nagole metro rail depot
-
నాగోల్: నిర్లక్ష్యానికి యువకుడు బలి.. ఈ పాపం ఎవరిది?
సాక్షి, ఉప్పల్: అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఈ పాపం తమది కాదంటే.. తమది కాదంటూ రెండు శాఖల అధికారులు ఎవరికి వారు నెట్టేసుకుంటున్నారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, జవాబుదారి తనం కొరవడటంతో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద దిగిన ప్రయాణికుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచాడు. ఎస్ఐ అంజయ్య తెలిపిన ప్రకారం.. నాగోల్ మోహన్‌నగర్ ప్రాంతానికి చెందిన దస్తీ నవనీత్(35) కూకట్‌పల్లిలోని మెడ్‌ప్లస్‌లో స్టోర్ సూపర్వైజర్. నిత్యం నాగోల్ మెట్రోస్టేషన్ పార్కింగ్‌లో తన వాహనాన్ని పార్కు చేసి కూకట్‌పల్లికి వెళ్తాడు. తిరుగు ప్రయాణంలో నాగోల్ మెట్రో స్టేషన్లో దిగి పార్కు చేసిన వాహనాన్ని తీసుకెళ్తుంటాడు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి చివరి ట్రైన్లో నాగోల్ స్టేషన్లో దిగాడు. పార్కు చేసిన వాహనాన్ని తీసుకునేందుకు ఫుట్‌పాత్ వద్ద ఉన్న గ్రిల్ పైనుంచి దాటేందుకు ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న జీహెచ్ఎంసీ వీధి లైట్ల స్తంభానికి గ్రిల్‌కు విద్యుత్ ప్రసారం ఉండటంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే భూమిలో నుంచి వేసిన విద్యుత్ వైర్లు తేలడం. వర్షం కురవడంతో విద్యుత్ ప్రసారం అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. సోదరుడు కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆడి కారు యాక్సిడెంట్: ఎన్నో అనుమానాలు.. అసలు ఏం జరిగింది? చెప్పిన కూర వండలేదనే కోపంతో భార్యని.. -
ఆ మూడు మెట్రో స్టేషన్లలో కిటకిట..
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మెట్రో రైలు కూత పెట్టింది. దీంతో ఎన్నాళ్ల నుంచో ఊరించిన మెట్రో రైలు ఎక్కేందుకు నగరవాసులు ఉత్సాహం చూపించారు. ఉదయం ఆరు గంటలకు ఒక రైలు నాగోలు స్టేషన్లో, మరో రైలు మియాపూర్ స్టేషన్లో బయల్దేరాయి. తెల్లవారుజామే అయినప్పటికీ మియాపూర్, అమీర్‌పేట, నాగోల్ మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కళకళలాడాయి. మెట్రో రైలులో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. మెట్రో రైలులో ప్రయాణిస్తున్న వారి ముఖంలో సంతోషం, ఇక నుంచి ప్రయాణం సాఫీగా సాగుతుందన్న భరోసా కనిపించింది. కుదుపుల్లేని, ఏసీ ప్రయాణాన్ని ప్రయాణికులు ఆస్వాదించారు. ఇక తొలి టికెట్ కొన్న ప్రయాణీకుడికి మెట్రో అధికారులు గిఫ్ట్ అందజేశారు. ప్రతి పావుగంటకో రైలు చొప్పున మొత్తం 18 రైళ్లు తిరగనున్నాయి. మెట్రో రాకతో నాగోలు నుంచి అమీర్‌పేట ప్రయాణ సమయం 42 నిమిషాలకు తగ్గిపోయింది. మెట్రో రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి పది గంటల వరకు నడవనున్నాయి. ప్రతీ 15 నిమిషాలకో రైలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. రైల్లో ఒకేసారి వెయ్యి మంది వరకు ప్రయాణించవచ్చు. మరోవైపు తొలిసారి మెట్రో ఎక్కిన హైదరాబాదీలు...ఫొటోలు, సెల్ఫీలు, వాట్సాప్, ఫేస్బుక్ అద్యంతం సంతోషాల షేరింగే కనిపించింది. ఫస్ట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అంటూ ఒకరంటే, గాల్లో తేలినట్టుందే అని మరొకరు కవితాత్మకంగా పోస్టింగ్‌లు పెట్టారు. ఆనందం, సంతోషం ఎలా ఉన్నా.. టికెట్ ధరలు మాత్రం కొందరిని ఆందోళనకు గురి చేశాయి. ఆర్టీసీ బస్సుల ధర కంటే ఎక్కువున్నాయని కొందరంటే, సమయానికి చేరుకుంటాంలే అని మరికొందరు అన్నారు. ఇక పార్కింగ్ విషయంలో ఇంకాస్తా క్లారిటీ రావాలంటున్నారు మరికొందరు. స్టేషన్ల పరిధిలో స్మార్ట్ బైకులు అందుబాటులో ఉన్నా.. తమ సొంత వాహానాల పార్కింగ్ ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నారు. -
పట్నం బండి కదిలిందండి
* ప్రయోగ పరీక్ష విజయవంతం * ఎలివేటెడ్ పట్టాలపై దూసుకెళ్లిన రైలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఒక నూతన ప్రయాణం మొదలైంది.. నగర వాసుల కలల మెట్రోరైలు పట్టాలపై పరుగులు తీసింది. తొలి ప్రయోగ పరీక్ష విజయవంతంగా పాసైంది. గురువారం సాయంత్రం సరిగ్గా 4.30 గంటలకు ‘ఏ న్యూ జర్నీ బిగిన్స్ ..అండ్ వీ ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్’ అన్న నినాదం రాసి ఉన్న మూడు బోగీలు, ఇంజిన్‌తో ఉన్న ఎలక్ట్రిక్ మెట్రో రైలు నాగోల్ మెట్రో డిపో నుంచి ఎలివేటెడ్ మెట్రో పట్టాలపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించి సర్వే ఆఫ్ ఇండియా దగ్గర ఆగింది. ఈ ప్రయోగ పరీక్ష విజయవంతం కావడం పట్ల ఎల్అండ్టీ అధికారులు హర్షం వ్యక్తంచేశారు. మెట్రో ప్రయోగ పరీక్ష జరుగుతున్న విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మెట్రో కోచ్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఈ ప్రయోగ పరీక్ష నిర్వహించామని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. గంటపాటు ప్రయోగ పరీక్ష మూడు ఏసీ బోగీలున్న మెట్రో రైలు డ్రైవర్‌లేని సాంకేతికత ఆధారంగా నడిచేది అయినప్పటికీ ప్రయోగ పరీక్ష కావడంతో డ్రైవరు పర్యవేక్షణలోనే నడిపించారు. ఎల్అండ్టీ నిపుణులు ట్రాక్‌ను క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతనే రైలు ముందుకెళ్లేందుకు అనుమతించారు. సుమారు గంటపాటు ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. కాగా, నాగోల్-ఉప్పల్ మార్గంలో వాహనదారులు మెట్రో రైలు పరుగులు పెట్టడాన్ని ఆసక్తిగా తిలకించారు. సెల్ఫోన్లలో ఈ అద్భుతాన్ని బంధించారు. మెట్రో రైలు వేగం, గమనం, సిగ్నలింగ్, ట్రాక్, లోడు సామర్థ్యం వంటి పరీక్షలన్నీ పాసైన తర్వాత త్వరలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఎల్అండ్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపాయి.