
పట్నం బండి కదిలిందండి
* ప్రయోగ పరీక్ష విజయవంతం
* ఎలివేటెడ్ పట్టాలపై దూసుకెళ్లిన రైలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఒక నూతన ప్రయాణం మొదలైంది.. నగర వాసుల కలల మెట్రోరైలు పట్టాలపై పరుగులు తీసింది. తొలి ప్రయోగ పరీక్ష విజయవంతంగా పాసైంది. గురువారం సాయంత్రం సరిగ్గా 4.30 గంటలకు ‘ఏ న్యూ జర్నీ బిగిన్స్ ..అండ్ వీ ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్’ అన్న నినాదం రాసి ఉన్న మూడు బోగీలు, ఇంజిన్‌తో ఉన్న ఎలక్ట్రిక్ మెట్రో రైలు నాగోల్ మెట్రో డిపో నుంచి ఎలివేటెడ్ మెట్రో పట్టాలపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించి సర్వే ఆఫ్ ఇండియా దగ్గర ఆగింది.
ఈ ప్రయోగ పరీక్ష విజయవంతం కావడం పట్ల ఎల్‌అండ్‌టీ అధికారులు హర్షం వ్యక్తంచేశారు. మెట్రో ప్రయోగ పరీక్ష జరుగుతున్న విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మెట్రో కోచ్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఈ ప్రయోగ పరీక్ష నిర్వహించామని హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి.
గంటపాటు ప్రయోగ పరీక్ష
మూడు ఏసీ బోగీలున్న మెట్రో రైలు డ్రైవర్‌లేని సాంకేతికత ఆధారంగా నడిచేది అయినప్పటికీ ప్రయోగ పరీక్ష కావడంతో డ్రైవరు పర్యవేక్షణలోనే నడిపించారు. ఎల్‌అండ్‌టీ నిపుణులు ట్రాక్‌ను క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతనే రైలు ముందుకెళ్లేందుకు అనుమతించారు. సుమారు గంటపాటు ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు.
కాగా, నాగోల్-ఉప్పల్ మార్గంలో వాహనదారులు మెట్రో రైలు పరుగులు పెట్టడాన్ని ఆసక్తిగా తిలకించారు. సెల్‌ఫోన్‌లలో ఈ అద్భుతాన్ని బంధించారు. మెట్రో రైలు వేగం, గమనం, సిగ్నలింగ్, ట్రాక్, లోడు సామర్థ్యం వంటి పరీక్షలన్నీ పాసైన తర్వాత త్వరలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపాయి.