నేటినుంచి అడ్మిషన్లు షురూ
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ) రద్దయిన నేపథ్యంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) మంగళవారం నుంచి అడ్మిషన్ ప్రక్రియ ఆరంభించనుంది. ఈ మేరకు సోమవారం రాత్రి వరకు మొదటి కటాఫ్ జాబితాలను విడుదల చేశాయి. మొదటి కటాఫ్ జాబితా ఆధారంగా జూలై మూడు వరకు అడ్మిషన్లు జరుగుతాయి. ఎఫ్‌వైయూపీపై చెలరేగిన వివాదం కారణంగా డీయూలో అడ్మిషన్ ప్రక్రియ వారం రోజులు ఆలస్యమయింది. గత మంగళవారం ప్రారంభం కావలసిన ప్రవేశాలు ఈ మంగళవారం మొదలవుతున్నాయి. ఇదిలాఉండగా 2014-15 విద్యాసంవత్సరానికి బీ.టెక్ కోర్సును (ఎఫ్‌వైయూపీ) రద్దుచేయాలన్న డీయూ నిర్ణయాన్ని ప్రస్తుత బీ.టెక్ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు.
నాలుగేళ్ల బీటెక్ కోర్సును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ కార్యాలయం ఎదుట బీ.టెక్, బీఎంఎస్ విద్యార్థులు ఆదివారం ఆందోళన నిర్వహించడం తెలిసిందే. యూజీసీ నిర్లక్ష్యం చేస్తే న్యాయస్థానానికి వెళ్లేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ఇరానీ నివాసంలోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ విషయమై ఆందోళనలో పాల్గొన్న రేఖ అనే విద్యార్థిని మాట్లాడుతూ బీఎంఎస్‌ను మూడేళ్ల కోర్సుగా మారిస్తే ఎన్నో ఇబ్బందులు వస్తాయంది. మంగళవారం నుంచి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని పేర్కొంది.
బీఎంఎస్ విద్యార్థుల ఆందోళన
డీయూలో బీఎంఎస్ (బ్యాచిలర్ ఇన్ మేనేజ్‌మెంట్ స్టడీస్) నాలుగేళ్ల కోర్సుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వైఖరిపై ఆందోళన వ్యక్తమవుతోంది. బీఎంఎస్ మూడేళ్లే ఉంటుందని ఇది వివరణ ఇచ్చింది. తమ కోర్సును నాలుగేళ్లుగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పలువురు బీఎంఎస్ విద్యార్థులు సోమవారం నుంచి ఆందోళనలను ఆరంభించారు. దీనిపై స్పందించిన యూజీసీ సాయంత్రం ఒక ప్రకటన చేసింది. 2013-14 విద్యాసంవత్సరంలో నాలుగేళ్ల బీ.టెక్ కోర్సులో చేరిన వారికి అదే కోర్సును కొనసాగించాలని ఇది డీయూను ఆదేశించింది. యూనివర్సిటీలో 840 మంది బీఎంఎస్ కోర్సు చదువుతుండగా, వీరికి కూడా ఇదేవిధానం అమలవుతుంంది.
మిగతా కోర్సులను మూడేళ్ల వాటిగా మార్చి, బీఎంఎస్‌పై అనిశ్చితి కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు బీఎంఎస్ విద్యార్థులు యూజీసీ సీనియర్ అధికారులకు వినతిపత్రం సమర్పించా రు. బీఎంసీ కోర్సు భవితవ్యంపై చర్చించేందుకు యూజీసీ ఒక సమావేశం నిర్వహిస్తుందని సోమవారం కథనాలు వచ్చాయి. ఈ మేరకు మంగళవారం మాత్రం అధికారులు విద్యార్థులతో చర్చలు నిర్వహించారు. భవిష్యత్‌లోనూ బీఎంఎస్‌ను ఎఫ్‌వైయూపీగానే ఉంచాలనే డిమాండ్‌తో ఆందోళనలను కొనసాగిస్తామని నిడా సైఫీ అనే బీఎంఎస్ విద్యార్థి అన్నాడు. బీ.టెక్ కోర్సును భవిష్యత్‌లో ఎఫ్‌వైయూపీగానే కొనసాగిస్తామని డీయూ వైస్‌చాన్స్‌లర్ రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఈ కోర్సు విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. బీఎంఎస్ కాలపరిమితిపై చర్చించేందుకు స్థాయీ సలహాసంఘం సమావేశం నిర్వహిస్తామని యూజీసీ వైస్ చైర్మన్ హెచ్.దేవరాజ్ సోమవారం ప్రకటించారు.
బీ.టెక్ మాదిరిగానే బీఎంఎస్ ఎఫ్‌వైయూపీని కూడా రద్దు చేయాలని నిర్ణయించిన డీయూ, ఇక నుంచి వీటిని మూడేళ్ల కోర్సులుగానే పరిగణించి అడ్మిషన్లు ఇస్తామని ప్రకటించింది. బీఎంఎస్, బీ.టెక్ విద్యార్థులు మాత్రం తమ కోర్సులను ఎఫ్‌వైయూపీ పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమ డిగ్రీలకు ఎటువంటి విలువా ఉండబోదని వాదిస్తున్నారు. యూజీసీ మాత్రం ఈ వాదనను పట్టించుకోలేదు.
బీఎంఎస్ కోర్సు మూడేళ్లే!
బీఎంఎస్ విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన యూజీసీ ఈ విషయమై సోమవారం సాయంత్రానికి స్పష్టత ఇచ్చింది. 2013-14 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు పొందిన వారికి కూడా మూడేళ్ల కోర్సునే అమలు చేయాలని డీయూను ఆదేశించింది. ఈ మేరకు మార్పులు చేయాలని స్పష్టం చేసింది. కోర్సును నాలుగేళ్లకు పొడగించాలని బీఎంఎస్ విద్యార్థులు డిమాండ్ చేసినా, యూజీసీ మాత్రం మూడేళ్లకే పరిమితం చేసింది. విద్యార్థులతో పలుసార్లు భేటీ అయిన చర్చలు నిర్వహించిన యూజీసీ అధికారులు చివరికి సాధారణ కోర్సుకే మొగ్గుచూపారు. దీనిపై పలువురు బీఎంఎస్ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.