న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను ఆకట్టుకునే ందుకు బీజేపీ... అనేక విధాలుగా యత్నిస్తోంది. ఇందులోభాగంగా ప్రచార రంగంలోకి సెలబ్రిటీ ఎంపీలు హేమమాలిని, శత్రుఘన్‌సిన్హా, వినోద్‌ఖన్నా, స్మృతి ఇరానీలను దించనుంది. వీరంతా నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. ఎన్నికల ప్రచారం కోసం మొత్తం 18 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కమల దళం సిద్ధం చేసింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తదితరులు ఉన్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ నిర్వహించే ర్యాలీలను తలదన్నేరీతిలో తమ ప్రచారం సాగాలని బీజేపీ భావిస్తోంది. సెలబ్రిటీ ఎంపీలైన హేమమాలిని, శత్రుఘన్‌సిన్హా, వినోద్‌ఖన్నా, స్మృతి ఇరానీలను రంగంలోకి దించితేనే ఇది సాధ్యమవుతుందనేది తమ ఆలోచన అని ఆ పార్టీ నాయకుడొకరు వెల్లడించారు.
ఇటీవల నగరంలో జరిగిన సమావేశాల్లోనూ వీరంతా పాల్గొన్నారని, వారి సేవలను వినియోగించుకోవడం ద్వారా ఓటర్లను ఆకట్టుకుని గరిష్ట లబ్ధి పొందడమే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. కాగా సెలబ్రిటీ ఎంపీల జాబితాలో ఈశాన్య ఢిల్లీ ఎంపీ, భోజ్‌పురి గాయకుడు మనోజ్‌తివారీ పేరు కూడా ఉంది. 16 ఏళ్ల సుదీర్ఘన విరామం తర్వాత ఈసారి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకుగల ఏ అవకాశాన్నీ బీజేపీ వదులుకోవడం లేదు. ఇందులోభాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఈ నెల పదో తేదీన నగరంలోని రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ సభలో హరియాణా, జార్ఖండ్, మహారాష్ర్ట ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నారు.
ఎన్నికల ప్రచారానికి సెలబ్రిటీ ఎంపీలు
Published Sun, Jan 4 2015 10:02 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement