సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ)లో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యేయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)పై అయోమయం సోమవారం కూడా కొనసాగింది. ఈ కోర్సుపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి తొలి జాబితా మంగళవారం వెలువడాల్సి ంది. ఈ కోర్సును రద్దు చేసినట్లయితే ప్రవేశ ప్రక్రియను మళ్లీ కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుందని, జూలై నుంచి తరగతులు మొదలయ్యే అవకాశాలు లేవని, కనీసం నాలుగైదు వారాలు ఆలస్యం కావొచ్చని కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ కోర్సుపై స్పష్టత కోరుతూ ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ, ఐసా విద్యార్థులు విశ్వవిద్యాలయం క్యాంపస్‌తోపాటు మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యాలయం వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. ఢిల్లీ యూనివర్సిటీలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును గత ఏడాది ప్రవేశపెట్టారు.
బీఏ పాస్ , బీకామ్ పాస్, బీఎస్సీ లైఫ్ సెన్సైస్ వంటి కోర్సులను రద్దు చేసి వాటి కింద ఉన్న సీట్లను నాలుగేళ్ల అనర్స్ కోర్సుల్లో పంచారు. ఇప్పుడు నాలుగేళ్ల కోర్సును రద్దు చేస్తే మళ్లీ మూడేళ్ల కోర్సు కోసం సీట్లను కేటాయించాల్సి ఉంటుందని వివిధ కళాశాలల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చేదాకా అడ్మిషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రకటించింది. విద్యార్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగించినప్పటికీ అడ్మిషన్ కోసం ఎంపిక చేసిన విద్యార్థుల తుది జాబితా, వెయిటింగ్ లిస్టులను వివాదం తేలిన తరువాతే ప్రకటిస్తామని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల యాజమాన్యం. ఢిల్లీ విశ్వవిద్యాలయం కింద ఉన్నప్పటికీ మైనారిటీ విద్యాసంస్థ అయిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో అడ్మిషన్ నియమాలు మిగతా కాలేజీలకు భిన్నంగా ఉంటాయి.
అయోమయంలో విద్యార్థులు
అయితే ఏడాదిగా నాలుగేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులు యూజీసీ ప్రకటనతో మరింత అయోమయంలో పడ్డారు. నాలుగేళ్ల కోర్సును చట్టవిరుద్ధంగా ప్రవేశపెట్టారని, దానికి గుర్తింపు కూడా లేదంటూ వచ్చిన వార్తలు మరింత అయోమయానికి గురిచేశాయి. భవిష్యత్తు ఏమిటనే విషయమై అందరినీ ఆరా తీస్తూ కనిపించారు. నాలుగేళ్ల బీటెక్ కోర్సును కొనసాగించాలని కోరుతూ బీటెక్ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు.
స్వతంత్ర ప్రతిపత్తిని హరించడమే
నాలుగేళ్ల కోర్సు కింద అడ్మిషన్లు జరపరాదంటూ యూజీసీ ఆదేశించడం డీయూ స్వయంప్రతిపత్తిని హరించడమేనని ఉపాధ్యాయుల్లో ఓ వర్గం అభిప్రాయపడింది. నాలుగు సంవత్సరాల కోర్సు కింద అడ్మిషన్లు చేపట్టరాదని, అలా చేసిన కళాశాలలకు నిధులు నిలిపివేస్తానని హెచ్చరిస్తూ యూజీసీ లేఖ రాయడాన్ని ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (డ్యూటా) మాజీ అధ్యక్షుడు ఆదిత్య నారాయణ్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. కోర్సు స్వరూపాన్ని నిర్ణయించే హక్కు యూనివర్సిటీకి ఉందని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇదేవిధంగా ప్రభుత్వం.. డీయూ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పోతే రేపు ప్రభుత్వ విధానాలనే పాఠ్యాంశాలలో చేర్చాలంటారని ఆయన హెచ్చరిం చారు. యూజీసీ... మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృ తి ఇరానీ ఆదేశాల మేరకు నడుస్తోందని ఆయన ఆరోపించారు.
నాలుగు సంవత్సరాల కోర్సుకు రాష్ట్రపతికి ఆమోదం పొందలేదనే ఆరోపణలను ఆయన ఖండించారు. నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం కోర్సు ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతికి పంపారని, దానిపై రాష్ట్రపతి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని. అందువల్ల దానికి ఆమోదం లభించినట్లేనని ఆయన చెప్పారు.
సాధారణంగా ఆర్డినెన్స్‌పై అభ్యంతరాలు కనుక ఉన్నట్టయితే నెల రోజుల్లోగా రాష్ట్రపతి దానిపై నెగెటివ్ రిమార్క్‌లు పంపుతారని, ఒకవేళ అలా పంపనట్లయితే ఆర్డినెన్స్‌ను ఆమోదించినట్లుగా భావిస్తారని ఆయన చెప్పారు. నాలుగు సంవత్సరాల కోర్సు ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ఎలాంటి నెగెటివ్ రిమార్కూ పంపలేదని ఆయన చెప్పారు. నాలుగు సంవవత్సరాల కోర్సు కేవలం డీయూలోనే కాకుండా అలహాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలోనూ ఉందన్నారు. కేంద్రం నిధులతో నడిచే దేశంలోని ఆరు సంస్థలు కూడా నాలుగేళ్ల కోర్సును అందిస్తున్నాయని, వాటి విషయంలో ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం చేయ ని యూజీసీ.. ఢిల్లీ యూనివర్సిటీ నాలుగేళ్ల కోర్సు పై అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. నాలుగేళ్ల కోర్సును ఉపసంహరించాలని డీయూపై ఒత్తిడి చేయడం యూనివర్సిటీ అస్తిత్వాన్ని సవాలు చేయడమేనని, దాని స్వయంప్రతి పత్తిని హరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్నో అభ్యంతరాల మధ్య ఢిల్లీ యూనివర్సిటీ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును ప్రవేశపెట్టిందని, అయితే దానిని అమలు చేస్తున్నప్పుడు వ్యతిరేకించని యూజీసీ ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ ప్రశ్నించారు. ఈ వివాదం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడడమే కాకుండా డీయూ ప్రతిష్ట నవ్వులాటగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థల పట్ల ఎన్‌డీఏ ప్రభుత్వానికి గల వైఖరికి ఈ వివాదం అద్దం పడుతోందని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే యూజీసీ ఆదేశంపై ఆప్ హర్షం వ్యక్తం చేసింది.
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయంగానీ లేదా దానికింద ఉన్న కళాశాలల్లోగానీ ఎఫ్‌వైయూపీ కింద అడ్మిషన్లు జరపరాదంటూ యూజీసీ జారీ చేసిన అల్ట్లిమేటం కొందరు విద్యార్థులు, టీచర్లకు ఆనందం కలిగించగా, మరికొందరిని నిరసన ప్రదర్శనలకు పురికొల్పింది. యూజీసీ అల్టిమేటం పట్ల హర్షం ప్రకటి స్తూ ఏబీవీపీ విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. యూజీసీ ఆదేశంతో డీయూలో నాలుగుసంవత్సరాల కోర్సు అంతం కావడం తథ్యమంటూ వారు ధీమా వ్యక్తం చేశారు. దీనిపై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని వారు డిమాం డ్ చేశారు. నాలుగేళ్ల కోర్సును సమర్థిస్తున్న ఎన్‌ఎస్‌యూఐ సభ్యులు కూడా కోర్సును కొనసాగించాలని ప్రదర్శన నిర్వహించారు. ఎఫ్‌వైయూపీపై నిర్వహించిన ఓ సమావేశంలో ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ కార్యకర్తలు ఘర్షణకు కూడా దిగారు. నాలుగేళ్ల కోర్సును వ్యతి రేకిస్తున్న ఐసా కార్యకర్తలు మానవ వనరుల మంత్రిత్వశాఖ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడమే కాకుం డా వైస్ చాన్స్‌లర్ దీపక్ సింగ్‌ను తొల గించాలని డిమాండ్ చేశారు. దీపక్ సింగ్ దిష్ట్టిబొమ్మను వారు దహనం చేశారు.
నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు కొనసాగుతున్న ప్రతిష్టంభన
Published Mon, Jun 23 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM
Advertisement
Advertisement