విద్యార్థుల శ్రేయస్సుకోసమే
న్యూఢిల్లీ: విద్యార్థులు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దేశంతోనే ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ను రద్దు చేశామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి స్మృతి ఇరానీ బుధవారం రాజ్యసభకు తెలియజేశారు. ‘1986 నాటి జాతీయ విద్యావిధానానికి లోబడి ఉండాలనే ఉద్దేశం కూడా ఈ రద్దు నిర్ణయంలో ఓ భాగం. ఉపాధి అవకాశాల విషయంలోగానీ లేదా మరేఇతర విషయాల్లోగానీ వారు ఇబ్బందులపాలవకూడదనేదే ప్రభుత్వ ఆలోచన’ అని అన్నా రు.
కాగా డీయూ గణాంకాల ప్రకారం ప్రతి ఏడాది ఈ విశ్వవిద్యాలయం నుంచి దాదాపు 40 వేలమంది విద్యార్థులు డిగ్రీ పట్టా పుచ్చుకోనున్నారు. మరోవైపు స్కూల్ ఆఫ్ లెర్నింగ్ (ఎస్‌ఓపీ)లో అనేకమంది డిగ్రీ కోర్సు పూర్తిచేస్తున్నారు. కాగా నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ) రద్దు అంశం అటు యూజీసీ, ఇటు డీయూల మధ్య వివాదాస్పదంగా మారింది. అయితే ఎట్టకేలకు ఈ కోర్సు రద్దుకే అంతా మొగ్గుచూపిన సంగతి విదితమే. ఇందు కోసం ఏడాదికాలంగా అనేక విద్యార్థి సంఘాలు ఆందోళలను నిర్వహించాయి.
వాఘా సరిహద్దుకు సైకిల్ యాత్ర
స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)కు చెందిన 50 మంది విద్యార్థులు వాఘా సరిహద్దు వరకూ సైకిల్ యాత్ర నిర్వహించనున్నారు. వచ్చే నెల ఒకటో తేదీన ఈ యాత్ర ప్రారంభం కానుంది. దీనికి ఇండో పాక్ పీస్ ర్యాలీ అని నామకనణం చేశారు. ఈ ర్యాలీని ప్రముఖ జర్నలిస్టు కుల్‌దీప్ నయ్యర్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ ఫర్ పీస్ (డీయూఎఫ్‌ఎస్‌పీ) సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ సింగ్ బుధవారం వెల్లడించారు. డీయూ ఉత్తర ప్రాంగణంలో ఒకటో తేదీ సాయంత్రం ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది.
ఈ యాత్ర మొత్తం 13 రోజులపాటు కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా పంజాబ్, హర్యానాలలో శాంతి శిబిరాలను నిర్వహిస్తారు. వచ్చే నెల 13వ తేదీన ఈ ర్యాలీ అమృత్‌సర్ చేరుకుంటుంది. వాఘా సరిహద్దులో వచ్చే నెల 14,15వ తేదీల్లో జరిగే స్వాతం త్య్ర సంబరాల్లో ఈ యాత్ర బృందం పాలుపంచుకుంటుంది. కాగా గత ఏడాది కూడా డీయూఎఫ్‌ఎస్‌పీ ఇటువంటి ర్యాలీని తొలిసారి నిర్వహించింది. కన్యాకుమారి నుంచి మొదలై వాఘా సరిహద్దు చేరుకోవడంతో ఈ ర్యాలీ ముగిసిన సంగతి విదితమే. ఈ ర్యాలీ విజయవంతమైన నేపథ్యంలో ఈ ఏడాది కూడా మరో ర్యాలీకి శ్రీకారం చుట్టింది.