ప్రతిభ గల కళాకారులకు అవార్డులు
పాత గుంటూరు: గత టీడీపీ హయాంలో సిఫార్సులకే అత్యధిక ప్రాధాన్యం ఉండేదని, అనర్హులకే ఉత్తమ అవార్డులు లభించేవని, ముఖ్యమంత్రి బావమరిదో, అల్లుడో చెప్పిన వారికే న్యాయనిర్ణేతలు అవార్డులు ప్రకటించేవారని ప్రముఖ సినీ నటుడు, రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి విమర్శించారు. శనివారం గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్ట్ర చలనచిత్ర టీవీ, నాటక, రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. సభకు సంస్థ ఎండీ టి.విజయ్‌కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో కళాకారులకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో కష్టపడి, అర్హత సాధించే కళాకారులకు అవార్డులు అందజేయాలని సూచించినట్టు తెలిపారు. ఆ మేరకు ప్రతిభ గల కళాకారులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.
గతంలో నంది నాటకోత్సవాలు చూడాలన్నా, కళాకారులు ప్రదర్శనలు చేయాలంటే హైదరాబాద్ రవీంద్రభారతికి రావాల్సి ఉండేదని, కళాకారుల కష్టాన్ని నాటి సీఎం వైఎస్సార్ గుర్తించి అన్ని జిల్లాల్లో ఆడిటోరియాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కళాకారుల విలువను పెంచేందుకే ఆ మహనీయుడి పేరుతో వైఎస్సార్ రంగస్థలం పురస్కారం ఐదు లక్షల రూపాయలతో అందిస్తున్నట్టు తెలిపారు. 27 మంది సీనియర్ కళాకారులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారని వివరించారు.
పారదర్శకతకు పెద్దపీట: మంత్రి చెల్లుబోయిన
ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రసంగిస్తూ పారదర్శకతకు పెద్దపీట వేసి, ప్రతిభ కలిగిన కళాకారులను ప్రోత్సహించేందుకే నంది నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న కళలు, టీవీ, సినిమా, యూట్యూబ్ రూపంలో ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో పేద వర్గాలకు చెందిన నటులను గుర్తించి వారి ప్రతిభ ఆధారంగా అవార్డులు అందిస్తున్నట్టు చెప్పారు. 73 అవార్డులను దక్కించుకోవడం కోసం 38 నాటక సమాజాలు, 1200 మంది కళాకారులు నాటక ప్రదర్శనల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు.
టీడీపీ హయాంలో నాటక రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, వసతి ఏర్పాట్లు సైతం చేయకుండా కళాకారులను ఇబ్బందుల గురిచేశారని మండిపడ్డారు. కళా రంగాన్ని ప్రోత్సహించి, కళాకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఇలాంటి మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ సందర్భంగా తొలి రోజు ప్రదర్శంచిన నాలుగు నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.