న్యూఢిల్లీ: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని చదువుతున్న ప్రతిభ గల పేద విద్యార్థుల కోసం ‘గిఫ్టెడ్ ఎడ్యుకేషన్ మహాభియాన్’ను ఏర్పాటుచేశారు. ఈ మేరకు ఎంసీడీ, ఎన్‌డీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న 90 పాఠశాలల్లో ప్రత్యేక ఎంపిక పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన 76 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వారిలో ఉన్న ప్రతిభకు మరింత పదును పెట్టేందుకు 45 రోజుల పాటు వివిధ వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ (సీఐసీ) డెరైక్టర్ మదన్ చతుర్వేది మాట్లాడుతూ.. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి వారికి మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు తాము ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. దీని కోసం రూ.1.8 కోట్ల నిధులను కేటాయించామని తెలిపారు. కాగా, గౌహతి, ఉజ్జయిని, బరోడాల్లో సైతం ఇటువంటి కార్యక్రమాలను డీయూ చేపట్టిందని చెప్పారు.
అయితే అక్కడ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం అవకాశమిచ్చినట్లు వివరించారు. కాగా, విద్యార్థులను ఎంపిక చేసిన తర్వాత, వారికి నిపుణుల ఆధ్వర్యంలో 45 రోజుల పాటు పలు వర్క్‌షాప్‌లు, కౌన్సెలింగ్ తరగతులు వంటి పలు కార్యక్రమాలను చేపడతామన్నారు. అయితే ఈ వర్క్‌షాప్‌లను ఆయా విద్యార్థుల పాఠశాల విద్యాభ్యాసానికి ఆటంకం లేకుండా సెలవు దినాల్లో చేపడతామని వివరించారు. విద్యార్థులకు పూర్తి ఉచితంగా అందజేస్తున్న ఈ ‘మహాభియాన్’ను భవిష్యత్తులో జాతీయస్థాయి కార్యక్రమంగా రూపొందించాలని యూనివర్సిటీ యోచిస్తోందని చతుర్వేది వివరించారు.
డీయూ ఆధ్వర్యంలో ‘గిఫ్టెడ్ ఎడ్యుకేషన్ మహాభియాన్’
Published Sun, Jan 4 2015 10:07 PM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM
Advertisement