nadodigal
-
భాగ్యరాజ్ పాత్రలో శశికుమార్
తమిళ సినిమా : సీనియర్ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ పాత్రలో నటుడు శశికుమార్ నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా వార్త. గతంలో మంచి విజయం సాధించిన చిత్రాలను పునర్నిర్మించడం చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే ఇటీవల సీక్వెల్స్ నిర్మాణం అధికం కావడంతో పాత చిత్రాల రీమేక్ తగ్గింది. తాజాగా నటుడు శశికుమార్ ఆ ట్రెండ్‌కు తెరలేపనున్నారు. 1982లో నటుడు కే.భాగ్యరాజ్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం తూరల్ నిండ్రు పోచ్చు. ఇందులో నటి సులోచన కథానాయకిగా నటించారు. ముఖ్య పాత్రలో నంబియాన్ నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం ఇప్పుడు నటుడు శశికుమార్ కథానాయకుడిగా రీమేక్ కానుంది. ఈ విషయాన్ని నట దర్శకుడు కే.భాగ్యరాజ్ ధ్రువీకరించారు. నటుడు శశికుమార్ కూడా ఈ ప్రచారాన్ని ధ్రువపరిచారు. దీని గురించి ఆయన తెలుపుతూ కే.భాగ్యరాజ్ నటించిన తూరల్ నిండ్రు పోచ్చు చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు తెలిపారు. ఆ చిత్ర కథను నేటి తరానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి పునర్నిర్మాణం జరపనున్నట్లు చెప్పారు.ఇందులో కే.భాగ్యరాజ్ పాత్రను తాను, నంబీయార్ పాత్రలో రాజ్‌కిరణ్ నటిస్తే బాగుంటుందని భావిస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం శశికుమార్ సముద్రఖని దర్శకత్వంలో నాడోడిగళ్ 2లో నటిస్తున్నారు. మరో చిత్రం అసురవధం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. -
నాడోడిగళ్ సీక్వెల్ మొదలైంది!
తమిళసినిమా: నాడోడిగళ్ సీక్వెల్ చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం మొదలైంది. తొమ్మిదేళ్ల క్రితం తెరపైకి వచ్చిన చిత్రం నాడోడిగళ్. ఆ చిత్రం దర్శకుడు సముద్రకని, నటి అనన్య, అభినయ వంటి వారికి గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతే కాదు కమర్శియల్‌గానూ మంచి విజయాన్ని సాధించింది. తాజాగా అదే సముద్రకని, శశికుమార్‌ల కాంబినేషన్లో నాడోడిగళ్ సీక్వెల్ చిత్రం తెరకెక్కుతోంది. అయితే తొలి భాగంలో నటించిన శశికుమార్, భరణి, నమోనారాయణ మాత్రమే సీక్వెల్లో నటిస్తున్నారు. హీరోయిన్లుగా అంజలి, అతుల్య నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఎంఎస్.భాస్కర్, జ్ఞానసంబంధం, తులసి, శ్రీరంజని, సూపర్‌సుబ్బరాయన్ నటిస్తున్నారు. మరి కొంతమంది నటీనటుల ఎంపిక జరుగుతోందని చిత్ర వర్గాలు తెలిపారు. మెడ్రాస్ ఎంటర్‌ప్రైజస్ పతాకంపై ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకాంబరం ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తిరువళ్లూర్ సమీపంలోని ఒక గ్రామంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రేమను కాపాడే స్నేహితుల ఇతివృత్తంగా నాడోడిగళ్ చిత్రం రూపొందగా ఈ సీక్వెల్లో ఆ అంశంతో పాటు పలు విషయాలు చోటుచేసుకుంటాయని చిత్ర వర్గాలు ఈ సందర్భంగా తెలిపారు. తొమ్మిదేళ్లనాటికి, ఇప్పుటికీ సమాజంలో చాలా మార్పులు జరిగాయని, అలాంటి వన్నీ ఈ చిత్రంలో పొందుపరచనున్నట్లు తెలిపారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో శశికుమార్, అంజలి, అతుల్య చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
కోలీవుడ్‌లో బిజీ అవుతున్న తెలుగమ్మాయి
నటి అంజలి కోలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోంది. ప్రస్తుతం నటుడు జైతో కలిసి నటించిన బెలూన్ చిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా విజయ్‌ఆంథోనికి జంటగా కాళీ చిత్రంలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తున్నా, అంజలికే అధిక ప్రాధాన్యత ఉంటుందట. తాజాగా అంజలికి మరో అవకాశం తలుపు తట్టింది. నాడోడిగళ్–2 చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. 2009లో తెరపైకి వచ్చిన నాడోడిగళ్ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శశికుమార్, విజయ్‌వసంత్, గంజాకరుప్పు, నటి అనన్య, అభినయ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. ఇదే చిత్రం తెలుగులోనూ శంభో శివశంబో పేరుతో రీమేక్ అయ్యింది. తాజాగా శశికుమార్ హీరోగా సముద్రఖని దర్శకుడిగా నాడోడిగళ్–2 చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో అంజలి కథానాయికగా నటించనుందన్నది. మరో హీరోయిన్గా నటి అతుల్యరవి నటించనుంది. ఈమె ఇప్పటికే సముద్రఖనితో కలిసి ఏమాలి చిత్రంలో నటిస్తోందన్నది. ఇన్స్పైర్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం మార్చిలో సెట్‌పైకి వెళ్లనుంది. ఐస్టిన్ ప్రభకరన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం నాడోడిగళ్ చిత్రానికి సీక్వెల్ కాదట. ఆ బాణీలో సాగే విభిన్న కథా చిత్రంగా నాడోడిగళ్–2 చిత్రం ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. మొత్తం మీద నటి అంజలి కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో మళ్లీ బలం పుంజుకుంటోందన్న మాట. -
అజయ్‌క్రిష్ణ హీరోగా కట్టం పోట్ట సట్ట
నాడోడిగళ్ చిత్రంలో చిన్న పాత్రతో నటనకు శీకారం చుట్టిన నటుడు అజయ్‌క్రిష్ణ. చిన్న పాత్రతోనే చిన్న చిన్న గ్రామాల వరకూ రీచ్ అయిన ఈయన ఆ మధ్య విడుదలైన ధరణి చిత్రంలో కథానాయకుడిగా తన స్థాయిని మరింత పెంచుకున్నారు. తాజాగా కట్టంపోట్టసట్ట అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా పిశాచు చిత్రం ఫ్రేమ్ ప్రియాంక నటిస్తున్నారు. వైట్ పికాక్ ప్రొడక్షన్ పతాకంపై ఎస్.శరవణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు అక్షయప్రియన్ పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు అగస్త్యిన్ శిష్యుడన్నది గమనార్హం. ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సిలంబాట్టం చిత్ర దర్శకుడు శరవణన్ చాయాగ్రహణం అందించడం విశేషం. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ దక్షిణాది జిల్లాల ప్రజల జీవన విధానాన్ని అందంగా ఆవిష్కరించే చిత్రం కట్టం పోట్ట సట్ట అని తెలిపారు. ఈ చిత్రం కోసం అళగర్‌మలై, అడివారం సమీపంలో ఒక గ్రామ సెట్‌నే వేసి చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందని దర్శకుడు తెలిపారు.