న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న అధికారమే పరమాధిగా ముందుకుసాగుతున్న బీజేపీ... ఆప్ ఓటుబ్యాంకుకు గండికొట్టేందుకు శతవిధాలా యత్నిస్తోంది. ఇందులోభాగంగా తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలోని ట్రాన్స్‌యుమనా తీరంలో ఆ పార్టీ ఎంపీలు తామరతంపరగా ప్రాజెక్టులను ప్రారంభించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతిఇరానీ, తూర్పు ఢిల్లీ ఎంపీ మహేష్ గిరీలు ఆదివారం ఈ నియోజకవర్గ పరిధిలో గురుగోవింద్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం ప్రాంగణ నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేసిన సంగతి విదితమే. ఇదిలాఉంచితే ఈసారి జరిగే ఎన్నికల్లో ఆప్ ఓటుబ్యాంకుకు భారీగా గండికొట్టాలని బీజేపీ తహతహలాడుతోంది.
నగరంలోని ఐదు నియోజకవర్గాల్లో పూర్వాంచలీ ఓటర్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఆ నియోజకవర్గాలను గత విధానసభ ఎన్నికల్లో ఆప్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు నియోజకవర్గాల్లో తమ ఓటుబ్యాంకును పెంచుకునేందుగాను కొత్త కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలని యోచిస్తోంది. మరోవైపు కొద్దిరోజుల క్రితం తూర్పు ఢిల్లీ ఎంపీ మహేష్‌గిరీ ఓఖ్లా ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి విదితమే. దీంతోపాటు ఖిచిడీపూర్ ప్రాంతంలో ఓ రిక్రియేషన్ క్లబ్‌ను కూడా ప్రారంభించారు. త్వరలో ఓఖ్లా పునరాభివృద్ధి ప్రాజెక్టును కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే మరిన్ని కొత్త ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయాలని యోచిస్తున్నారు.
గత విధానసభ ఎన్నికల్లో తూర్పుఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గంలో కేవలం మూడుస్థానాలు మాత్రమే బీజేపీకి దక్కాయి. అవి షహధారా, కృష్ణానగర్, విశ్వాస్‌నగర్. అదే ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జంగ్‌పుర, త్రిలోక్‌పురి, కొండ్లి, పత్పర్‌గంజ్, లక్ష్మీనగర్ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగినఎన్నికల్లో బీజేపీ తరఫున మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు కొద్దినెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు కేంద్ర మంత్రులుగా బాధ్యతలను నిర్వహిస్తుండడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28. ఇందులో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని ఆ పార్టీ బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది.
ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్‌జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టనివ్వలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఢిల్లీ విధానసభను రద్దు చేసిన సంగతి విదితమే.
‘తూర్పుఢిల్లీ’లో జోరుగా ప్రాజెక్టుల ప్రారంభం
Published Mon, Dec 15 2014 11:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement