమార్‌కు భార్య జీవలక్ష్మి, కొడుకు ఆదవన్(9), కూతురు యోగలక్ష్మి ఉన్నారు. ఆయన భౌతికకాయానికి న్యూ ఆవిడి రోడ్డు,వేలంకాడు శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.