లాంఛనంగా రద్దైన ఎఫ్‌వైయూపీ | Delhi University rolls back four-year undergraduate programme, VC Dinesh Singh says | Sakshi
Sakshi News home page

లాంఛనంగా రద్దైన ఎఫ్‌వైయూపీ

Published Sat, Jun 28 2014 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

లాంఛనంగా రద్దైన ఎఫ్‌వైయూపీ

లాంఛనంగా రద్దైన ఎఫ్‌వైయూపీ

 సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఎఫ్‌వైయూపీ)ను ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) శనివారం లాంఛనంగా రద్దు చేసింది. దీనిని తొలగించాలన్న ప్రతిపాదనకు యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపాయి. దీంతో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను రద్దు చేస్తున్నట్లు వైస్-చాన్స్‌లర్ దినేష్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. అత్యవసరంగా సమావేశమైన అకడమిక్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మూడేళ్ల డిగ్రీ కోర్సును అమలు చేయాలని, 2012-13 విద్యా సంవత్సరంలో అనుసరించిన పద్ధతి ప్రకారం అడ్మిషన్లు జరపాలంటూ తీర్మానించాయి.
 
 రెండు కౌన్సిళ్లు ఈ తీర్మానాన్ని భారీ మెజారిటీతో ఆమోదించినా, ఎఫ్‌వైయూపీపై మాత్రం చర్చించలేదు. అకడమిక్ కౌన్సిల్‌లోని 90 మంది సభ్యుల్లో ఎనిమిది మంది తీర్మానాన్ని వ్యతిరేకించారు. నాలుగేళ్ల కోర్సుపై డీయూ చర్చ జరపలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.  చర్చ లేకుండానే అకడమిక్ కౌన్సిల్ మూడేళ్ల డిగ్రీ కోర్సుకు ఆమోదం తెలపడం దురదృష్టకరమని తీర్మానాన్ని వ్యతిరేకించిన అకడమిక్ కౌన్సిల్ సభ్యుడు సంజయ్‌కుమార్ అన్నారు. అకడమిక్ కౌన్సిల్ ఏకపక్షంగా కేవలం రెండు నిమిషాల్ల్లో తీర్మానాన్ని ఆమోదించిందని ఆయన చెప్పారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లోనూ తీర్మానం భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. వైస్‌చాన్స్‌లర్ దినేష్ సింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని, ఐదు నిమిషాల్లో ఆమోదం లభించిందని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ఆదిత్య నారాయణ్ మిశ్రా చెప్పారు.
 
 ఆందోళనకు దిగిన బీ.టెక్ విద్యార్థులు
 ఎఫ్‌యూవైపీని డీయూ అధికారికంగా రద్దు చేసిన నేపథ్యంలో ఈ కోర్సు చదువుతున్న బీ.టెక్, బీ.ఎంఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్లుల భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా వైస్ చాన్స్‌లర్ 12 మంది కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో నియమించిన కమిటీ అడ్మిషన్ విధివిధానాలను రూపొందిస్తోంది. ఈ కమిటీయే బీ.టెక్ కోర్సు భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకుంటుందని మిశ్రా చెప్పారు. ఈ కమిటీ తన సిఫార్సులను శనివారం రాత్రి ఢిల్లీ యూనివర్సిటీకి అందజేస్తుంది. వీటి ప్రకారం సోమవారం నుంచి అడ్మిషన్లు మొదలు కావచ్చని భావిస్తున్నారు. తమ కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్చవద్దని డిమాండ్ చేస్తూ వందలాది మంది  బీ.టెక్ విద్యార్థులు వీసీ కార్యాలయం ఎదుట శనివారం ప్రదర్శన జరిపారు. నాలుగేళల కోర్సుపై చెలరేగిన వివాదం సమసిపోవడంతో ప్రస్తుత విద్యాసంవత్సరం అడ్మిషన్లపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయిందని డీయూ అధికారి ఒకరు అన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement