అమెరికాలో ఎన్నారై మహిళ అనుమానాస్పద మృతి
అమెరికాలో కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన భారత సంతతి మహిళ ఒకరు అనుమానాస్పద స్థితిలో ఓ కారులో మరణించి కనిపించారు. ఆమె ఇద్దరు బిడ్డల తల్లి. అమెరికాలోని పెన్సల్వేనియా రాష్ట్రంలో ఉండేవారు. నాదియా మాలిక్ (22) ప్రీ మెడికల్ విద్యార్థిని. ఫిలడెల్ఫియాలో అత్యంత రద్దీగా ఉండే ఓ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కారులో ప్రయాణికుల సీట్లో మరణించి కనిపించారు. మాలిక్ స్నేహితుడు భూపీందర్ సింగ్ను పోలీసులు గతంలో పెరోల్ ఉల్లంఘన కేసులో అరెస్టు చేశారు. అతడిని ఓహియో నుంచి ఫిలడెల్ఫియా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అతడికి గతంలో నేరచరిత్ర ఉండటంతో అతడిని ప్రశ్నించాలని యోచిస్తున్నారు. వీరిద్దరి మధ్య సంబంధం ఉందని అధికారులు అంటున్నారు.
ఆ కారు ఆ ప్రాంతంలో 12 రోజులుగా పడి ఉన్నా.. నాదియా మాలిక్ మృతదేహాన్ని మాత్రం ఎవరూ గుర్తించలేదు. చివరకు కారును అక్రమంగా పార్కింగ్ చేసినందుకు పోలీసులు తనిఖీ చేయగా విషయం తెలిసింది. మంచు దట్టంగా అలముకోవడంతో దాన్ని తొలగించే యంత్రాలకు అడ్డుగా ఉందని కారును వేరే ప్రదేశానికి తరలించారు కూడా. అప్పుడూ ఆమె మృతదేహాన్ని గుర్తించలేదు. ఆమె శవం ఓ బ్యాగ్, దుస్తుల కింద దాచిపెట్టి ఉండటంతో ఎవరికీ తెలియలేదు. ఈనెల పదోతేదీ నుంచి ఆమె అదృశ్యమైనట్లు ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. నాదియా పిల్లలిద్దరికీ తండ్రి అయిన భూపీందర్ సింగ్తో చివరిసారిగా ఆమె కనిపించినట్లు తెలిసింది. తాను భూపీందర్తో ఉన్నానని, అతడు తనను బయటకు వెళ్లనివ్వట్లేదని తనకు చెప్పినట్లు నాదియా స్నేహితుడు థామస్ సింగ్ పోలీసులకు తెలిపాడు.