డూటా అధ్యక్షురాలిగా నందిత
న్యూఢిల్లీ: ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రొఫెసర్ నందితా నారాయణ్ ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం (డూటా) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సెమిస్టర్ విధానాన్ని కూడా తప్పుబట్టిన ఈ విద్యావేత్త వామపక్షాల అనుబంధ సంస్థ ప్రజాస్వామ్య అధ్యాపకుల సమాఖ్య (డీటీఎఫ్) నుంచి బరిలోకి దిగారు. ఆమెకు మొత్తం 2,705 ఓట్లు వచ్చాయి. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గణితశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేసే నందిత, తన సమీప ప్రత్యర్థి అశ్వినీ సర్కార్‌ను 700 ఓట్ల తేడాతో ఓడించారు.
అశ్విని దేశబంధు కాలేజీలో పనిచేస్తున్నారు. ఈమెకు 1,909 ఓట్లు వచ్చాయి. ‘డీయూ వైస్‌చాన్స్‌లర్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి అధ్యాపకులు మద్దతు పలుకుతున్నారని చెప్పడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఎలాంటి సంప్రదింపులూ లేకుండా ప్రారంభించిన ఎఫ్‌వైయూపీని అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు మరోసారి రుజువయింది’ అని డూటా మాజీ కార్యదర్శి ఎస్డీ సిద్దిఖీ అన్నారు. డూటా అధ్యక్ష పదవికి పోటీ పడ్డ ప్రమోద్ శర్మ, షిబా పాండాకు వరుసగా 818, 561 ఓట్లు వచ్చాయి. వివిధ అధ్యాపక సంఘాలకు చెందిన 15 మంది అధ్యాపకులను డూటా కార్యనిర్వాహక మండలి సభ్యులుగానూ ఎన్నుకున్నారు. ఈ పదవులకు మొత్తం 22 మంది పోటీపడ్డారు.
ఈ మండలి తమ సభ్యుల నుంచి కొందరిని ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారులుగా ఎన్నుకుంటుంది. ఒక్కో పదవికి ఎన్నిక కావడానికి కనీసం తొమ్మిది ఓట్లు అవసరం. డీటీఎఫ్ అధ్యక్ష పదవిని చేజిక్కించుకోగా, భారత జాతీయ అధ్యాపకుల మహాసభ (ఇంటెక్), అకడమిక్స్ ఫర్ యాక్షన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ కూడా వరుసగా ఐదు, మూడు స్థానాలను సాధించాయి. శుక్రవారం ఉదయం పదింటి నుంచి సాయంత్రం ఐదింటి దాకా నిర్వహించిన పోలింగ్‌కు దాదాపు ఆరువేల మంది హాజరయ్యారు. మొత్తం 6,474 ఓట్లలో 471 ఓట్లు చెల్లలేదు.