చీనీ రైతు ఉసురు తీసిన అప్పులు
పంటను కాపాడుకునేందుకు బోరు బావుల తవ్వకం
పెరుగుతున్న అప్పులు..పిల్లల చదువుల భారం
వడ్డీకి కూడా సరిపోని రుణ మాఫీ
దిక్కుతోచక విషపు గుళికలు మింగి బలవన్మరణం
లింగాల : కళ్లెదుటే ఎండిపోతున్న పంటను కాపాడటం కోసం అప్పుల మీద అప్పు చేసి బోరు బావులు తవ్వించినా ఫలితం లేకపోవడంతో ఓ రైతు దిక్కుతోచక విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. లింగాల మండలం కామసముద్రం గ్రామానికి చెందిన మిట్టా నాగభూషణం శ్రేష్టి(48)కి 12ఎకరాల పొలం ఉంది. అందులో 10 ఎకరాల్లో చీనీ పంట సాగు చేశారు. వరుస కరువులతో భూగర్భ జలాలు అడుగంటి చీనీ పంటకు సాగునీరులేక గత ఏడాది ఎండిపోయాయి. చెట్లను బతికించుకునేందుకు ఐదు బోరు బావులను తవ్వించారు.
అయినా భూగర్భ జలాలు లభించలేదు. చేసేదేమిలేక చీనీచెట్లను తెగనరికేశాడు. పంటను కాపాడుకోవడం కోసం బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. ఇతని పెద్ద కుమారుడు హరీష్ బీటెక్ చదువుతుండగా.. మిగిలిన ఇద్దరు కుమారులు సాయి, కార్తీక్‌లు డిగ్రీ చదువుతున్నారు. వీరి చదువుల కోసం కూడా కొంత అప్పు చేశాడు. మొత్తం అప్పు రూ.20 లక్షలకు పేరుకుపోయింది. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో చెల్లించే మార్గం లేక గురువారం సాయంత్రం ఇంటి వద్ద విషపు గుళికలు మింగాడు.
కుటుంబ సభ్యులు గమనించి ఆయన్ను పులివెందులలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ‘తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆయన అధికారంలోకి రాగానే అప్పులన్నీ మాఫీ అవుతాయని భావించాం. ఏడాది గడుస్తున్నా ఆ ఊసే లేదు. ఆయన ప్రకటించిన రుణ మాఫీ వడ్డీకి కూడా సరిపోలేదు. దీంతో అప్పులెలా తీర్చాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకున్నాడ’ని మృతుడి కుమారులు, భార్య లక్ష్మిదేవి గుండెలవిసేలా విలపించారు.