న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం టీచర్ల సంఘం (డ్యూటా)తో వైస్ చాన్సలర్ దినేశ్‌సింగ్‌తో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు, వేతనాలు, గైర్హాజరు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న అంశాలను ఈ సందర్భంగా డ్యూటా ప్రతినిధుల బృందంతో వీసీ చర్చించారు. ఈ విషయాన్ని డ్యూటా అధ్యక్షుడు నందితా నారాయణ్ తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లో రెగ్యులర్ (ఎస్‌ఓఎల్) డిగ్రీ కోర్సును కొనసాగించాలంటూ ఆందోళనకు దిగినందుకుగాను సస్పెన్షన్‌కు గురైన ఎస్‌ఓఎల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎన్‌కే అగర్వాల్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వీసీని కోరినట్టు చెప్పారు. అయితే తాము లేవనెత్తిన ఏ అంశానికీ ఆయన సరిగా స్పందించలేదన్నారు.
ఇది అత్యంత దురదృష్టకరమన్నారు. వేరే సమావేశంలో అత్యవసరంగా పాల్గొనాల్సి ఉండడంతో ఆయన వెళ్లక తప్పలేదని అన్నారు. అధ్యాపకులు వీలైనంత మేర సెలవులు పెట్టకుండా చూడాలని తమను వీసీ కోరినట్టు నారాయణ్ చెప్పారు. ఇందుకు తమ సహకారం అవసరమని కూడా కోరినట్టు చెప్పారు. మరోవైపు తాము గైర్హాజరీని ఎంతమాత్రం ప్రోత్సహించడం లేదని డ్యూటా ప్రతినిధులు చెప్పారు. అంతా సవ్యంగానే సాగుతోందన్నారు. బోధన ప్రక్రియ సజావుగా సాగేవిధంగా చేసేందుకు విద్యార్థులు, అధ్యాపకుల సమ్మేళనంగా ఏర్పాటుచేసిన కమిటీ శాయశక్తులా ప్రయత్నిస్తోందన్నారు. సమావేశాలు నిరంతరంగా సాగేందుకు సంబంధించిన ప్రక్రియను డీయూ పరిపాలనా విభాగం కొనసాగిస్తుందనే ఆశాభావం తమకు ఉందన్నారు. కాగా వీసీతో జరిగిన సమావేశంలో పైన పేర్కొన్న అంశాలతోపాటు వేతనాల్లో కోతలు, పదోన్నతి నిరాకరణ తదితర అంశాలు చర్చకు వచ్చాయన్నారు.
డ్యూటాతో వీసీ భేటీ
Published Tue, Jun 3 2014 10:04 PM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement