నిలేకని నియామకంపై ఆరోపణలు
సాక్షి, బెంగళూరు: వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య ఉన్న విభేదాలను చక్కబెట్టడానికి వచ్చిన నందన్ నిలేకని ఎంపికపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ఫోసిస్ చైర్మన్గా నందన్ నిలేకనిని నియమించే విషయంలో కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాను ఉల్లంఘించిందని అడ్వజరీ సంస్థ స్టేక్హోల్డర్స్ ఎంపవర్మెంట్ సర్వీసెస్(ఎస్ఈఎస్) ఆరోపించింది. కంపెనీ సీఈవో, ఎండీగా ఉన్న విశాల్ సిక్కా అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో, అనంతరం తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టులో నందన్ నిలేకని ఇన్ఫోసిస్లోకి పునరాగమనం చేశారు. సరియైన బోర్డు మీటింగ్ నిర్వహించకుండానే నిలేకని ఎంపిక జరిగిందని ఎస్ఈఎస్ పేర్కొంది. చైర్మన్గా ఎంపికైన నిలేకని, బోర్డు మీటింగ్లో పాల్గొన్నారని, అంటే ఆ నిర్ణయం ముందే తీసుకున్నారని ఎస్ఈఎస్ ఎండీ జెఎన్ గుప్తా అన్నారు.
బోర్డు రెండు విడత సమావేశంలో నిలేకని నియామకంపై ప్రకటన వచ్చిందని కంపెనీకి చెందిన వర్గాలు చెప్పాయి. తొలి విడత సమావేశం మాజీ చైర్మన్ ఆర్ శేషసాయి సమక్షంలోనే జరిగిందని పేర్కొన్నాయి. విశాల్ సిక్కా, మరో ఇద్దరు బోర్డు సభ్యలు జెఫ్రీ లెమాన్, జాన్ ఎట్చెమెండీ రాజీనామాలు ఆమోదించిన అనంతరం, నిలేకని ఇన్ఫీలో జాయిన్ అయ్యారు. అనంతరం శేషసాయి కూడా బోర్డు చైర్మన్గా తప్పుకున్నారు. కో-చైర్మన్ రవి వెంకటేషన్ కూడా రాజీనామా చేశారు. అయితే ఆయన బోర్డులో కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ తతంగమంతా రాజీ పద్ధతిలో జరిగినట్టు ఎస్ఈఎస్ ఆరోపించింది. బోర్డు రూమ్ బయటనే ఇదంతా జరిగిందని పేర్కొంది. బయట తీసుకున్న నిర్ణయాలను, బోర్డు మీటింగ్లో వెల్లడించడం, కార్పొరేట్ గవర్నెర్స్ ప్రమాణాలకు విరుద్ధమని తెలిపింది. అయితే కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలోనే ఇన్ఫోసిస్లో వివాదం చెలరేగడం గమనార్హం.