నాందేడ్ సీటుపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ
సాక్షి, ముంబై: నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ, నాందేడ్ అభ్యర్థిత్వంపై ఇంకా తేల్చలేదు. ఆదర్శ్ సోసైటీ అవినీతి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, లేదంటే ఆయన సతీమణి అమితా చవాన్‌కు కాంగ్రెస్ టికెటిస్తుందా అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ భాస్కర్‌రావ్ ఖతగావ్కర్ విజయంపై నమ్మకం లేకపోవడంతో చవాన్ తనకైనా టికెటివ్వండి? లేకపోతే నా సతీమణికైనా సీటు కేటాయించండని కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించినట్టు తెలుస్తోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో కుంభకోణంలో ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చిన సీనియర్ నేత సురేశ్ కల్మాడీని కాదని, పుణే లోక్‌సభ నియోజకవర్గం నుంచి విశ్వజీత్ కదంకు అవకాశమివ్వడంతో ఇక్కడ కూడా అలాంటిదేమైనా జరుగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.
బరిలో అశోక్‌చవాన్, లేదంటే ఆయన భార్య?
నాసిక్‌లో పట్టున్న మాజీ సీఎం అశోక్ చవాన్, లేకుంటే ఆయన సతీమణికే టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆయన మద్దతుదారులు కూడా ఇదే చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ భాస్కర్‌రావ్ ఖతగావ్కర్ను తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అశోక్ చవాన్‌కు భాస్కర్‌రావ్ ఖతగావ్కర్ తోడల్లుడు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. దీంతో ఆయన విజయంపై అశోక్ చవాన్‌కు నమ్మకం లేకపోవడంతోనే భాస్కర్‌రావ్‌ను తప్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయమై అశోక్ చవాన్ మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. గత ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా భాస్కర్‌రావ్ విజయం సాధించినా, బీజేపీ అభ్యర్థి సంభాజీ పవార్‌కు 2.75 లక్షల ఓట్లు వచ్చాయి. అశోక్ చవాన్ సీఎంగా ఉన్న సమయంలోనే ప్రత్యర్థికి అన్ని ఓట్లు పోలవడం విశేషం. మరోవైపు ఈసారి గుజరాత్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం ఉండే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన ఈ స్థానంలో పరాజయం ఎదురైతే రాష్ట్ర రాజకీయాల్లో అశోక్ చవాన్ ప్రతిష్టకు భంగం వాటిల్లే అవకాశాలున్నాయి. దీంతోనే అశోక్ చవాన్ స్వయంగా ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నారని తెలిసింది. ఒకవేళ టికెట్ ఇవ్వకుంటే ఆయన భార్య అనితా చవాన్‌ను బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. తనకు టికెట్ ఇవ్వడంలేదని తెలిసిన భాస్కర్‌రావ్ ఖతగావ్కర్ టికెట్ కోసం తనదైన శైలిలో ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన విజయంపై నమ్మకం లేకపోవడంతోనే టికెట్ ప్రకటించడంపై జాప్యం జరుగుతుందని తెలుస్తోంది.
అశోక్ చవాన్‌కు అగ్నిపరీక్ష...?
మాజీ సీఎం అశోక్ చవాన్‌కు నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం అగ్నిపరీక్షగా మారింది. ఈసారి ముఖ్యమంత్రిగా కూడా లేకపోవడం, ఆదర్శ్ కుంభకోణంలో వస్తున్న ఆరోపణలతో సతమతమవుతున్న అశోక్ చవాన్‌ను ఎదుర్కొనేందుకు ఇదే సరైన సమయంగా బీజేపీ భావిస్తోంది. ప్రణాళిక ప్రకారం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బీజేపీ నుంచి ఎన్సీపీలో చేరిన మాజీ ఎంపీ డీబీ పాటిల్‌ను మళ్లీ బీజేపీలో చేర్చుకుంది. నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ బీజేపీతోపాటు ఈసారి ఎంఐఎం కూడా తన శక్తిని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముస్లిం ఓటర్లను దృష్టిలో ఉంచుకుని పావులు కదుపుతోంది.