FYUP
-
ఎందుకలా గందరగోళం సృష్టించారు?
న్యూఢిల్లీ: తొలుత నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని ఎందుకు ప్రవేశపెట్టారని ఆ తర్వాత దానిని ఎందుకు రద్దు చే సి, ఆ స్థానంలో మూడు సంవత్సరాల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (టీవైయూపీ)ని ఎందుకు ప్రవేశపెట్టారంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని (డీయూ)ని హైకోర్టు శనివారం నిలదీసింది. దీనివల్ల విద్యార్థులు బాగా గందరగోళానికి గురయ్యారని పేర్కొంది. ఇందువల్ల సదరు విద్యార్థులు అర్హత సాధించినప్పటికీ వారికి ఏయే కళాశాలల్లోనూ డిగ్రీ కోర్సులో ప్రవేశం లభించని దుస్థితి నెలకొందని ప్రధాన న్యాయమూర్తి జి.రోహిణి నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. ఈ కోర్సులకు సంబంధించి కోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులను పక్కనబెట్టి హయ్యర్ సెకండరీలో గణితం సబ్జెక్టులేని విద్యార్థికి ప్రవేశం కల్పించాలంటూ డీయూ పరిధిలోని మహరాజా అగ్రసేన్ కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించింది. ఎఫ్‌వైయూపీ స్థానంలో టీవైయూపీ రావడంతోపాటు హయ్యర్ సెకండరీలో మ్యాథ్స్ సబ్జెక్టు లేదనే సాకుతో తనకు మహరాజా అగ్రసేన్ కళాశాల యాజమాన్యం ప్రవేశం కల్పించకపోవడాన్ని సవాలుచేస్తూ బాధిత విద్యార్థి దాఖలుచేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు పైవిధంగా స్పందించింది. -
విద్యార్థుల శ్రేయస్సుకోసమే
న్యూఢిల్లీ: విద్యార్థులు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దేశంతోనే ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ను రద్దు చేశామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి స్మృతి ఇరానీ బుధవారం రాజ్యసభకు తెలియజేశారు. ‘1986 నాటి జాతీయ విద్యావిధానానికి లోబడి ఉండాలనే ఉద్దేశం కూడా ఈ రద్దు నిర్ణయంలో ఓ భాగం. ఉపాధి అవకాశాల విషయంలోగానీ లేదా మరేఇతర విషయాల్లోగానీ వారు ఇబ్బందులపాలవకూడదనేదే ప్రభుత్వ ఆలోచన’ అని అన్నా రు. కాగా డీయూ గణాంకాల ప్రకారం ప్రతి ఏడాది ఈ విశ్వవిద్యాలయం నుంచి దాదాపు 40 వేలమంది విద్యార్థులు డిగ్రీ పట్టా పుచ్చుకోనున్నారు. మరోవైపు స్కూల్ ఆఫ్ లెర్నింగ్ (ఎస్ఓపీ)లో అనేకమంది డిగ్రీ కోర్సు పూర్తిచేస్తున్నారు. కాగా నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ) రద్దు అంశం అటు యూజీసీ, ఇటు డీయూల మధ్య వివాదాస్పదంగా మారింది. అయితే ఎట్టకేలకు ఈ కోర్సు రద్దుకే అంతా మొగ్గుచూపిన సంగతి విదితమే. ఇందు కోసం ఏడాదికాలంగా అనేక విద్యార్థి సంఘాలు ఆందోళలను నిర్వహించాయి. వాఘా సరిహద్దుకు సైకిల్ యాత్ర స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)కు చెందిన 50 మంది విద్యార్థులు వాఘా సరిహద్దు వరకూ సైకిల్ యాత్ర నిర్వహించనున్నారు. వచ్చే నెల ఒకటో తేదీన ఈ యాత్ర ప్రారంభం కానుంది. దీనికి ఇండో పాక్ పీస్ ర్యాలీ అని నామకనణం చేశారు. ఈ ర్యాలీని ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ ఫర్ పీస్ (డీయూఎఫ్ఎస్పీ) సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ సింగ్ బుధవారం వెల్లడించారు. డీయూ ఉత్తర ప్రాంగణంలో ఒకటో తేదీ సాయంత్రం ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ యాత్ర మొత్తం 13 రోజులపాటు కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా పంజాబ్, హర్యానాలలో శాంతి శిబిరాలను నిర్వహిస్తారు. వచ్చే నెల 13వ తేదీన ఈ ర్యాలీ అమృత్సర్ చేరుకుంటుంది. వాఘా సరిహద్దులో వచ్చే నెల 14,15వ తేదీల్లో జరిగే స్వాతం త్య్ర సంబరాల్లో ఈ యాత్ర బృందం పాలుపంచుకుంటుంది. కాగా గత ఏడాది కూడా డీయూఎఫ్ఎస్పీ ఇటువంటి ర్యాలీని తొలిసారి నిర్వహించింది. కన్యాకుమారి నుంచి మొదలై వాఘా సరిహద్దు చేరుకోవడంతో ఈ ర్యాలీ ముగిసిన సంగతి విదితమే. ఈ ర్యాలీ విజయవంతమైన నేపథ్యంలో ఈ ఏడాది కూడా మరో ర్యాలీకి శ్రీకారం చుట్టింది. -
డీయూలో కొత్త విద్యాసంవత్సరం నేటి నుంచి ప్రారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో కొత్త విద్యాసంవత్సరం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ యూనివర్సిటీలో నాలుగు సంవత్సరాల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ) ఓ చరిత్రగా మిగిలిపోయిన సంగతి విదితమే. దాని స్థానంలో మూడేళ్ల కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చేసేందుకుగాను డీయూ పరిధిలోని కళాశాలలు ఇప్పటికే కొత్తగా చేరే విద్యార్థులకు పునశ్చరణ కార్యక్రమం నిర్వహించాయి. ఈ విషయమై శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ ప్రిన్సిపల్ ఎస్కే జైన్ మాట్లాడుతూ వివిధ కోర్సులకు సంబంధించి తాము మొత్తం 800 మంది విద్యార్థులను చేర్చుకున్నామన్నారు. ఇవాళకూడా వారికి పునశ్చరణ తరగతులను నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా కోర్సు, టైంటేబుల్, నిబంధనావళి తదితరాలపై వారికి అవగాహన కల్పించామన్నారు. ఈ నెల 21వ తేదీనుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. టైంటేబుల్ తదితర వివరాలను తమ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. తాత్కాలిక ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. ఇదే విషయమై మిరండా హౌస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతిభా జాలీ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం సజావుగా సాగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు రద్దు వివాదం ఇటీవల కొంతకాలంపాటు తల్లిదండ్రులతోపాటు విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేసిన సంగతి విదితమే. అనేక తర్జనభర్జనలు, చర్చలు, కమిటీల నియామకం తదితరాల తర్వాత డీయూ ఈ కోర్సును రద్దుచేసి దాని స్థానంలో మూడేళ్ల కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి విదితమే. ఈ విద్యాసంవత్సరం ఎటువంటి ఆటంకాలు లేకుండాసోమవారం ప్రారంభమ వుతుందని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఎస్కే గార్గ్ వెల్లడించారు. కాగా ఎఫ్‌వైయూపీ వివాదం నేపథ్యంలో ఈ నెల రెండో తేదీన ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం 19 రోజులమేర ఆలస్యమైంది. ఎఫ్‌వైయూపీ వివాదం కారణంగా అనేకమంది విద్యార్థులు తీవ్ర ఆందో ళనకు గురయ్యారు. దీనిపై ఏడాదికాలంగా అనేక విద్యార్థి సంఘాలు ఆందోళనలను నిర్వహి స్తూనే ఉన్నాయి. చివరికి ఈ వివాదం ముగి యడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
నిబంధనలకు విరుద్ధం
న్యూఢిల్లీ: శాఖాధిపతుల నియామకం విషయంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) నిబంధనలను ఉల్లంఘించిందని ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) ఆరోపించింది. వాస్తవానికి నియామకాలు జరిపే సమయంలో రొటేషన్ పద్ధతిని అనుసరించాలని, అయితే అటువంటిదేమీ జరగలేదని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో డ్యూటా అధ్యక్షురాలు నందితా నారాయణ్ ఆరోపించారు. ఆర్డినెన్స్ 13(1) ప్రకారం పరిశీలన తర్వాత ఉపకులపతి నియామకాలు జరపాల్సి ఉంటుందని, అయితే అటువంటిదేమీ జరగలేదని అన్నారు. ఇందుకు ఉదాహరణ భూభౌతిక శాస్త్ర విభాగం అధిపతిగా జెపీ శ్రీవాస్తవను నియమించకపోవడమేనన్నారు. ఆయన ఈ పదవి కోసం ఇప్పటికి రెండు పర్యాయాలు ప్రయత్నించారన్నారు. 2011, జూన్ రెండో తేదీన ఆచార్య సీఎస్ దూబేను ఈ పదవిలో నియమించారని, ఆర్డినెన్సులో ఎటువంటి వెసులుబాటు లేకపోయినప్పటికీ ఇప్పటికి రెండు పర్యాయాలు ఆయన పదవీకాలాన్ని పొడిగించారని ఆరోపించారు. షెడ్యూల్ ప్రకారమే కాగా విద్యాసంవత్సరం ఆరంభంపై ఉత్కంఠకు ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) తెరదించింది. షెడ్యూల్ ప్రకారమే ప్రారంభమవుతుందని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో డీయూ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో విద్యాసంవత్సరం ఆరంభంలో జాప్యమవుతుందేమోనని విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఉత్కంఠకు గురయ్యారు. ఈ నెల 21వ తేదీన కళాశాలలు ప్రారంభమవుతాయని డీయూ రిజిస్ట్రార్ అభయమిచ్చారు. అందువల్ల అధ్యాపకులతోపాటు విద్యార్థులు తమ తమ కళాశాలలకు వెళ్లి టైంటేబుల్ తెచ్చుకోవాలని సూచించారు. కాగా నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని రద్దు చేసిన నేపథ్యంలో మూడేళ్ల కోర్సును రీస్ట్రక్చరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని డీయూ ఆయా కళాశాలలను కోరింది. -
ఎఫ్‌వైయూపీ కోర్సులపై డీయూటీఏ ధర్నా
న్యూఢిల్లీ: నాలుగేళ్ల డిగ్రీ వివాదం ఇంకా రగులుతూనే ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (డీయూటీఏ) మంగళవారం ధర్నాకు దిగింది. నాలుగేళ్ల డిగ్రీకి సంబంధించిన కోర్సులను పునర్వ్యవస్థీకరించాలని డీయూటీఏ డిమాండ్ చేసింది. ఈ విషయంలో ఢిల్లీ యూనివర్సిటీ నిర్లక్ష్యంగా, ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని, యూజీసీ సూచించినట్లుగా అవసరమై అనుమతుల కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయడంలేదని డీయూటీఏ ప్రెసిడెంట్ నందితా నరైన్ ఆరోపించారు. ఈ విషయంలో నియమించిన సలహాదారుల కమిటీని పొడిగించడాన్ని అసోసియేషన్ స్వాగతిస్తోందని, జూలై 21లోపు నాలుగేళ్ల డిగ్రీకి సంబంధించిన సమస్యలను ఈ కమిటీ పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని నరైన్ పేర్కొన్నారు. కోర్సుల పునర్వ్యవస్థీకరణ విషయమై కమిటీకి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, ఇప్పటికే కొన్ని సూచనలు కూడ చేశామన్నారు. ఈ కమిటీ సిఫారసులను యూనివర్సిటీ అమలు చేస్తుందని ఆశాభావ ం వ్యక్తం చేశారు. -
ఎఫ్‌వైయూపీపై ప్రొఫెసర్ విశ్లేషణ ఎందుకిలా జరిగిందంటే...
డీయూ వైస్చాన్స్లర్లు దీపక్ పెంటల్, దినేశ్ సింగ్ నిరంకుశత్వం, అస్తవ్యస్త విధానం వల్లే ఎఫ్‌వైయూపీ, సెమిస్టర్ విధానం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని డీయూ భౌతికశాస్త్ర అధ్యాపకురాలు అభాదేవ్ హబీబ్ చెబుతున్నారు. ప్రజాస్వామిక వాతావరణంలో చర్చలు నిర్వహించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని ఆమె విశ్లేషించారు. న్యూఢిల్లీ:నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఎఫ్‌వైయూపీ) ప్రవేశపెట్టినప్పటి నుంచి ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. విద్యార్థులు, వీరి తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యావేత్తల ఆందోళనలు, కోర్టు కేసులు, యూజీసీ జోక్యం.. ఈ సమస్యలన్నింటితో డీయూ తలపట్టుకుంది. చివరికి యూజీసీ జోక్యం తో కోర్సు రద్దయింది. ఎఫ్‌వైయూపీ ప్రవేశపెట్టేముందు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని డీయూ భౌతికశాస్త్ర అధ్యాపకురా లు అభాదేవ్ హబీబ్ అంటున్నారు. ఈ వివాదంపై విశ్లేషణ ఆమె మాటల్లోనే... ఎఫ్‌వైయూపీపై డీయూలో నెలకొన్న ఆందోళన, ప్రతిష్టంభన మన ముందు ఎన్నో ప్రశ్నలను ఉంచింది. ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకొనే సమయంలో విద్యావేత్తలు, విధానకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీయూ ఉదంతం సూచిస్తోంది. ఈ ఘటన మనకు రెండు విషయాలను నేర్పుతోంది. 1. అన్ని మార్పులనూ సంస్కరణలుగా భావించలేం 2. సంస్కరణల అమలుకు విధానాలు, కాలపరిమితి చాలా ముఖ్యం. ‘డీయూలో ఎఫ్‌వైయూపీ వివాదాన్ని అడ్డుకోవడం సాధ్యమయ్యేదా ?’ అనే ప్రశ్నకు క్యాంపస్‌లో ఇటీవలి పరిణామాల ను అధ్యయనం చేయడం ద్వారానే తగిన జవాబు వస్తుంది. డీయూలో సెమిస్టర్ విధానం ప్రవేశంపై 2010లో ఆందోళనలు కొనసాగుతున్న సమయం లో దినేశ్ సింగ్ వైస్ చాన్స్‌లర్ అయ్యారు. సెమిస్టర్ విధానాన్ని దినేశ్‌కు ముందున్న వీసీ దీపక్ పెంటల్ హ డావుడిగా విద్యార్థులపై రుద్దారు. కొత్త వీసీ అన్ని విషయాలపై తమతో చర్చిస్తారని ప్రొఫెసర్లు, విద్యార్థులు భావించారు. సెమిస్టర్ విధానంలో బోధించేందుకు తిరస్కరించే ప్రొఫెసర్ల జీతాలు నిలి పివేస్తామని బాధ్యతలు చేపట్టిన రెండోరోజే సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన సమస్యలను పరి ష్కరించే విధానం ఏమిటో అదేరోజు అర్థమయిం ది. సింగ్ విధానాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉందని అప్పటి మంత్రి కపిల్ సిబాల్ ఆయనను సన్మానించినప్పుడే తేలింది. సెమిస్టర్ విధానాన్ని వ్యతిరేకించిన ప్రొఫెసర్లు, అధ్యాపక సంఘాలను యాజమాన్యం ఇబ్బందిపెట్టింది. అంటే చర్చలపై ఆయనకు కొంచెం కూడా నమ్మకం లేదని భావిం చాల్సి ఉంటుంది. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏది చెబితే దానిని అమలు చేశారు. సులువుగా పరిష్కరించగలిగే చిన్న విషయాలను కూడా పెద్దవి చేశా రు. ఉదాహరణకు 2012లో సెమిస్టర్ విధానం లో పరీక్షలు రాసిన వారికి ఊహించనంత భారీగా మార్కులు వచ్చాయి. ఈ విషయాన్ని అధ్యాపకులు ప్రశ్నించినా వీసీ పట్టించుకోలేదు. పరీక్షల మూ ల్యాంకన విధానాన్ని సమీక్షించేందుకు ఆయన ససేమిరా అన్నారు. ఆయన పరిష్కార విధానం చాలా ‘సులువు’గా ఉంటుంది. విద్యార్థుల మార్కుల సమాచారం ఎవరికీ దొరక్కుండా చేశారు. విద్యార్థులు, ప్రొఫెసర్ల నిజమైన సమస్యలపై ఎన్నడూ స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వమే చేయించింది.. సెమిస్టర్, ఎఫ్‌వైయూపీ విధానాలను విద్యాసంస్కరణల్లో భాగంగా ప్రవేశపెట్టారని అనుకోవడం సాధ్యం కాదు. వీటి ప్రవేశం ద్వారా కొత్త పాలనా విధానం అమలయింది. ఎలాంటి చర్చా లేకుండా వీసీ నిర్ణయం తీసుకునే పద్ధతి వచ్చింది. విధివిధానాలు, నియమాల గురించి ఎవరితోనూ మాట్లాడకుండానే మీడియాను పిలిచి అధికారికంగా ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య హక్కులు, భావజాలంపై దాడి జరిగింది. డీయూ అధ్యాపక సంఘం (డూటా) వంటివి సమావేశాలకు రాకుండా అడ్డుకున్నారు. వీసీ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించలేదు. యూజీసీ, ఇతర విభాగాలను లెక్క చేయకుండా వీసీ తనకు వ్యతిరేకంగా వ్యవహరిం చిన వారందరిపైనా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా ఏమైనా అంటే ‘నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ?’ అంటూ హెచ్చరించారు. అప్పటి మంత్రి కపిల్ సిబాల్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, అశోక్ ఠాకూర్.. వీసీ వెనక ఉండి ఇదంతా నడిపించారు. ఓబీసీ విద్యార్థులకు కేటాయించిన నిధులను దారి మళ్లించి ఎఫ్‌వైయూపీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు కొనిచ్చారు. దీంతో డీయూలో అక్రమాలు, కుంభకోణాలు రాజ్యమేలాయి. దేనికైనా వీసీ సింగ్‌పై ఆధారపడే దుస్థితి వచ్చింది. కోర్సుల్లో ఇష్టమొచ్చినట్టు మార్పులు చేశారు. ఎఫ్‌వైయూపీ విధానం సక్రమంగా లేదంటూ మొదటి ఏడాది విద్యార్థులు ఎంత మొత్తుకున్నా, వీసీ వినలేదు. అయితే ప్రజాస్వామ్యవాదుల ఒత్తిడి ఫలితంగా వీసీ నిరంకుశత్వానికి తెరపడింది. -
నేటినుంచి అడ్మిషన్లు షురూ
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ) రద్దయిన నేపథ్యంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) మంగళవారం నుంచి అడ్మిషన్ ప్రక్రియ ఆరంభించనుంది. ఈ మేరకు సోమవారం రాత్రి వరకు మొదటి కటాఫ్ జాబితాలను విడుదల చేశాయి. మొదటి కటాఫ్ జాబితా ఆధారంగా జూలై మూడు వరకు అడ్మిషన్లు జరుగుతాయి. ఎఫ్‌వైయూపీపై చెలరేగిన వివాదం కారణంగా డీయూలో అడ్మిషన్ ప్రక్రియ వారం రోజులు ఆలస్యమయింది. గత మంగళవారం ప్రారంభం కావలసిన ప్రవేశాలు ఈ మంగళవారం మొదలవుతున్నాయి. ఇదిలాఉండగా 2014-15 విద్యాసంవత్సరానికి బీ.టెక్ కోర్సును (ఎఫ్‌వైయూపీ) రద్దుచేయాలన్న డీయూ నిర్ణయాన్ని ప్రస్తుత బీ.టెక్ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. నాలుగేళ్ల బీటెక్ కోర్సును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ కార్యాలయం ఎదుట బీ.టెక్, బీఎంఎస్ విద్యార్థులు ఆదివారం ఆందోళన నిర్వహించడం తెలిసిందే. యూజీసీ నిర్లక్ష్యం చేస్తే న్యాయస్థానానికి వెళ్లేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ఇరానీ నివాసంలోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ విషయమై ఆందోళనలో పాల్గొన్న రేఖ అనే విద్యార్థిని మాట్లాడుతూ బీఎంఎస్‌ను మూడేళ్ల కోర్సుగా మారిస్తే ఎన్నో ఇబ్బందులు వస్తాయంది. మంగళవారం నుంచి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని పేర్కొంది. బీఎంఎస్ విద్యార్థుల ఆందోళన డీయూలో బీఎంఎస్ (బ్యాచిలర్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్) నాలుగేళ్ల కోర్సుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వైఖరిపై ఆందోళన వ్యక్తమవుతోంది. బీఎంఎస్ మూడేళ్లే ఉంటుందని ఇది వివరణ ఇచ్చింది. తమ కోర్సును నాలుగేళ్లుగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పలువురు బీఎంఎస్ విద్యార్థులు సోమవారం నుంచి ఆందోళనలను ఆరంభించారు. దీనిపై స్పందించిన యూజీసీ సాయంత్రం ఒక ప్రకటన చేసింది. 2013-14 విద్యాసంవత్సరంలో నాలుగేళ్ల బీ.టెక్ కోర్సులో చేరిన వారికి అదే కోర్సును కొనసాగించాలని ఇది డీయూను ఆదేశించింది. యూనివర్సిటీలో 840 మంది బీఎంఎస్ కోర్సు చదువుతుండగా, వీరికి కూడా ఇదేవిధానం అమలవుతుంంది. మిగతా కోర్సులను మూడేళ్ల వాటిగా మార్చి, బీఎంఎస్‌పై అనిశ్చితి కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు బీఎంఎస్ విద్యార్థులు యూజీసీ సీనియర్ అధికారులకు వినతిపత్రం సమర్పించా రు. బీఎంసీ కోర్సు భవితవ్యంపై చర్చించేందుకు యూజీసీ ఒక సమావేశం నిర్వహిస్తుందని సోమవారం కథనాలు వచ్చాయి. ఈ మేరకు మంగళవారం మాత్రం అధికారులు విద్యార్థులతో చర్చలు నిర్వహించారు. భవిష్యత్‌లోనూ బీఎంఎస్‌ను ఎఫ్వైయూపీగానే ఉంచాలనే డిమాండ్‌తో ఆందోళనలను కొనసాగిస్తామని నిడా సైఫీ అనే బీఎంఎస్ విద్యార్థి అన్నాడు. బీ.టెక్ కోర్సును భవిష్యత్‌లో ఎఫ్వైయూపీగానే కొనసాగిస్తామని డీయూ వైస్‌చాన్స్‌లర్ రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఈ కోర్సు విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. బీఎంఎస్ కాలపరిమితిపై చర్చించేందుకు స్థాయీ సలహాసంఘం సమావేశం నిర్వహిస్తామని యూజీసీ వైస్ చైర్మన్ హెచ్.దేవరాజ్ సోమవారం ప్రకటించారు. బీ.టెక్ మాదిరిగానే బీఎంఎస్ ఎఫ్‌వైయూపీని కూడా రద్దు చేయాలని నిర్ణయించిన డీయూ, ఇక నుంచి వీటిని మూడేళ్ల కోర్సులుగానే పరిగణించి అడ్మిషన్లు ఇస్తామని ప్రకటించింది. బీఎంఎస్, బీ.టెక్ విద్యార్థులు మాత్రం తమ కోర్సులను ఎఫ్‌వైయూపీ పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమ డిగ్రీలకు ఎటువంటి విలువా ఉండబోదని వాదిస్తున్నారు. యూజీసీ మాత్రం ఈ వాదనను పట్టించుకోలేదు. బీఎంఎస్ కోర్సు మూడేళ్లే! బీఎంఎస్ విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన యూజీసీ ఈ విషయమై సోమవారం సాయంత్రానికి స్పష్టత ఇచ్చింది. 2013-14 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు పొందిన వారికి కూడా మూడేళ్ల కోర్సునే అమలు చేయాలని డీయూను ఆదేశించింది. ఈ మేరకు మార్పులు చేయాలని స్పష్టం చేసింది. కోర్సును నాలుగేళ్లకు పొడగించాలని బీఎంఎస్ విద్యార్థులు డిమాండ్ చేసినా, యూజీసీ మాత్రం మూడేళ్లకే పరిమితం చేసింది. విద్యార్థులతో పలుసార్లు భేటీ అయిన చర్చలు నిర్వహించిన యూజీసీ అధికారులు చివరికి సాధారణ కోర్సుకే మొగ్గుచూపారు. దీనిపై పలువురు బీఎంఎస్ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
లాంఛనంగా రద్దైన ఎఫ్‌వైయూపీ
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఎఫ్‌వైయూపీ)ను ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) శనివారం లాంఛనంగా రద్దు చేసింది. దీనిని తొలగించాలన్న ప్రతిపాదనకు యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపాయి. దీంతో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను రద్దు చేస్తున్నట్లు వైస్-చాన్స్‌లర్ దినేష్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. అత్యవసరంగా సమావేశమైన అకడమిక్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మూడేళ్ల డిగ్రీ కోర్సును అమలు చేయాలని, 2012-13 విద్యా సంవత్సరంలో అనుసరించిన పద్ధతి ప్రకారం అడ్మిషన్లు జరపాలంటూ తీర్మానించాయి. రెండు కౌన్సిళ్లు ఈ తీర్మానాన్ని భారీ మెజారిటీతో ఆమోదించినా, ఎఫ్‌వైయూపీపై మాత్రం చర్చించలేదు. అకడమిక్ కౌన్సిల్‌లోని 90 మంది సభ్యుల్లో ఎనిమిది మంది తీర్మానాన్ని వ్యతిరేకించారు. నాలుగేళ్ల కోర్సుపై డీయూ చర్చ జరపలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చ లేకుండానే అకడమిక్ కౌన్సిల్ మూడేళ్ల డిగ్రీ కోర్సుకు ఆమోదం తెలపడం దురదృష్టకరమని తీర్మానాన్ని వ్యతిరేకించిన అకడమిక్ కౌన్సిల్ సభ్యుడు సంజయ్‌కుమార్ అన్నారు. అకడమిక్ కౌన్సిల్ ఏకపక్షంగా కేవలం రెండు నిమిషాల్ల్లో తీర్మానాన్ని ఆమోదించిందని ఆయన చెప్పారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోనూ తీర్మానం భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. వైస్‌చాన్స్‌లర్ దినేష్ సింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని, ఐదు నిమిషాల్లో ఆమోదం లభించిందని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ఆదిత్య నారాయణ్ మిశ్రా చెప్పారు. ఆందోళనకు దిగిన బీ.టెక్ విద్యార్థులు ఎఫ్యూవైపీని డీయూ అధికారికంగా రద్దు చేసిన నేపథ్యంలో ఈ కోర్సు చదువుతున్న బీ.టెక్, బీ.ఎంఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్లుల భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా వైస్ చాన్స్‌లర్ 12 మంది కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో నియమించిన కమిటీ అడ్మిషన్ విధివిధానాలను రూపొందిస్తోంది. ఈ కమిటీయే బీ.టెక్ కోర్సు భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకుంటుందని మిశ్రా చెప్పారు. ఈ కమిటీ తన సిఫార్సులను శనివారం రాత్రి ఢిల్లీ యూనివర్సిటీకి అందజేస్తుంది. వీటి ప్రకారం సోమవారం నుంచి అడ్మిషన్లు మొదలు కావచ్చని భావిస్తున్నారు. తమ కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్చవద్దని డిమాండ్ చేస్తూ వందలాది మంది బీ.టెక్ విద్యార్థులు వీసీ కార్యాలయం ఎదుట శనివారం ప్రదర్శన జరిపారు. నాలుగేళల కోర్సుపై చెలరేగిన వివాదం సమసిపోవడంతో ప్రస్తుత విద్యాసంవత్సరం అడ్మిషన్లపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయిందని డీయూ అధికారి ఒకరు అన్నారు. -
ఎఫ్‌వైయూపీ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేనా?
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం ( ఎఫ్‌వైయూపీ)పై చెలరేగిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు. ఢిల్లీ యూనివర్సిటీ, యూజీసీల మధ్య తలెత్తిన వివాదంపై తక్షణం విచారణ జరపలేనని హైకోర్టు తెలిపింది. యూజీసీ ఆదేశాల మేరకు మూడేళ్ల కోర్సును అమలు చేయాలని ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాల్సిందిగా కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజనవ్యాజ్యంపై వచ్చే నెల ఒకటో తేదీన విచారణ చేపడతానని ఢిల్లీ హైకోర్టు బుధవారం తెలిపింది. ఇందుకు సంబంధించి ైహైకోర్టులో మంగళవారం రెండు పరస్పర విరుద్ధమైన పిటిషన్లు దాఖలయ్యాయి. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంను కొనసాగించాలని ఒకటి కోరగా, మరొకటి మూడేళ్ల కోర్సును అమలు చేయాలని విన్నవించింది. వీటిపై తక్షణం విచారణ జరపడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఈ వ్యవహారంపై విస్తృత విచారణ జరపాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. వెకేషన్ బెంచ్‌లోని ఓ న్యాయమూర్తి వీకే రావు... ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (డ్యూటా) న్యాయవాదిగా గతంలో వ్యవహరించారు. అందువల్ల కేసు విచారణను జూలై ఒకటి తరువాత మరో ధర్మాసనానికి అప్పగించి సెలవుల తరువాత కోర్టు తెరచినప్పుడు రెగ్యులర్ బెంచ్‌తో విచారణ జరిపించాలని ప్రతిభారాణి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం అభిప్రాయపడింది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు జాతీయ విద్యా విధానాన్ని ఉల్లంఘిస్తోందని, అందువల్ల మూడేళ్ల కోర్సును మళ్లీ ప్రారంభించాలని కోరిన పిటిషన్‌ను ఆర్కే కపూర్ అనే వ్యక్తి దాఖలు చేశారు. నాలుగు సంవత్సరాల కోర్సును కొనసాగించాలని కోరుతూ మంగళవారం సుప్రీంకోర్టుకు వెళ్లిన డ్యూటా మాజీ అధ్యక్షుడు ఏఎన్ మిశ్రా బుధవారం హైకోర్టుకు హాజరైనప్పటికీ ఆయన పిటిషన్ దాఖ లు చేయలేదు. న్యాయస్థానం వచ్చే నెల ఒకటో తేదీన విచారణ జరుపుతామని పేర్కొనడంతో పిటిషన్ దాఖలు చేయలేదని మిశ్రా తెలిపారు. మంగళవారం ఈ వ్యవహారంపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని 57 కళాశాలలు యూజీసీ కోరినవిధంగానే మూడేళ్ల కోర్సును అమలుచేయడానికి సుముఖత వ్యక్తం చేశాయి. మరో ఏడు కళాశాలలు తమ వైఖరిని స్పష్టం చేయలేదు. ఎఫ్‌వైయూపీ విషయంలో డీయూ, యూజీసీలు తమ తమ వైఖరిని మార్చుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో రెండింటి మధ్య కొనసాగుతోన్న వివాదం పరిష్కారమయితేతప్ప ప్రవేశాల ప్రక్రియ ఆరంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ అనిశ్చితి డీయూలో ప్రవేశాల కోసం వచ్చిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను ఇబ్బందుల పాలు చేసింది. అడ్మిషన్ కోసం దూరప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు రైలు టికెట్లను రద్దు చేసుకుని, హోటళ్లు, గెస్ట్‌హౌజ్‌లలో ఉంటున్నారు. డీయూ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తుండడంతోపాటు క్యాంపస్‌లోని హెల్త్ డెస్క్‌లను ఆరా తీస్తూ కాలం గడుపుతున్నారు. ఢిల్లీలో చిక్కుకుపోవడం వల్ల ఇతర కళాశాలల్లో కౌన్సెలంగ్లకు హాజరు కాలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఈ సంవత్సరం నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు వచ్చిన రెండు లక్షలకు పైగా దరఖాస్తులలో సగం ఇతర ప్రాంతాలకు చెందినవారివేనని డీయూ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో అత్యధిక శాతం మంది యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, హర్యానాలకు చెందినవారే. యూపీ, ఉత్తరాఖండ్‌లకు చెందినవారి దరఖాస్తులే 66 వేలున్నాయి. బీ.టెక్ విద్యార్థుల నిరసన ప్రదర్శన యూజీసీ తీరుపై బీ.టెక్ విద్యార్థులు మండిపడ్డారు. తాము చదువుతున్న నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయొద్దని డిమాండ్ చేస్తూ యూజీసీ కార్యాలయం వద్ద వారంతా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం ఈ మేరకు సంబంధిత అధికారులకు వారు ఓ వినతిపత్రం అందజేశారు. సత్వరమే పరిష్కరించండి నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)పై తలెత్తిన వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని పలువురు విద్యావేత్తలు యూజీసీ, డీయూలను కోరారు. ఇందులోభాగంగా గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అనిల్ త్యాగి, పంజాబ్ యూనివర్సిటీ వీసీ అరుణ్ గ్రోవర్, సెయింట్ స్టీఫెన్ కళాశాల ప్రిన్సిపల్ వేల్సన్ థంపు కొన్ని ప్రతిపాదనలను రూపొందించి యూజీసీ, డీయూలకు పంపారు. -
నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు కొనసాగుతున్న ప్రతిష్టంభన
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ)లో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యేయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)పై అయోమయం సోమవారం కూడా కొనసాగింది. ఈ కోర్సుపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి తొలి జాబితా మంగళవారం వెలువడాల్సి ంది. ఈ కోర్సును రద్దు చేసినట్లయితే ప్రవేశ ప్రక్రియను మళ్లీ కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుందని, జూలై నుంచి తరగతులు మొదలయ్యే అవకాశాలు లేవని, కనీసం నాలుగైదు వారాలు ఆలస్యం కావొచ్చని కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ కోర్సుపై స్పష్టత కోరుతూ ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ, ఐసా విద్యార్థులు విశ్వవిద్యాలయం క్యాంపస్‌తోపాటు మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యాలయం వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. ఢిల్లీ యూనివర్సిటీలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును గత ఏడాది ప్రవేశపెట్టారు. బీఏ పాస్ , బీకామ్ పాస్, బీఎస్సీ లైఫ్ సెన్సైస్ వంటి కోర్సులను రద్దు చేసి వాటి కింద ఉన్న సీట్లను నాలుగేళ్ల అనర్స్ కోర్సుల్లో పంచారు. ఇప్పుడు నాలుగేళ్ల కోర్సును రద్దు చేస్తే మళ్లీ మూడేళ్ల కోర్సు కోసం సీట్లను కేటాయించాల్సి ఉంటుందని వివిధ కళాశాలల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చేదాకా అడ్మిషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రకటించింది. విద్యార్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగించినప్పటికీ అడ్మిషన్ కోసం ఎంపిక చేసిన విద్యార్థుల తుది జాబితా, వెయిటింగ్ లిస్టులను వివాదం తేలిన తరువాతే ప్రకటిస్తామని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల యాజమాన్యం. ఢిల్లీ విశ్వవిద్యాలయం కింద ఉన్నప్పటికీ మైనారిటీ విద్యాసంస్థ అయిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో అడ్మిషన్ నియమాలు మిగతా కాలేజీలకు భిన్నంగా ఉంటాయి. అయోమయంలో విద్యార్థులు అయితే ఏడాదిగా నాలుగేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులు యూజీసీ ప్రకటనతో మరింత అయోమయంలో పడ్డారు. నాలుగేళ్ల కోర్సును చట్టవిరుద్ధంగా ప్రవేశపెట్టారని, దానికి గుర్తింపు కూడా లేదంటూ వచ్చిన వార్తలు మరింత అయోమయానికి గురిచేశాయి. భవిష్యత్తు ఏమిటనే విషయమై అందరినీ ఆరా తీస్తూ కనిపించారు. నాలుగేళ్ల బీటెక్ కోర్సును కొనసాగించాలని కోరుతూ బీటెక్ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. స్వతంత్ర ప్రతిపత్తిని హరించడమే నాలుగేళ్ల కోర్సు కింద అడ్మిషన్లు జరపరాదంటూ యూజీసీ ఆదేశించడం డీయూ స్వయంప్రతిపత్తిని హరించడమేనని ఉపాధ్యాయుల్లో ఓ వర్గం అభిప్రాయపడింది. నాలుగు సంవత్సరాల కోర్సు కింద అడ్మిషన్లు చేపట్టరాదని, అలా చేసిన కళాశాలలకు నిధులు నిలిపివేస్తానని హెచ్చరిస్తూ యూజీసీ లేఖ రాయడాన్ని ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (డ్యూటా) మాజీ అధ్యక్షుడు ఆదిత్య నారాయణ్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. కోర్సు స్వరూపాన్ని నిర్ణయించే హక్కు యూనివర్సిటీకి ఉందని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇదేవిధంగా ప్రభుత్వం.. డీయూ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పోతే రేపు ప్రభుత్వ విధానాలనే పాఠ్యాంశాలలో చేర్చాలంటారని ఆయన హెచ్చరిం చారు. యూజీసీ... మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృ తి ఇరానీ ఆదేశాల మేరకు నడుస్తోందని ఆయన ఆరోపించారు. నాలుగు సంవత్సరాల కోర్సుకు రాష్ట్రపతికి ఆమోదం పొందలేదనే ఆరోపణలను ఆయన ఖండించారు. నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం కోర్సు ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతికి పంపారని, దానిపై రాష్ట్రపతి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని. అందువల్ల దానికి ఆమోదం లభించినట్లేనని ఆయన చెప్పారు. సాధారణంగా ఆర్డినెన్స్‌పై అభ్యంతరాలు కనుక ఉన్నట్టయితే నెల రోజుల్లోగా రాష్ట్రపతి దానిపై నెగెటివ్ రిమార్క్‌లు పంపుతారని, ఒకవేళ అలా పంపనట్లయితే ఆర్డినెన్స్‌ను ఆమోదించినట్లుగా భావిస్తారని ఆయన చెప్పారు. నాలుగు సంవత్సరాల కోర్సు ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ఎలాంటి నెగెటివ్ రిమార్కూ పంపలేదని ఆయన చెప్పారు. నాలుగు సంవవత్సరాల కోర్సు కేవలం డీయూలోనే కాకుండా అలహాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలోనూ ఉందన్నారు. కేంద్రం నిధులతో నడిచే దేశంలోని ఆరు సంస్థలు కూడా నాలుగేళ్ల కోర్సును అందిస్తున్నాయని, వాటి విషయంలో ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం చేయ ని యూజీసీ.. ఢిల్లీ యూనివర్సిటీ నాలుగేళ్ల కోర్సు పై అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. నాలుగేళ్ల కోర్సును ఉపసంహరించాలని డీయూపై ఒత్తిడి చేయడం యూనివర్సిటీ అస్తిత్వాన్ని సవాలు చేయడమేనని, దాని స్వయంప్రతి పత్తిని హరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నో అభ్యంతరాల మధ్య ఢిల్లీ యూనివర్సిటీ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును ప్రవేశపెట్టిందని, అయితే దానిని అమలు చేస్తున్నప్పుడు వ్యతిరేకించని యూజీసీ ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ ప్రశ్నించారు. ఈ వివాదం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడడమే కాకుండా డీయూ ప్రతిష్ట నవ్వులాటగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థల పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి గల వైఖరికి ఈ వివాదం అద్దం పడుతోందని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే యూజీసీ ఆదేశంపై ఆప్ హర్షం వ్యక్తం చేసింది. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయంగానీ లేదా దానికింద ఉన్న కళాశాలల్లోగానీ ఎఫ్‌వైయూపీ కింద అడ్మిషన్లు జరపరాదంటూ యూజీసీ జారీ చేసిన అల్ట్లిమేటం కొందరు విద్యార్థులు, టీచర్లకు ఆనందం కలిగించగా, మరికొందరిని నిరసన ప్రదర్శనలకు పురికొల్పింది. యూజీసీ అల్టిమేటం పట్ల హర్షం ప్రకటి స్తూ ఏబీవీపీ విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. యూజీసీ ఆదేశంతో డీయూలో నాలుగుసంవత్సరాల కోర్సు అంతం కావడం తథ్యమంటూ వారు ధీమా వ్యక్తం చేశారు. దీనిపై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని వారు డిమాం డ్ చేశారు. నాలుగేళ్ల కోర్సును సమర్థిస్తున్న ఎన్ఎస్యూఐ సభ్యులు కూడా కోర్సును కొనసాగించాలని ప్రదర్శన నిర్వహించారు. ఎఫ్‌వైయూపీపై నిర్వహించిన ఓ సమావేశంలో ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ కార్యకర్తలు ఘర్షణకు కూడా దిగారు. నాలుగేళ్ల కోర్సును వ్యతి రేకిస్తున్న ఐసా కార్యకర్తలు మానవ వనరుల మంత్రిత్వశాఖ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడమే కాకుం డా వైస్ చాన్స్‌లర్ దీపక్ సింగ్‌ను తొల గించాలని డిమాండ్ చేశారు. దీపక్ సింగ్ దిష్ట్టిబొమ్మను వారు దహనం చేశారు. -
ఎఫ్‌వైయూపీని రద్దు చేయండి
న్యూఢిల్లీ: నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని రద్దు చేయాలంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశించింది. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని వీసీ ఇటీవల యూజీసీకి ఓ లేఖ రాసిన సంగతి విదితమే. అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా యూజీసీ పైవిధంగా ఆదేశించింది. ఈ మేరకు వీసీకి శనివారం ఓ ఇ-మెయిల్ పంపింది. ఈ విషయాన్ని డీయూ అధికారులు తెలియజేశారు. అయితే ఈ కోర్సును వ్యతిరేకిస్తున్న అధ్యాపకులు మాత్రం వైస్ చాన్సలర్ మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఎఫ్‌వైయూపీపై త్వరలో జరగనున్న విద్యామండలి సమావేశానికి హాజరవ్వాలని, ఈ అంశంపై అక్కడ చర్చించాలంటూ సభ్యులను ఆదేశించారన్నారు. తనకు అందిన ఇ-మెయిల్ ప్రతిని సభ్యులకు చూపేందుకు కూడా వీసీ ఇష్టపడలేదని ఆరోపించారు. కాగా వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా తొందరపడి ఓ నిర్ణయం తీసుకున్నారంటూ యూజీసీతో వీసీ వాదించినట్టు అధ్యాపకులు చెబుతున్నారు. కాగా ఈ నెల 13వ తేదీన జరిగిన సమావేశంలో నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ను సమీక్షించాలంటూ డీయూని ఆదేశించిన సంగతి విదితమే. 10+2+3 ప్యాటర్న్‌కు ఇది వ్యతిరేకమని యూజీసీ అభిప్రాయపడింది. ఇందుకు డీయూ స్పందిస్తూ విశ్వవిద్యాలయం ఆర్డినెన్స్‌ను సవరించిన తర్వాతే ఈ కోర్సును అమలు చేశామని తెలియజేసింది. మరోవైపు ఈ కోర్సు రద్దు కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా)తోపాటు ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ, ఏఐడీఎస్ఓ, ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్, సీవైఎస్ఎస్, డీఎస్‌యూ, ఐఎన్ఎస్ఓ, కేవైఎస్, ఎన్ఈఎఫ్ఐఎస్, పచ్చాస్, ఎస్ఎఫ్ఐ, ఎస్వైఎస్ తదితర సంఘాలు ఏడాదికాలంగా అనేక పర్యాయాలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించిన సంగతి విదితమే. విద్యార్థులకు గాయాలు: నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)కు వ్యతిరేకంగా శనివారం ఆందోళనకు ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించడంతో వారిలో అనేకమంది గాయపడ్డారు. వైస్‌చాన్స్‌లర్ నివాసాన్ని ముట్టడించేందుకువీరంతా ఆయన నివాసం వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న బారికేడ్లను దాటిముందుకు పోయేందుకు యత్నించడంతో పోలీసులు నీటి ఫిరంగులను వారిపై ప్రయోగించారు. ఏబీవీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బారికేడ్లను దాటుతుండగా పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించారు. అనంతరం కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఏబీవీపీ ఢిల్లీ శాఖ కార్యదర్శి సాకేత్ బహుగుణ మాట్లాడుతూ డీయూ పరిపాలన విభాగం ఆదేశాల మేరకే పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎఫ్‌వైయూపీని రద్దు చేయాలంటూ వీసీని యూజీసీ ఆదే శించిందని, అయిన ప్పటికీ ఆయన పట్టించుకోకపోవడమేమిటని ప్రశ్నించారు. కాగా ఈ దాడిని ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకుల సంఘం (డ్యూటా) ఖండించింది. మరోవైపు ఈ కోర్సుకు గతకొంతకాలంగా ఉద్యమిస్తున్న ఎన్ఎస్యూఐ సభ్యులపైనా శనివారం పోలీసులు దాడిచేశారు. ఈ ఘటనలోనూ కొంతమంది గాయపడ్డారు. ఈ దాడిని ఎన్ఎస్యూఐ ఖండించింది. దీనిని ఫాసిస్టు చర్యగా అభివర్ణించింది. -
మరో యూనివర్సిటీలో ఎఫ్‌వైయూపీ
న్యూఢిల్లీ: నగర విద్యావ్యవస్థలోకి మరో కొత్త యూనివర్సిటీ వచ్చిచేరింది. కొందరు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తల చొరవతో ఉన్నత విద్యకోసం ఏర్పాటు చేసిన అశోకా యూనివ ర్సిటీ ఉదాత్త కళల్లో నాలుగేళ్ల అండర్ డిగ్రీ (ఎఫ్‌వైయూపీ) ఆఫర్ చేస్తోంది. ఆగస్టు నుంచి దీనికి ప్రవేశాలు జరగనున్నాయి. పరిశీలనతత్వాన్ని, ప్రశ్నించే గుణాన్ని నేర్పగలిగే ఇలాంటి కోర్సులే ఢిల్లీ యూనివర్సిటీలోనూ ఉన్నాయి. ప్రపంచ ంలోనే పేరుగాంచిన హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, యేల్, కార్నెల్ యూనివర్సిటీల స్థాయిలో ఈ విశ్వవిద్యాలయం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తోందని, యూఎస్ సరళీకృత విద్యావ్యవస్థ ప్రాతిపదికనే ఇవి రూపొందించామని వ్వవస్థాపకులు చెబుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వ్యవస్థపాకుల్లో ఒకరు, మొట్టమొదటి డీన్ అయిన ప్రమథ్ రాజ్ సిన్హా ఈ యూనివర్సిటీ స్థాపనలో కీలక భూమిక పోషించారు. ట్రస్టీగా కూడా వ్యవహరిస్తున్నారు. చాలా భారతీయ విశ్వవిద్యాలయాల్లో లాగా మూడేళ్ల డిగ్రీ వల్ల విద్యార్థులు విషయాన్ని లోతుగాఅర్థం చే సుకోలేకపోతున్నారని, అందుకోసం నాలుగేళ్ల డిగ్రీని అందుబాటులోకి తెచ్చినట్టు ఆయన తెలిపారు. ‘‘నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోసం వేలమంది విద్యార్థులు అమెరికా, లండన్ లాంటి దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లోకి వెళ్తున్నారు. ఇక్కడ ఎందుకు ఆ కోర్సులను నాలుగేళ్లు అందించలేము? భారతీయ విద్యావ్యవస్థలో ఇంకా సంస్కరణలు చేపట్టాల్సి ఉంది’’ అంటున్నారు సిన్హా. అయితే ఇప్పటికే ఢిల్లీ యూనివర్సిటీల్లో ప్రవేశపెట్టిన నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్స్‌పై వివాదంలో ఉంది. కొందరు టీచర్లు, విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థుల ఒక విలువైన సంవత్సరాన్ని వృథా చేసే ఈ కోర్సును తీసేస్తామని బీజేపీ తన ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం గమనార్హం. ఢిల్లీ శివార్లుల్లోని కుంద్లీలో హర్యానాకు దగ్గరా ఉన్న రాజీవ్‌గాంధీ ఎడ్యుకేషన్ సిటీలో 25 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ఖర్చు 20 లక్షలు. భారతదేశంలో ఉన్న లిబరల్ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్‌లో అన్నింటికన్న ఖరీదైన డిగ్రీ ఇది. ఇందులో సగం మంది విద్యార్థులకు 25 శాతంనుంచి 100శాతం వరకు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. ఆగస్టు ఒకటినుంచి 350 మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్ ప్రారంభమవుతోంది. మిచిగాన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, కార్లెటాన్ కాలేజ్, సెన్సైస్ పో వంటి యూనివర్సిటీల సహకారం కోసం చర్చలు కొనసాగుతున్నాయని యూనివర్సిటీ తెలిపింది.