ఐఐటీలో కలకలం
చెన్నై, సాక్షి ప్రతినిధి, చిన్నమండెం : చదువులో చురుకుదనం. మెరిట్ విద్యార్థి. ప్రతిష్టాత్మకమైన సంస్థ ద్వారా స్కాలర్ షిప్పు. ఎంటెక్ పూర్తికాగానే రూ.50 వేల జీతంతో సిద్ధంగా ఉన్నతమైన ఉద్యోగం. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన చెన్నై ఐఐటీ విద్యార్థి నరం నాగేంద్రకుమార్ రెడ్డి (23)కి మరి ఏమి కష్టం వచ్చిపడిందో తెలియదు కానీ చేజేతులా ప్రాణాలు తీసుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు. జిల్లాలోని చిన్నమండెం మండలం కేశవపురం గ్రామానికి చెందిన రైతు దంపతులు నరం నారాయణరెడ్డి, కాంతమ్మలకు నాగేంద్రకుమార్ రెడ్డి ఒక్కడే కుమారుడు. వ్యవసాయం ద్వారా వచ్చే అరకొర ఆదాయంతో జీవిస్తూ కుమారున్ని చదివించుకున్నారు.
నగేంద్రకుమార్రెడ్డి కర్నూలు జిల్లా పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మంచి మార్కులతో బీటెక్ (త్రిబుల్‌ఈ) పూర్తి చేశాడు. ఇతని ప్రతిభను గుర్తించిన ఎల్అండ్టీ సంస్థ రూ.13 వేల స్కాలర్షిప్పుతో పాటు చెన్నై ఐఐటీలో ఎంటెక్ సివిల్ చది విస్తోంది. ఎంటెక్ పూర్తికాగానే రూ.50 వేల జీతంతో ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమైంది. మరో నాలుగు నెలల్లో ఎంటెక్ పూర్తి కానుంది. ఈనెల 19, 20 తేదీలు శని, ఆదివారాలు కాలేజీకి సెలవు కావడంతో స్వగ్రామం వెళ్లి సోమవారం ఉదయం ఐఐటీకి చేరుకున్నాడు. హాస్టల్లోని ఇతర విద్యార్థులంతా సోమవారం క్లాసులకు వెళ్లగా నాగేంద్రకుమార్ రెడ్డి మాత్రం గదిలోనే ఉండిపోయినట్లు సమాచారం.
రాత్రి 9 గంటలైనా ఇతను ఎక్కడా కనపడక పోవడంతో ఇతర విద్యార్థులు నాగేంద్రకుమార్ రెడ్డి ఉంటున్న ఐఐటీ హాస్టల్ గది (నెంబరు 60015) వెంటిలేటరు నుంచి చూశారు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేళాడుతున్న దృశ్యం కనిపించడంతో హతాశులయ్యారు. హాస్టల్ నిర్వాహకులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో తండ్రి నారాయణ రెడ్డికి సమాచారం ఇవ్వగా మంగళవారం ఉదయం ఆయన చెన్నైకి చేరుకున్నాడు. పోస్టుమార్టం జరుగుతున్న రాయపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శని, ఆదివారాలు తమ వద్ద సంతోషంగా గడిపాడని చెప్పారు.
అదే ఉత్సాహంతో చెన్నైకి బయలుదేరాడన్నారు. ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకునేంత తీవ్రమైన పరిస్థితులు తన కుమారునికి ఏవీ లేవని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రేమ వ్యవహారం, విఫలం వంటివి ఏమైనా ఉంటే తనకు చెప్పేవాడన్నారు. మంగళవారం పోస్ట్‌మార్టం ముగించి మృతదేహాన్ని తండ్రికి అప్పగించారు. కొట్టూరుపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎప్పుడూ తపించేవాడని తోటి విద్యార్థులు చెప్పారు.
పోటీ పరీక్షలు సైతం రాశాడన్నారు. ఎంటెక్‌లో ఓ సబ్జెక్ట్‌లో ఫెయిలయ్యాడని, అందువల్ల దిగులుతో ప్రాణాలు తీసుకుని ఉండవచ్చని మరికొందరు అనుమానం వ్యక్తం చే శారు. అందరితో చక్కగా మాట్లాడే నాగేంద్రకుమార్‌రెడ్డి మృతి చెందాడని తెలియగానే స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, గ్రామస్తులు అతని ఇంటి వద్దకు చేరుకుని కంట నీరు పెట్టారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని తల్లి కాంతమ్మ గుండెలవిసేలా విలపించింది.