నల్లమల రక్షణకు చర్యలు
పెద్దదోర్నాల, న్యూస్‌లైన్: వనాలు..వన్యప్రాణులు ప్రకృతి వరాలు. అడవులను సంరక్షించడం మన కర్తవ్యం. ఇందులో భాగంగా దక్షిణ భారతదేశంలో ప్రాముఖ్యత సంతరించుకున్న నల్లమల అభయారణ్యాల పరిరక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అమూల్యమైన వృక్ష సంపద ను స్మగ్లర్ల బారి నుంచి కాపాడేందుకు, వన్యప్రాణులను వేటగాళ్ల నుంచి రక్షించేందుకు, వేసవిలో అగ్నికీలల నుంచి అటవీప్రాంతాన్ని సంరక్షించేందుకు ఆ శాఖాధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.
జీవ వైవిధ్యానికి నెలవు...
నల్లమల అడవులు ప్రకాశం, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్గొండ, గుంటూరు జిల్లాల్లో 9 వేల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. వాటిలో 3,568 చ.కిమీలను కేంద్ర ప్రభుత్వం 1983లో అభయారణ్యంగా ప్రకటించింది. అభయారణ్యంలో పులులతో పాటు చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు, హైనాలు, నెమళ్లతో పాటు 70 రకాల క్షీరదాలు, సరీసృపాలు, ఎన్నోరకాల వృక్షాలు, ఔషధ మొక్కలు ఉన్నాయి. వేసవిలో జరిగే అగ్నిప్రమాదాల వల్ల వృక్ష సంపదకు భారీస్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో వాటిని సంరక్షించేందుకు అటవీ ప్రాంతంలో ఫైర్లైన్లు, బేస్‌క్యాంపులను ఏర్పాటు చేశారు.
బేస్‌క్యాంపులతో నిరంతర నిఘా:
డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన బేస్‌క్యాంపులు అటవీ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. దోర్నాల రేంజ్ పరిధిలో రోళ్లపెంట, తుమ్మలబయలు, చిన్నమంతనాల, పెదారుట్ల, కుదప, పెద్దపెంట, ఎదురుపడియ, గంజివారిపల్లె ఫారెస్టు రేంజ్ పరిధిలో పాలుట్ల, ఇష్టకామేశ్వరి ఆలయం, యర్రగొండపాలెం రేంజ్లో పెద్దమ్మ గిరిజన గూడెం, దద్దనాల ప్రాంతాల్లో బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెట్టారు. ఒక్కో బేస్ క్యాంప్ బృందంలో ఏడుగురు సభ్యులుంటారు. వారిలో అటవీశాఖకు సంబంధించి ఏబీఓలు, మిగిలిన ఐదుగురు ప్రొటెక్షన్ వాచర్లున్నారు. దీంతో పాటు క్యాంప్ సెక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇద్దరు స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది అటవీ సంరక్షణ నిమిత్తం రేంజి పరిధిలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రత్యేక వాహనం, సమాచార వ్యవస్థను పటిష్ట పరిచేందుకు వైర్లెస్ నెట్‌వర్క్‌తో కూడిన వాకీటాకీలు సమకూర్చారు.
అటవీ శాఖకు సహకరించండి:
శ్రీనివాసులు, రేంజి అధికారి, పెద్దదోర్నాల
నల్లమల అటవీ ప్రాంతంలో ప్రయాణించే వాహనాలు వేగ నియంత్రణ పాటించాలి. అడవుల్లో అగ్గి నివారణకు అభయార ణ్యంలో అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను నిషేధించాం. అలాగే అటవీ గ్రామాల ప్రజలు, శ్రీశైలం మల్లన్న సన్నిధికి వెళ్లే వారు అడవిలో అగ్గి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడైనా అగ్గి కనపడితే దాన్ని ఆర్పేందుకు అటవీశాఖకు సహకరించాలి.