DU
-
సర్టిఫికెట్ల విషయంలో ఎటువంటి ఒత్తిడీ లేదు!
న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్ల వ్యవహారంలో తమపై ఎటువంటి రాజకీయ ఒత్తిడీ లేదని, తమను ఏ శక్తీ ప్రభావితం చేయలేదని ఢిల్లీ యూనివర్శిటీ వెల్లడించింది. మోదీ సర్టిఫికెట్ల ధృవీకరణ విషయంలో చట్ట ప్రకారమే పరిశీలనా కార్యక్రమం జరిగిందని వర్శిటీ ప్రకటించింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, ఢిల్లీ యూనివర్శిటీ ఇచ్చిన డిగ్రీ సర్టిఫికెట్లు ఫోర్జరీలని, వర్శిటీలో తాము స్వయంగా పరిశీలిస్తామన్న కేజ్రీవాల్... ధృవీకరణకోసం డీయూను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ప్రధానమంత్రి డిగ్రీ సర్టిఫికెట్ల సమస్యపై వైస్ ఛాన్స్ లర్ యోగేష్ త్యాగితో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంలో వర్శిటీ రాజకీయ ఒత్తిడులకు తలొగ్గుతోందన్న ఆరోపణలు అసత్యాలని, యూనివర్శిటీ ఆర్టీఐ సెల్... చట్ట ప్రకారం పనిచేస్తుందని వీసీ తెలిపారు. ప్రధాని సర్టిఫికెట్ల విషయంలో తమపై ఎటువంటి ఒత్తిడీ లేదని ఢిల్లీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తరుణ్ దాస్ సైతం వెల్లడించారు. ఆప్ ప్రతినిధుల బృందం మోదీ బిఏ రికార్డులను పరిశీలించేందుకు అనుమతించాలన్న డిమాండ్ తో విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో వారు ఉత్త చేతులతో తిరిగి వెళ్ళాల్సి వచ్చిందని వీసీ అన్నారు. ప్రధానమంత్రి బిఏ, ఎంఏ డిగ్రీలు నకిలీలని, మార్క్స్ లిస్టుతోపాటు, సర్జిఫికెట్ పై ఆయన పేరులో కూడ అనేక వ్యత్యాసాలు కనిపిస్తున్నాయన్న ఆప్ ఆరోపణలు అసత్యాలని తేలిపోయింది. మోదీ డిగ్రీ రికార్డులను బయట పెట్టిన వర్శిటీ... ఆయన సర్టిఫికెట్లు ప్రామాణికమైనవేనని, మార్కులిస్టులో చిన్నపాటి తప్పిదాలు మాత్రం కనిపించాయని తెలిపింది. అంతేకాక ఆయన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లకు సంబంధించిన అన్ని రికార్డులు తమవద్ద ఉన్నాయని దాస్ తెలిపారు. -
మరో వివాదంలో డీయూ వీసీ దినేష్‌సింగ్
న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) ఉపకులపతి దినేష్‌సింగ్ మళ్లీ మరో వివాదంలో చిక్కుకుపోనున్నారు. విశ్వవిద్యాలయంలో జరిగిన అనేక కుంభకోణాల్లో సింగ్ ప్రమేయం ఉందంటూ సీపీఎం నేత సీతారాం ఏచూరి రాసిన లేఖను కేంద్ర మానవ వనరుల శాఖ... రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపనుంది. కాగా నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సుపై గత ఏడాది చెలరేగిన వివాదంలో దినేష్‌సింగ్ కూరుకుపోయిన సంగతి విదితమే. రాష్ట్రపతి ఆమోదముద్ర లేనందువల్ల ఆ కోర్సును ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. అప్పట్లో వీసీని ఆదేశించిన సంగతి విదితమే. తన కార్యాలయాన్ని వీసీ దుర్వినియోగం చేసిన కారణంగా విద్యార్థులు ఇబ్బందులకు గురవడమే కాకుండా, పాలనాపరంగా కూడా అనేక సమస్యలు తలెత్తాయంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) విడుదల చేసిన శ్వేతపత్రాన్ని ...సీపీఎం నేత సీతారాం ఏచూరి తన లేఖకు జత చేశారు. -
డీయూ ఆధ్వర్యంలో ‘గిఫ్టెడ్ ఎడ్యుకేషన్ మహాభియాన్’
న్యూఢిల్లీ: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని చదువుతున్న ప్రతిభ గల పేద విద్యార్థుల కోసం ‘గిఫ్టెడ్ ఎడ్యుకేషన్ మహాభియాన్’ను ఏర్పాటుచేశారు. ఈ మేరకు ఎంసీడీ, ఎన్డీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న 90 పాఠశాలల్లో ప్రత్యేక ఎంపిక పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన 76 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వారిలో ఉన్న ప్రతిభకు మరింత పదును పెట్టేందుకు 45 రోజుల పాటు వివిధ వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ (సీఐసీ) డెరైక్టర్ మదన్ చతుర్వేది మాట్లాడుతూ.. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి వారికి మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు తాము ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. దీని కోసం రూ.1.8 కోట్ల నిధులను కేటాయించామని తెలిపారు. కాగా, గౌహతి, ఉజ్జయిని, బరోడాల్లో సైతం ఇటువంటి కార్యక్రమాలను డీయూ చేపట్టిందని చెప్పారు. అయితే అక్కడ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం అవకాశమిచ్చినట్లు వివరించారు. కాగా, విద్యార్థులను ఎంపిక చేసిన తర్వాత, వారికి నిపుణుల ఆధ్వర్యంలో 45 రోజుల పాటు పలు వర్క్‌షాప్‌లు, కౌన్సెలింగ్ తరగతులు వంటి పలు కార్యక్రమాలను చేపడతామన్నారు. అయితే ఈ వర్క్‌షాప్‌లను ఆయా విద్యార్థుల పాఠశాల విద్యాభ్యాసానికి ఆటంకం లేకుండా సెలవు దినాల్లో చేపడతామని వివరించారు. విద్యార్థులకు పూర్తి ఉచితంగా అందజేస్తున్న ఈ ‘మహాభియాన్’ను భవిష్యత్తులో జాతీయస్థాయి కార్యక్రమంగా రూపొందించాలని యూనివర్సిటీ యోచిస్తోందని చతుర్వేది వివరించారు. -
ఎందుకలా గందరగోళం సృష్టించారు?
న్యూఢిల్లీ: తొలుత నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని ఎందుకు ప్రవేశపెట్టారని ఆ తర్వాత దానిని ఎందుకు రద్దు చే సి, ఆ స్థానంలో మూడు సంవత్సరాల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (టీవైయూపీ)ని ఎందుకు ప్రవేశపెట్టారంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని (డీయూ)ని హైకోర్టు శనివారం నిలదీసింది. దీనివల్ల విద్యార్థులు బాగా గందరగోళానికి గురయ్యారని పేర్కొంది. ఇందువల్ల సదరు విద్యార్థులు అర్హత సాధించినప్పటికీ వారికి ఏయే కళాశాలల్లోనూ డిగ్రీ కోర్సులో ప్రవేశం లభించని దుస్థితి నెలకొందని ప్రధాన న్యాయమూర్తి జి.రోహిణి నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. ఈ కోర్సులకు సంబంధించి కోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులను పక్కనబెట్టి హయ్యర్ సెకండరీలో గణితం సబ్జెక్టులేని విద్యార్థికి ప్రవేశం కల్పించాలంటూ డీయూ పరిధిలోని మహరాజా అగ్రసేన్ కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించింది. ఎఫ్‌వైయూపీ స్థానంలో టీవైయూపీ రావడంతోపాటు హయ్యర్ సెకండరీలో మ్యాథ్స్ సబ్జెక్టు లేదనే సాకుతో తనకు మహరాజా అగ్రసేన్ కళాశాల యాజమాన్యం ప్రవేశం కల్పించకపోవడాన్ని సవాలుచేస్తూ బాధిత విద్యార్థి దాఖలుచేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు పైవిధంగా స్పందించింది. -
నిబంధనలకు విరుద్ధం
న్యూఢిల్లీ: శాఖాధిపతుల నియామకం విషయంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) నిబంధనలను ఉల్లంఘించిందని ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) ఆరోపించింది. వాస్తవానికి నియామకాలు జరిపే సమయంలో రొటేషన్ పద్ధతిని అనుసరించాలని, అయితే అటువంటిదేమీ జరగలేదని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో డ్యూటా అధ్యక్షురాలు నందితా నారాయణ్ ఆరోపించారు. ఆర్డినెన్స్ 13(1) ప్రకారం పరిశీలన తర్వాత ఉపకులపతి నియామకాలు జరపాల్సి ఉంటుందని, అయితే అటువంటిదేమీ జరగలేదని అన్నారు. ఇందుకు ఉదాహరణ భూభౌతిక శాస్త్ర విభాగం అధిపతిగా జెపీ శ్రీవాస్తవను నియమించకపోవడమేనన్నారు. ఆయన ఈ పదవి కోసం ఇప్పటికి రెండు పర్యాయాలు ప్రయత్నించారన్నారు. 2011, జూన్ రెండో తేదీన ఆచార్య సీఎస్ దూబేను ఈ పదవిలో నియమించారని, ఆర్డినెన్సులో ఎటువంటి వెసులుబాటు లేకపోయినప్పటికీ ఇప్పటికి రెండు పర్యాయాలు ఆయన పదవీకాలాన్ని పొడిగించారని ఆరోపించారు. షెడ్యూల్ ప్రకారమే కాగా విద్యాసంవత్సరం ఆరంభంపై ఉత్కంఠకు ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) తెరదించింది. షెడ్యూల్ ప్రకారమే ప్రారంభమవుతుందని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో డీయూ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో విద్యాసంవత్సరం ఆరంభంలో జాప్యమవుతుందేమోనని విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఉత్కంఠకు గురయ్యారు. ఈ నెల 21వ తేదీన కళాశాలలు ప్రారంభమవుతాయని డీయూ రిజిస్ట్రార్ అభయమిచ్చారు. అందువల్ల అధ్యాపకులతోపాటు విద్యార్థులు తమ తమ కళాశాలలకు వెళ్లి టైంటేబుల్ తెచ్చుకోవాలని సూచించారు. కాగా నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని రద్దు చేసిన నేపథ్యంలో మూడేళ్ల కోర్సును రీస్ట్రక్చరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని డీయూ ఆయా కళాశాలలను కోరింది. -
డీయూ ప్రవేశాలు శరవేగంగా సీట్ల భర్తీ ప్రక్రియ
న్యూఢిల్లీ: తొలి కటాఫ్ జాబితాకు గురువారమే చివరిరోజు కావడంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) పరిధిలోని పలు కళాశాలలు విద్యార్థుల తో కిటకిటలాడాయి. దరఖాస్తుల కోసం విద్యార్థులు పెద్దసంఖ్యలో రావడంతో వారు నిలబడిన క్యూలు చాంతాళ్లను తలపింపజేశాయి. కాగా కొన్ని కళాశాలలు తమ సీట్ల సంఖ్యకు మించి ప్రవేశాలను స్వీకరించాయి. ఇదిలాఉంచితే డీయూ ఉత్తర ప్రాంగణంలోని కిరోరి మాల్ కళాశాలలో సాధారణ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయమై ఈ కళాశాలలో ప్రవేశం కోసం వచ్చిన రసిక శర్మ మీడియాతో మాట్లాడుతూ ‘అడ్మిషన్ కోసం మూడు రోజుల క్రితం నేను, మా నాన్న ఇక్కడికి వచ్చాం. అయినప్పటికీ ఇంకా అడ్మిషన్ ఖరారు కాలేదు. పరీక్షల్లో 97 శాతం మార్కులు సాధించా. బుధవార ం అందరికంటే ముందు దరఖాస్తును కళాశాలకు అందజేసింది కూడా నేనే’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కళాశాల యాజమాన్యం తీరుపై రసిక శర్మ మండిపడ్డారు. ‘ప్రవేశ ప్రక్రియ అంతా గందరగోళంగా ఉంది. కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్లు తమ తమ కార్యాలయాల్లో హాయిగా, తీరిగ్గా కాలక్షేపం చేస్తున్నారు. విద్యార్థుల సమస్య లను గాలికొదిలేశార’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస తప్ప మరో మార్గమే లేదు న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) కటాఫ్ మార్కులను విపరీతంగా పెంచడంపై బీజేపీ నాయకుడు విజయ్ గోయల్ మండిపడ్డారు. కటాఫ్ మార్కుల పెంపు వల్ల ఇక్కడి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోవడం తప్ప మరో మార్గమే లేదన్నారు. సగటు విద్యార్థి నష్టపోక తప్పదన్నారు. ‘డీయూలో సీట్ల సంఖ్య 54 వేలు. 2.7 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సగటు విద్యార్థి పరిస్థితి ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. -
నేటినుంచి అడ్మిషన్లు షురూ
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ) రద్దయిన నేపథ్యంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) మంగళవారం నుంచి అడ్మిషన్ ప్రక్రియ ఆరంభించనుంది. ఈ మేరకు సోమవారం రాత్రి వరకు మొదటి కటాఫ్ జాబితాలను విడుదల చేశాయి. మొదటి కటాఫ్ జాబితా ఆధారంగా జూలై మూడు వరకు అడ్మిషన్లు జరుగుతాయి. ఎఫ్‌వైయూపీపై చెలరేగిన వివాదం కారణంగా డీయూలో అడ్మిషన్ ప్రక్రియ వారం రోజులు ఆలస్యమయింది. గత మంగళవారం ప్రారంభం కావలసిన ప్రవేశాలు ఈ మంగళవారం మొదలవుతున్నాయి. ఇదిలాఉండగా 2014-15 విద్యాసంవత్సరానికి బీ.టెక్ కోర్సును (ఎఫ్‌వైయూపీ) రద్దుచేయాలన్న డీయూ నిర్ణయాన్ని ప్రస్తుత బీ.టెక్ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. నాలుగేళ్ల బీటెక్ కోర్సును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ కార్యాలయం ఎదుట బీ.టెక్, బీఎంఎస్ విద్యార్థులు ఆదివారం ఆందోళన నిర్వహించడం తెలిసిందే. యూజీసీ నిర్లక్ష్యం చేస్తే న్యాయస్థానానికి వెళ్లేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ఇరానీ నివాసంలోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ విషయమై ఆందోళనలో పాల్గొన్న రేఖ అనే విద్యార్థిని మాట్లాడుతూ బీఎంఎస్‌ను మూడేళ్ల కోర్సుగా మారిస్తే ఎన్నో ఇబ్బందులు వస్తాయంది. మంగళవారం నుంచి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని పేర్కొంది. బీఎంఎస్ విద్యార్థుల ఆందోళన డీయూలో బీఎంఎస్ (బ్యాచిలర్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్) నాలుగేళ్ల కోర్సుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వైఖరిపై ఆందోళన వ్యక్తమవుతోంది. బీఎంఎస్ మూడేళ్లే ఉంటుందని ఇది వివరణ ఇచ్చింది. తమ కోర్సును నాలుగేళ్లుగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పలువురు బీఎంఎస్ విద్యార్థులు సోమవారం నుంచి ఆందోళనలను ఆరంభించారు. దీనిపై స్పందించిన యూజీసీ సాయంత్రం ఒక ప్రకటన చేసింది. 2013-14 విద్యాసంవత్సరంలో నాలుగేళ్ల బీ.టెక్ కోర్సులో చేరిన వారికి అదే కోర్సును కొనసాగించాలని ఇది డీయూను ఆదేశించింది. యూనివర్సిటీలో 840 మంది బీఎంఎస్ కోర్సు చదువుతుండగా, వీరికి కూడా ఇదేవిధానం అమలవుతుంంది. మిగతా కోర్సులను మూడేళ్ల వాటిగా మార్చి, బీఎంఎస్‌పై అనిశ్చితి కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు బీఎంఎస్ విద్యార్థులు యూజీసీ సీనియర్ అధికారులకు వినతిపత్రం సమర్పించా రు. బీఎంసీ కోర్సు భవితవ్యంపై చర్చించేందుకు యూజీసీ ఒక సమావేశం నిర్వహిస్తుందని సోమవారం కథనాలు వచ్చాయి. ఈ మేరకు మంగళవారం మాత్రం అధికారులు విద్యార్థులతో చర్చలు నిర్వహించారు. భవిష్యత్‌లోనూ బీఎంఎస్‌ను ఎఫ్వైయూపీగానే ఉంచాలనే డిమాండ్‌తో ఆందోళనలను కొనసాగిస్తామని నిడా సైఫీ అనే బీఎంఎస్ విద్యార్థి అన్నాడు. బీ.టెక్ కోర్సును భవిష్యత్‌లో ఎఫ్వైయూపీగానే కొనసాగిస్తామని డీయూ వైస్‌చాన్స్‌లర్ రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఈ కోర్సు విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. బీఎంఎస్ కాలపరిమితిపై చర్చించేందుకు స్థాయీ సలహాసంఘం సమావేశం నిర్వహిస్తామని యూజీసీ వైస్ చైర్మన్ హెచ్.దేవరాజ్ సోమవారం ప్రకటించారు. బీ.టెక్ మాదిరిగానే బీఎంఎస్ ఎఫ్‌వైయూపీని కూడా రద్దు చేయాలని నిర్ణయించిన డీయూ, ఇక నుంచి వీటిని మూడేళ్ల కోర్సులుగానే పరిగణించి అడ్మిషన్లు ఇస్తామని ప్రకటించింది. బీఎంఎస్, బీ.టెక్ విద్యార్థులు మాత్రం తమ కోర్సులను ఎఫ్‌వైయూపీ పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమ డిగ్రీలకు ఎటువంటి విలువా ఉండబోదని వాదిస్తున్నారు. యూజీసీ మాత్రం ఈ వాదనను పట్టించుకోలేదు. బీఎంఎస్ కోర్సు మూడేళ్లే! బీఎంఎస్ విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన యూజీసీ ఈ విషయమై సోమవారం సాయంత్రానికి స్పష్టత ఇచ్చింది. 2013-14 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు పొందిన వారికి కూడా మూడేళ్ల కోర్సునే అమలు చేయాలని డీయూను ఆదేశించింది. ఈ మేరకు మార్పులు చేయాలని స్పష్టం చేసింది. కోర్సును నాలుగేళ్లకు పొడగించాలని బీఎంఎస్ విద్యార్థులు డిమాండ్ చేసినా, యూజీసీ మాత్రం మూడేళ్లకే పరిమితం చేసింది. విద్యార్థులతో పలుసార్లు భేటీ అయిన చర్చలు నిర్వహించిన యూజీసీ అధికారులు చివరికి సాధారణ కోర్సుకే మొగ్గుచూపారు. దీనిపై పలువురు బీఎంఎస్ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అనిశ్చితికి తెర
ఎట్టకేలకు బీటెక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు కారణం ఈ కోర్సును కొనసాగించాలని యూజీసీ ...డీయూని ఆదేశించడమే. 2013-14 విద్యాసంవత్సరంలో ఈ కోర్సుల్లో మొత్తం 2,500 మంది విద్యార్థులు చేరారు. న్యూఢిల్లీ: నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ బీటెక్ కోర్సుపై అనిశ్చితికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెరదించింది. ఈ కోర్సును కొనసాగించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని (డీయూ) ఆదివారం ఆదేశించింది. దీంతో 2013-14 విద్యాసంవత్సరంలో ఈ కోర్సులో చేరిన బీటెక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. తన పరిధిలోని అన్ని కళాశాలల్లోనూ ఈ కోర్సును కొనసాగించాలంటూ యూజీసీ ...డీయూని ఆదేశించింది. ఈ కోర్సులో మొత్తం 2,500 మంది విద్యార్థులు చేరారు. పాలిమర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ , ఎలక్ట్రానిక్స్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో వీరంతా ప్రవేశాలు స్వీకరించారు. కాగా నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును రద్దు చేస్తున్నట్టు యూజీసీ ప్రకటించిన నాటి నుంచి వీరంతా నిరవధిక ఆందోళనకు దిగిన సంగతి విదితమే. 2013-14 సంవత్సరంలో ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులంతా తమ విద్యాభ్యాసా న్ని కొనసాగించవచ్చని, ఎటువంటి ఇబ్బందులూ తలెత్తవని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మిగతా అన్ని కోర్సులను మినహాయిం చిన యూజీసీ... బ్యాచిలర్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్ విషయంలో మాత్రం మౌనం వహించింది. దీనిని మూడేళ్ల కోర్సుగా మార్పిడి చేసే అవకాశముందని సంబంధిత అధికారులు సూచనప్రాయంగా తెలియజేశారు. కాగా ఈ నెల 23వ తేదీన స్థాయీసమితి నాలుగేళ్ల కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్పిడి చేసే విషయమై చర్చించింది. నేడు సమావేశం బీఎంఎస్ కోర్సు భవితవ్యంపై చర్చించేందుకుగాను ఈ నెల 30వ తేదీన యూజీసీ ఉపాధ్యక్షుడు హెచ్.దేవ్‌రాజ్... సలహా మండలితో సమావేశమవనున్నారు. ఈ విషయమై ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సలహామండలి సమావేశం సోమవారం జరగనుందన్నారు. ఈ అంశంపై ఆ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. బీటెక్, బీఎంఎస్ విద్యార్థుల ఆందోళన తమ కోర్సులను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయొద్దని డిమాండ్ చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతిఇరానీ కార్యాలయం ఎదుట బీటెక్, బీఎంఎస్ విద్యార్థులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. తమ విషయంలో యూజీసీ నిర్లక్ష్యం వహించినట్టయితే న్యాయస్థానానికి వెళ్లేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ‘వుయ్ వాంట్ బీటెక్, బీఎంఎస్ అంటూ నినదించారు. అంతటితో ఆగకుండా ఇరానీ నివాసంలోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ విషయమై ఆందోళనలో పాల్గొ న్న రేఖ అనే విద్యార్థిని మాట్లాడుతూ నాలుగేళ్ల కోర్సును మూడేళ్ల కోర్సుగా మారిస్తే తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందంది. తమ ప్రయోజనాలను మానవ వనరుల శాఖ మంత్రి కచ్చితంగా పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కాగా యూజీసీ ఆదేశాల మేరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్చిన సంగతి విదితమే. కాగా 2014-15 విద్యా సంవత్సరానికి మంగళవారం నుంచి ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం 12 మంది ప్రిన్సిపాల్స్‌తో కూడిన కమిటీని ఇప్పటికే నియమించిన సంగతి విదితమే. ఈ కమిటీ ఇందుకు సంబంధించి మూడు ప్రతిపాదలను సిద్ధం చేసింది. త్వరలో జరిగే సమావేశంలో ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటారు. -
లాంఛనంగా రద్దైన ఎఫ్‌వైయూపీ
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఎఫ్‌వైయూపీ)ను ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) శనివారం లాంఛనంగా రద్దు చేసింది. దీనిని తొలగించాలన్న ప్రతిపాదనకు యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపాయి. దీంతో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను రద్దు చేస్తున్నట్లు వైస్-చాన్స్‌లర్ దినేష్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. అత్యవసరంగా సమావేశమైన అకడమిక్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మూడేళ్ల డిగ్రీ కోర్సును అమలు చేయాలని, 2012-13 విద్యా సంవత్సరంలో అనుసరించిన పద్ధతి ప్రకారం అడ్మిషన్లు జరపాలంటూ తీర్మానించాయి. రెండు కౌన్సిళ్లు ఈ తీర్మానాన్ని భారీ మెజారిటీతో ఆమోదించినా, ఎఫ్‌వైయూపీపై మాత్రం చర్చించలేదు. అకడమిక్ కౌన్సిల్‌లోని 90 మంది సభ్యుల్లో ఎనిమిది మంది తీర్మానాన్ని వ్యతిరేకించారు. నాలుగేళ్ల కోర్సుపై డీయూ చర్చ జరపలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చ లేకుండానే అకడమిక్ కౌన్సిల్ మూడేళ్ల డిగ్రీ కోర్సుకు ఆమోదం తెలపడం దురదృష్టకరమని తీర్మానాన్ని వ్యతిరేకించిన అకడమిక్ కౌన్సిల్ సభ్యుడు సంజయ్‌కుమార్ అన్నారు. అకడమిక్ కౌన్సిల్ ఏకపక్షంగా కేవలం రెండు నిమిషాల్ల్లో తీర్మానాన్ని ఆమోదించిందని ఆయన చెప్పారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోనూ తీర్మానం భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. వైస్‌చాన్స్‌లర్ దినేష్ సింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని, ఐదు నిమిషాల్లో ఆమోదం లభించిందని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ఆదిత్య నారాయణ్ మిశ్రా చెప్పారు. ఆందోళనకు దిగిన బీ.టెక్ విద్యార్థులు ఎఫ్యూవైపీని డీయూ అధికారికంగా రద్దు చేసిన నేపథ్యంలో ఈ కోర్సు చదువుతున్న బీ.టెక్, బీ.ఎంఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్లుల భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా వైస్ చాన్స్‌లర్ 12 మంది కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో నియమించిన కమిటీ అడ్మిషన్ విధివిధానాలను రూపొందిస్తోంది. ఈ కమిటీయే బీ.టెక్ కోర్సు భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకుంటుందని మిశ్రా చెప్పారు. ఈ కమిటీ తన సిఫార్సులను శనివారం రాత్రి ఢిల్లీ యూనివర్సిటీకి అందజేస్తుంది. వీటి ప్రకారం సోమవారం నుంచి అడ్మిషన్లు మొదలు కావచ్చని భావిస్తున్నారు. తమ కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్చవద్దని డిమాండ్ చేస్తూ వందలాది మంది బీ.టెక్ విద్యార్థులు వీసీ కార్యాలయం ఎదుట శనివారం ప్రదర్శన జరిపారు. నాలుగేళల కోర్సుపై చెలరేగిన వివాదం సమసిపోవడంతో ప్రస్తుత విద్యాసంవత్సరం అడ్మిషన్లపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయిందని డీయూ అధికారి ఒకరు అన్నారు. -
ఎఫ్‌వైయూపీ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేనా?
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం ( ఎఫ్‌వైయూపీ)పై చెలరేగిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు. ఢిల్లీ యూనివర్సిటీ, యూజీసీల మధ్య తలెత్తిన వివాదంపై తక్షణం విచారణ జరపలేనని హైకోర్టు తెలిపింది. యూజీసీ ఆదేశాల మేరకు మూడేళ్ల కోర్సును అమలు చేయాలని ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాల్సిందిగా కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజనవ్యాజ్యంపై వచ్చే నెల ఒకటో తేదీన విచారణ చేపడతానని ఢిల్లీ హైకోర్టు బుధవారం తెలిపింది. ఇందుకు సంబంధించి ైహైకోర్టులో మంగళవారం రెండు పరస్పర విరుద్ధమైన పిటిషన్లు దాఖలయ్యాయి. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంను కొనసాగించాలని ఒకటి కోరగా, మరొకటి మూడేళ్ల కోర్సును అమలు చేయాలని విన్నవించింది. వీటిపై తక్షణం విచారణ జరపడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఈ వ్యవహారంపై విస్తృత విచారణ జరపాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. వెకేషన్ బెంచ్‌లోని ఓ న్యాయమూర్తి వీకే రావు... ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (డ్యూటా) న్యాయవాదిగా గతంలో వ్యవహరించారు. అందువల్ల కేసు విచారణను జూలై ఒకటి తరువాత మరో ధర్మాసనానికి అప్పగించి సెలవుల తరువాత కోర్టు తెరచినప్పుడు రెగ్యులర్ బెంచ్‌తో విచారణ జరిపించాలని ప్రతిభారాణి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం అభిప్రాయపడింది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు జాతీయ విద్యా విధానాన్ని ఉల్లంఘిస్తోందని, అందువల్ల మూడేళ్ల కోర్సును మళ్లీ ప్రారంభించాలని కోరిన పిటిషన్‌ను ఆర్కే కపూర్ అనే వ్యక్తి దాఖలు చేశారు. నాలుగు సంవత్సరాల కోర్సును కొనసాగించాలని కోరుతూ మంగళవారం సుప్రీంకోర్టుకు వెళ్లిన డ్యూటా మాజీ అధ్యక్షుడు ఏఎన్ మిశ్రా బుధవారం హైకోర్టుకు హాజరైనప్పటికీ ఆయన పిటిషన్ దాఖ లు చేయలేదు. న్యాయస్థానం వచ్చే నెల ఒకటో తేదీన విచారణ జరుపుతామని పేర్కొనడంతో పిటిషన్ దాఖలు చేయలేదని మిశ్రా తెలిపారు. మంగళవారం ఈ వ్యవహారంపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని 57 కళాశాలలు యూజీసీ కోరినవిధంగానే మూడేళ్ల కోర్సును అమలుచేయడానికి సుముఖత వ్యక్తం చేశాయి. మరో ఏడు కళాశాలలు తమ వైఖరిని స్పష్టం చేయలేదు. ఎఫ్‌వైయూపీ విషయంలో డీయూ, యూజీసీలు తమ తమ వైఖరిని మార్చుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో రెండింటి మధ్య కొనసాగుతోన్న వివాదం పరిష్కారమయితేతప్ప ప్రవేశాల ప్రక్రియ ఆరంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ అనిశ్చితి డీయూలో ప్రవేశాల కోసం వచ్చిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను ఇబ్బందుల పాలు చేసింది. అడ్మిషన్ కోసం దూరప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు రైలు టికెట్లను రద్దు చేసుకుని, హోటళ్లు, గెస్ట్‌హౌజ్‌లలో ఉంటున్నారు. డీయూ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తుండడంతోపాటు క్యాంపస్‌లోని హెల్త్ డెస్క్‌లను ఆరా తీస్తూ కాలం గడుపుతున్నారు. ఢిల్లీలో చిక్కుకుపోవడం వల్ల ఇతర కళాశాలల్లో కౌన్సెలంగ్లకు హాజరు కాలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఈ సంవత్సరం నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు వచ్చిన రెండు లక్షలకు పైగా దరఖాస్తులలో సగం ఇతర ప్రాంతాలకు చెందినవారివేనని డీయూ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో అత్యధిక శాతం మంది యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, హర్యానాలకు చెందినవారే. యూపీ, ఉత్తరాఖండ్‌లకు చెందినవారి దరఖాస్తులే 66 వేలున్నాయి. బీ.టెక్ విద్యార్థుల నిరసన ప్రదర్శన యూజీసీ తీరుపై బీ.టెక్ విద్యార్థులు మండిపడ్డారు. తాము చదువుతున్న నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయొద్దని డిమాండ్ చేస్తూ యూజీసీ కార్యాలయం వద్ద వారంతా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం ఈ మేరకు సంబంధిత అధికారులకు వారు ఓ వినతిపత్రం అందజేశారు. సత్వరమే పరిష్కరించండి నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)పై తలెత్తిన వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని పలువురు విద్యావేత్తలు యూజీసీ, డీయూలను కోరారు. ఇందులోభాగంగా గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అనిల్ త్యాగి, పంజాబ్ యూనివర్సిటీ వీసీ అరుణ్ గ్రోవర్, సెయింట్ స్టీఫెన్ కళాశాల ప్రిన్సిపల్ వేల్సన్ థంపు కొన్ని ప్రతిపాదనలను రూపొందించి యూజీసీ, డీయూలకు పంపారు. -
నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు కొనసాగుతున్న ప్రతిష్టంభన
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ)లో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యేయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)పై అయోమయం సోమవారం కూడా కొనసాగింది. ఈ కోర్సుపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి తొలి జాబితా మంగళవారం వెలువడాల్సి ంది. ఈ కోర్సును రద్దు చేసినట్లయితే ప్రవేశ ప్రక్రియను మళ్లీ కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుందని, జూలై నుంచి తరగతులు మొదలయ్యే అవకాశాలు లేవని, కనీసం నాలుగైదు వారాలు ఆలస్యం కావొచ్చని కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ కోర్సుపై స్పష్టత కోరుతూ ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ, ఐసా విద్యార్థులు విశ్వవిద్యాలయం క్యాంపస్‌తోపాటు మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యాలయం వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. ఢిల్లీ యూనివర్సిటీలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును గత ఏడాది ప్రవేశపెట్టారు. బీఏ పాస్ , బీకామ్ పాస్, బీఎస్సీ లైఫ్ సెన్సైస్ వంటి కోర్సులను రద్దు చేసి వాటి కింద ఉన్న సీట్లను నాలుగేళ్ల అనర్స్ కోర్సుల్లో పంచారు. ఇప్పుడు నాలుగేళ్ల కోర్సును రద్దు చేస్తే మళ్లీ మూడేళ్ల కోర్సు కోసం సీట్లను కేటాయించాల్సి ఉంటుందని వివిధ కళాశాలల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చేదాకా అడ్మిషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రకటించింది. విద్యార్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగించినప్పటికీ అడ్మిషన్ కోసం ఎంపిక చేసిన విద్యార్థుల తుది జాబితా, వెయిటింగ్ లిస్టులను వివాదం తేలిన తరువాతే ప్రకటిస్తామని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల యాజమాన్యం. ఢిల్లీ విశ్వవిద్యాలయం కింద ఉన్నప్పటికీ మైనారిటీ విద్యాసంస్థ అయిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో అడ్మిషన్ నియమాలు మిగతా కాలేజీలకు భిన్నంగా ఉంటాయి. అయోమయంలో విద్యార్థులు అయితే ఏడాదిగా నాలుగేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులు యూజీసీ ప్రకటనతో మరింత అయోమయంలో పడ్డారు. నాలుగేళ్ల కోర్సును చట్టవిరుద్ధంగా ప్రవేశపెట్టారని, దానికి గుర్తింపు కూడా లేదంటూ వచ్చిన వార్తలు మరింత అయోమయానికి గురిచేశాయి. భవిష్యత్తు ఏమిటనే విషయమై అందరినీ ఆరా తీస్తూ కనిపించారు. నాలుగేళ్ల బీటెక్ కోర్సును కొనసాగించాలని కోరుతూ బీటెక్ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. స్వతంత్ర ప్రతిపత్తిని హరించడమే నాలుగేళ్ల కోర్సు కింద అడ్మిషన్లు జరపరాదంటూ యూజీసీ ఆదేశించడం డీయూ స్వయంప్రతిపత్తిని హరించడమేనని ఉపాధ్యాయుల్లో ఓ వర్గం అభిప్రాయపడింది. నాలుగు సంవత్సరాల కోర్సు కింద అడ్మిషన్లు చేపట్టరాదని, అలా చేసిన కళాశాలలకు నిధులు నిలిపివేస్తానని హెచ్చరిస్తూ యూజీసీ లేఖ రాయడాన్ని ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (డ్యూటా) మాజీ అధ్యక్షుడు ఆదిత్య నారాయణ్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. కోర్సు స్వరూపాన్ని నిర్ణయించే హక్కు యూనివర్సిటీకి ఉందని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇదేవిధంగా ప్రభుత్వం.. డీయూ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పోతే రేపు ప్రభుత్వ విధానాలనే పాఠ్యాంశాలలో చేర్చాలంటారని ఆయన హెచ్చరిం చారు. యూజీసీ... మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృ తి ఇరానీ ఆదేశాల మేరకు నడుస్తోందని ఆయన ఆరోపించారు. నాలుగు సంవత్సరాల కోర్సుకు రాష్ట్రపతికి ఆమోదం పొందలేదనే ఆరోపణలను ఆయన ఖండించారు. నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం కోర్సు ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతికి పంపారని, దానిపై రాష్ట్రపతి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని. అందువల్ల దానికి ఆమోదం లభించినట్లేనని ఆయన చెప్పారు. సాధారణంగా ఆర్డినెన్స్‌పై అభ్యంతరాలు కనుక ఉన్నట్టయితే నెల రోజుల్లోగా రాష్ట్రపతి దానిపై నెగెటివ్ రిమార్క్‌లు పంపుతారని, ఒకవేళ అలా పంపనట్లయితే ఆర్డినెన్స్‌ను ఆమోదించినట్లుగా భావిస్తారని ఆయన చెప్పారు. నాలుగు సంవత్సరాల కోర్సు ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ఎలాంటి నెగెటివ్ రిమార్కూ పంపలేదని ఆయన చెప్పారు. నాలుగు సంవవత్సరాల కోర్సు కేవలం డీయూలోనే కాకుండా అలహాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలోనూ ఉందన్నారు. కేంద్రం నిధులతో నడిచే దేశంలోని ఆరు సంస్థలు కూడా నాలుగేళ్ల కోర్సును అందిస్తున్నాయని, వాటి విషయంలో ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం చేయ ని యూజీసీ.. ఢిల్లీ యూనివర్సిటీ నాలుగేళ్ల కోర్సు పై అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. నాలుగేళ్ల కోర్సును ఉపసంహరించాలని డీయూపై ఒత్తిడి చేయడం యూనివర్సిటీ అస్తిత్వాన్ని సవాలు చేయడమేనని, దాని స్వయంప్రతి పత్తిని హరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నో అభ్యంతరాల మధ్య ఢిల్లీ యూనివర్సిటీ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును ప్రవేశపెట్టిందని, అయితే దానిని అమలు చేస్తున్నప్పుడు వ్యతిరేకించని యూజీసీ ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ ప్రశ్నించారు. ఈ వివాదం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడడమే కాకుండా డీయూ ప్రతిష్ట నవ్వులాటగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థల పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి గల వైఖరికి ఈ వివాదం అద్దం పడుతోందని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే యూజీసీ ఆదేశంపై ఆప్ హర్షం వ్యక్తం చేసింది. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయంగానీ లేదా దానికింద ఉన్న కళాశాలల్లోగానీ ఎఫ్‌వైయూపీ కింద అడ్మిషన్లు జరపరాదంటూ యూజీసీ జారీ చేసిన అల్ట్లిమేటం కొందరు విద్యార్థులు, టీచర్లకు ఆనందం కలిగించగా, మరికొందరిని నిరసన ప్రదర్శనలకు పురికొల్పింది. యూజీసీ అల్టిమేటం పట్ల హర్షం ప్రకటి స్తూ ఏబీవీపీ విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. యూజీసీ ఆదేశంతో డీయూలో నాలుగుసంవత్సరాల కోర్సు అంతం కావడం తథ్యమంటూ వారు ధీమా వ్యక్తం చేశారు. దీనిపై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని వారు డిమాం డ్ చేశారు. నాలుగేళ్ల కోర్సును సమర్థిస్తున్న ఎన్ఎస్యూఐ సభ్యులు కూడా కోర్సును కొనసాగించాలని ప్రదర్శన నిర్వహించారు. ఎఫ్‌వైయూపీపై నిర్వహించిన ఓ సమావేశంలో ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ కార్యకర్తలు ఘర్షణకు కూడా దిగారు. నాలుగేళ్ల కోర్సును వ్యతి రేకిస్తున్న ఐసా కార్యకర్తలు మానవ వనరుల మంత్రిత్వశాఖ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడమే కాకుం డా వైస్ చాన్స్‌లర్ దీపక్ సింగ్‌ను తొల గించాలని డిమాండ్ చేశారు. దీపక్ సింగ్ దిష్ట్టిబొమ్మను వారు దహనం చేశారు. -
ఎఫ్‌వైయూపీని రద్దు చేయండి
న్యూఢిల్లీ: నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని రద్దు చేయాలంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశించింది. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని వీసీ ఇటీవల యూజీసీకి ఓ లేఖ రాసిన సంగతి విదితమే. అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా యూజీసీ పైవిధంగా ఆదేశించింది. ఈ మేరకు వీసీకి శనివారం ఓ ఇ-మెయిల్ పంపింది. ఈ విషయాన్ని డీయూ అధికారులు తెలియజేశారు. అయితే ఈ కోర్సును వ్యతిరేకిస్తున్న అధ్యాపకులు మాత్రం వైస్ చాన్సలర్ మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఎఫ్‌వైయూపీపై త్వరలో జరగనున్న విద్యామండలి సమావేశానికి హాజరవ్వాలని, ఈ అంశంపై అక్కడ చర్చించాలంటూ సభ్యులను ఆదేశించారన్నారు. తనకు అందిన ఇ-మెయిల్ ప్రతిని సభ్యులకు చూపేందుకు కూడా వీసీ ఇష్టపడలేదని ఆరోపించారు. కాగా వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా తొందరపడి ఓ నిర్ణయం తీసుకున్నారంటూ యూజీసీతో వీసీ వాదించినట్టు అధ్యాపకులు చెబుతున్నారు. కాగా ఈ నెల 13వ తేదీన జరిగిన సమావేశంలో నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ను సమీక్షించాలంటూ డీయూని ఆదేశించిన సంగతి విదితమే. 10+2+3 ప్యాటర్న్‌కు ఇది వ్యతిరేకమని యూజీసీ అభిప్రాయపడింది. ఇందుకు డీయూ స్పందిస్తూ విశ్వవిద్యాలయం ఆర్డినెన్స్‌ను సవరించిన తర్వాతే ఈ కోర్సును అమలు చేశామని తెలియజేసింది. మరోవైపు ఈ కోర్సు రద్దు కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా)తోపాటు ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ, ఏఐడీఎస్ఓ, ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్, సీవైఎస్ఎస్, డీఎస్‌యూ, ఐఎన్ఎస్ఓ, కేవైఎస్, ఎన్ఈఎఫ్ఐఎస్, పచ్చాస్, ఎస్ఎఫ్ఐ, ఎస్వైఎస్ తదితర సంఘాలు ఏడాదికాలంగా అనేక పర్యాయాలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించిన సంగతి విదితమే. విద్యార్థులకు గాయాలు: నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)కు వ్యతిరేకంగా శనివారం ఆందోళనకు ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించడంతో వారిలో అనేకమంది గాయపడ్డారు. వైస్‌చాన్స్‌లర్ నివాసాన్ని ముట్టడించేందుకువీరంతా ఆయన నివాసం వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న బారికేడ్లను దాటిముందుకు పోయేందుకు యత్నించడంతో పోలీసులు నీటి ఫిరంగులను వారిపై ప్రయోగించారు. ఏబీవీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బారికేడ్లను దాటుతుండగా పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించారు. అనంతరం కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఏబీవీపీ ఢిల్లీ శాఖ కార్యదర్శి సాకేత్ బహుగుణ మాట్లాడుతూ డీయూ పరిపాలన విభాగం ఆదేశాల మేరకే పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎఫ్‌వైయూపీని రద్దు చేయాలంటూ వీసీని యూజీసీ ఆదే శించిందని, అయిన ప్పటికీ ఆయన పట్టించుకోకపోవడమేమిటని ప్రశ్నించారు. కాగా ఈ దాడిని ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకుల సంఘం (డ్యూటా) ఖండించింది. మరోవైపు ఈ కోర్సుకు గతకొంతకాలంగా ఉద్యమిస్తున్న ఎన్ఎస్యూఐ సభ్యులపైనా శనివారం పోలీసులు దాడిచేశారు. ఈ ఘటనలోనూ కొంతమంది గాయపడ్డారు. ఈ దాడిని ఎన్ఎస్యూఐ ఖండించింది. దీనిని ఫాసిస్టు చర్యగా అభివర్ణించింది. -
డీయూలో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సు
న్యూఢిల్లీ: ఇకపై ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లోనూ ఫోరెన్సిక్ సైన్సు కోర్సు చేయొచ్చు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సును డీయూప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. అయితే ఈ కోర్సును ఎన్ని కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉండాలనే అంశానికి సంబంధించి విద్యామండలి ఆమోదం లభించాల్సి ఉంది. మూడు లేదా నాలుగు కళాశాలల్లో ఈ కోర్సును అందుబాటులోకి తీసుకురావాలని డీయూ భావిస్తోంది. ఇందుకు సంబంధించి శ్రీ గురు తేజ్‌బహదుర్ ఖల్సా కళాశాలకు ఇప్పటికే అనుమతి లభించింది. కాగా ఆప్టికల్ మార్క్ రిజిస్ట్రేషన్ (ఓఎంఆర్) ద్వారా ఈ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. అయితే షరతులు వర్తిస్తాయని చెప్పేందుకుగాను దరఖాస్తు కిందిభాగంలో ఓ నక్షత్రాన్ని ఉంచారు. ఆన్లైన్లో లక్షకుపైగా దరఖాస్తుల విక్రయం ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో ఈ ఏడాది ఆన్లైన్ దరఖాస్తులు రికార్డుస్థాయిలో అమ్ముడుపోయా యి. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఎక్కువసంఖ్య లో దరఖాస్తులు అమ్ముడుపోయే సూచనలు కనిపిస్తున్నాయి. డీయూ గణాంకాల ప్రకారం ఆన్‌లైన్‌ద్వారా 1,01,188 దరఖాస్తులను విద్యార్థులు కొనుగోలు చేశారు. ఇక ఆఫ్‌లైన్ విషయానికొస్తే మొత్తం 79,293 దరఖాస్తులను విద్యార్థులు డీయూ పరిధిలోని వివిధ కళాశాలల్లో సమర్పించారు. మొత్తం 1,80,481 దరఖాస్తులు తమకు అందాయని డీయూ జాయింట్ డీన్, స్టూడెంట్స్ అండ్ మీడియా కో-ఆర్డినేటర్ మలయ్ నవీన్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దరఖాస్తుల విక్రయాలు ఇంకా జోరందుకునే అవకాశముందన్నారు. హిందీ లేదా సంస్కృతంవైపు మొగ్గు హిందీ లేదా సంస్కృతంలో చదువుకోవడానికే ఆఫ్రికన్ విద్యార్థులు మొగ్గుచూపారు. చివరిరోజు కావడంతో విదేశీ విద్యార్థులు మంగళవారం భారీ సం ఖ్యలో తమ తమ దరఖాస్తులను సమర్పించారు. ఈ విషయమై డీయూ ఉన్నతాధికారి అమృత్ కౌర్ బస్రా మీడియాతో మాట్లాడుతూ అండర్గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధిం చిన దరఖాస్తుల దాఖలుకు మంగళవారమే చివరి రోజు కావడంతో ఈసారి పెద్దసంఖ్యలో విదేశీ విద్యార్థులు ఇక్కడికి వచ్చి తమ తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారన్నారు. వాస్తవానికి ఈ కోర్సుల కు తుది గడువు మార్చి 30వ తేదీయే అయినప్పటికీ ఏప్రిల్ 30కి ఒకసారి గడువు పొడిగించిన డీయూ విద్యార్థుల సంఖ్య భారీగా ఉండడంతో జూన్ పదో తేదీకి కూడా పొడిగించిన సంగతి విదితమే. -
తిరిగి విధుల్లోకి తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ :తన విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను లీక్ చేసినందుకు సస్పెండ్‌చేసిన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) వైస్ చాన్సలర్ని కోరారు. కాగా గత సంవత్సరం బీఏ పొలిటికల్ సైన్స్ కోర్సులో స్మృతి ఇరానీ ప్రవేశం పొందారని, అయితే ఇటీవల జరిగిన పరీక్షకు ఆమె హాజరుకాలేదంటూ ఓ హిందీ దినపత్రిక ఆమె హాల్ టికెట్‌తో సహా ప్రచురించింది. ఈ నేపథ్యంలో సదరు హాల్ టికెట్ బయటకు వచ్చేందుకు దినపత్రికకు సహకరించిన ఐదుగురు సిబ్బందిని డీయూ సస్పెండ్ చేసింది. వీరిలో బోధనేతర సిబ్బంది, సెక్షన్ అధికారి, ఆ దిగువ హో దా కలిగిన ఉద్యోగులని డీయూ తెలిపింది. కాగా గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బయటపెట్టింది తామేనంటూవారంతా అంగీకరించారు. అయినప్పటికీ వారి సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని స్మృతి విన్నవించారు. ‘ఢిల్లీ విశ్వవిద్యాలయం ఓ స్వతంత్ర సంస్థ. అందువల్లనే ఉద్యోగుల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ను నేనే వ్యక్తిగతంగా కోరాను’ అని ఆమె ట్వీట్ చేశారు. ప్రజా జీవనంలో ఉన్నవారు ఎలాంటి తనిఖీలు, విమర్శలకైనా సిద్ధంగా ఉండాలన్నారు. అందుకు తాను కూడా సిద్ధమేనన్నారు. సస్పెన్షన్ ఉత్త్వర్వులు జారీ చేయలేదు పత్రాల లీకేజీ పాల్పడిన ఐదుగురు ఉద్యోగులకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయలేదని ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) వైస్ చాన్సలర్ దినేశ్ సింగ్ స్పష్టం చేశారు. సదరు ఉద్యోగులను సస్పెండ్ చేయొద్దంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ట్విటర్లో పేర్కొన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. -
సాయిబాబాను విడిచిపెట్టండి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఆరోగ్యం బాగా లేనందున మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన విడుదల చేయాలని ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) అధ్యాపకులు కోరుతున్నారు. అసలు ఆయనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తూ డీయూ అధ్యాపకుల సంఘం (డూటా) బుధవారం ఆందోళన నిర్వహించింది. సాయిబాబా కుటుంబ సభ్యులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తనకు సరైన సదుపాయాలు కల్పించకుంటే నాగపూర్ జైలులోనే నిరాహార దీక్షకు దిగుతానని సాయిబాబా హెచ్చరించారు. ‘కనీసం వెలుతురు కూడా లేని చీకటిగదిలో వికలాంగుడ్ని ఎలా ఉంచుతారో అర్థం కావడం లేదు. నా భర్తను సస్పెండ్ చేసి క్వార్టర్ నుంచి మమ్మల్ని వెళ్లగొట్టాలని డీయూ యాజమాన్యం భావిస్తోంది’ అని సాయిబాబా బార్య వసంత మీడియా సమావేశంలో అన్నారు. పోలీసులకు ఆయన అన్ని విధాలా సహకరిస్తున్నారని, మొబైల్ నంబర్ మార్చిన విషయాన్ని కూడా ఆయన తెలియజేశారని వివరించారు. ఒక అధ్యాపకుణ్ని చీకటిగదిలో నిర్బంధించి హింసించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని డూటా అధ్యక్షురాలు నందితా నారాయణ్ విమర్శించారు. పోలీసుల అణచివేతపై పోరాడటానికి ‘డీయూ కమ్యూనిటీ’ పేరుతో ప్రత్యేక సంఘంగా ఏర్పడ్డామని, ఆయనకు బెయిల్ వచ్చేదాకా పోరాడుతామని ప్రకటించారు. పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను అపహరించారని సినీ రూపకర్త సంజయ్ కక్ ఆరోపించారు. ఆపరేషన్ గ్రీన్ హంట్‌లో భాగంగానే పోలీసులు ఈ పనిచేశారని స్పష్టం చేశారు. సాయిబాబాకు జరుగుతున్న అన్యాయంపై డీయూ యాజమాన్యం కూడా స్పందించాలని మాజీ న్యాయమూర్తి జస్టిస్ సచార్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని నల్లమిల్లి గ్రామానికి చెందిన సాయిబాబాను ఈ నెల తొమ్మిదిన అరెస్టు చేశారు. పీయూసీఎల్ ఖండన మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో సాయిబాబాను అరెస్టు చేయడాన్ని పౌరహక్కుల ప్రజాసంఘం (పీయూసీఎల్) గురువారం ఖం డించింది. ఆయనను అరెస్టు చేసిన విధానం అత్యంత క్రూరంగా ఉందని పీయూసీఎల్ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది. ఆయన పోలీసులకు అన్ని విధాలా సహకరించారని స్పష్టం చేసింది. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ కేసులో జోక్యం చేసుకొని గడ్చిరోలీ పోలీసులపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేసింది. తీవ్రవైకల్యంతో వీల్‌చెయిర్‌కు పరిమితమైన ఈ ప్రొఫెసర్ రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లిష్ సబ్జెక్టు బోధిస్తున్నారు.