30న దుబాయ్‌లో బి.నాగిరెడ్డి అవార్డు వేడుక
సాక్షి, దుబాయ్ : తెలుగు సినిమాకు స్వర్ణయుగం తేవడంలో కీలక పాత్ర పోషించిన నిర్మాత బి. నాగిరెడ్డి. తెలుగు సినిమాకు దశ-దిశ నిర్ధేశించిన అతి కొద్దిమంది నిర్మాతల్లో విజయా సంస్థ అధినేత బి.నాగిరెడ్డి ఒకరు. ‘పాతాళభైరవి’, ‘మిస్సమ్మ’, షావుకారు’, ‘మాయాబజార్’ ‘గుండమ్మ కథ’ ఇప్పటికీ ఎవరూ మరువలేని చిత్రాలుగా ఉన్నాయంటే నాగిరెడ్డి చూపిన నిర్మాణ విలువలే కారణం. నిర్మాతగా ఎన్నో పురస్కారాలు అందుకున్న ఆయన విజయ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన శత జయంతి సందర్భంగా 2012లో బి.నాగిరెడ్డి మెమోరియల్ అవార్డ్‌ను ఏర్పాటు చేశారు ఆయన కుటుంబసభ్యులు. ఆయన పేరు మీద ఏటా ఒక ఉత్తమ నిర్మాతకు అవార్డునిస్తున్నారు.
2017 ఏడాదికిగానూ బి. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డు ఎంపిక వేడుకను వేవ్ రిసొనెన్స్ ఈవెంట్స్ సహకారంతో దుబాయ్‌లో మార్చి 30న సాయంత్రం 5.30 గంటలకు, ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియమ్‌లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుమతి వాసుదేవ్ (కాన్సులర్ కాన్సులేట్ ఆఫ్ ఇండియా-యూఏఈ), ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరుకానున్నారు. మాధవపెద్ద సురేష్ ఆధ్వర్యంలో మూజ్యక్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. పవన్ చరణ్, నిత్యా సంతోషిని, శ్రీలత, వినోద్ బాబులు తమ గాత్రంతో అతిథులను అలరించన్ననారు.