నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం చేపట్టిన అడ్మిషన్ల ప్రక్రియ రసాభాసగా మారింది. ఇందుకు కారణం ఆదివారం రాత్రి నుంచి డీయూ అధికారిక వెబ్‌సైట్ మొరాయించడమే. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. డీయూ వైస్‌చాన్సలర్ దినేశ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశాయి. కాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పొందే వీలులేకపోవడంతో డీయూ పరిధిలోని కళాశాలల ప్రాంగణాలు విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి.
న్యూఢిల్లీ: ఆదిలోనే హంసపాదు అన్నట్టుంది ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) చేపట్టిన అడ్మిషన్ల ప్రక్రియ. తొలిరోజే వెబ్‌సైట్ కుప్పకూలడంతో ఆయా కేంద్రాల వ ద్ద గందరగోళం నెలకొంది. నిర్వహణాలోపం ఆందోళనలకు కూడా దారితీసింది. ఉత్తర క్యాంపస్ పరిధిలోని దౌలత్‌రాం కళాశాలలోని కేంద్రంలో సోమవారం ఉదయం దరఖాస్తులను అందజేసిన తర్వాత కూడా ప్రవేశాల కోసం వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించలేదు. ఆగ్రహించిన విద్యార్థులంతా ఒక్కసారిగా ఆందోళనలకు దిగడంతో కళాశాల యాజమాన్యం దరఖాస్తుల విక్రయాన్ని నిలిపివేసింది. అయితే కొద్దిగంట ల త రువాత మళ్లీ విక్రయించింది. ఇక షహీద్ గురుదేవ్ తేజ్ బహదుర్ ఖల్సా కళాశాల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రవేశాల కోసం వందలాదిమంది విద్యార్థులు ఈ కళాశాలకు రావడంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఉద యం తొమ్మిది గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంటదాకా నగరంలోని 18 కేంద్రాలలో దరఖాస్తులను అందుబాటులో ఉంచారు. ఆన్‌లైన్‌లో మాత్రం ఎప్పుడైనా పొందే వీలు కల్పించారు.
అయితే ఆదివారం రాత్రి నుంచే ఈ వెబ్‌సైట్ పనిచేయడం మానేసింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో దరఖాస్తుల కొనుగోలు కోసం విద్యార్థులంతా డీయూ పరిధిలోని వివిధ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద పెద్దసంఖ్యలో బారులుతీరారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ విషయమై చండీగఢ్ నుంచి నగరానికి వచ్చిన విద్యా ఆనంద్ అనే విద్యార్థి మాట్లాడు తూ వెబ్‌సైట్ మొరాయించింది. దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుపడడం లేదు. దీంతో నేరుగా ఇక్కడికే వచ్చి కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పాడు. ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు లోకేశ్ చుగ్‌మాట్లాడుతూ గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది ఢిల్లీ వర్సిటీ తగు ఏర్పాట్లు చేయలేదని, గుడారాలు వేయలేదని, తాగునీరు అందుబాటులో లేదని విమర్శించాడు. డీయూ వెబ్‌సైట్ సరిగా పనిచేయకపోవడం, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో వైస్‌చాన్సలర్ దినేశ్‌సింగ్ దిష్టిబొమ్మను ఏబీవీపీ దహనం చేసింది.
కుప్పకూలిన వెబ్‌సైట్
Published Mon, Jun 2 2014 9:56 PM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM
Advertisement
Advertisement