శాఖాధిపతుల నియామకం విషయంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) నిబంధనలను ఉల్లంఘించిందని ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) ఆరోపించింది.
న్యూఢిల్లీ: శాఖాధిపతుల నియామకం విషయంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) నిబంధనలను ఉల్లంఘించిందని ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) ఆరోపించింది. వాస్తవానికి నియామకాలు జరిపే సమయంలో రొటేషన్ పద్ధతిని అనుసరించాలని, అయితే అటువంటిదేమీ జరగలేదని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో డ్యూటా అధ్యక్షురాలు నందితా నారాయణ్ ఆరోపించారు. ఆర్డినెన్స్ 13(1) ప్రకారం పరిశీలన తర్వాత ఉపకులపతి నియామకాలు జరపాల్సి ఉంటుందని, అయితే అటువంటిదేమీ జరగలేదని అన్నారు. ఇందుకు ఉదాహరణ భూభౌతిక శాస్త్ర విభాగం అధిపతిగా జెపీ శ్రీవాస్తవను నియమించకపోవడమేనన్నారు. ఆయన ఈ పదవి కోసం ఇప్పటికి రెండు పర్యాయాలు ప్రయత్నించారన్నారు. 2011, జూన్ రెండో తేదీన ఆచార్య సీఎస్ దూబేను ఈ పదవిలో నియమించారని, ఆర్డినెన్సులో ఎటువంటి వెసులుబాటు లేకపోయినప్పటికీ ఇప్పటికి రెండు పర్యాయాలు ఆయన పదవీకాలాన్ని పొడిగించారని ఆరోపించారు.
షెడ్యూల్ ప్రకారమే
కాగా విద్యాసంవత్సరం ఆరంభంపై ఉత్కంఠకు ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) తెరదించింది. షెడ్యూల్ ప్రకారమే ప్రారంభమవుతుందని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో డీయూ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో విద్యాసంవత్సరం ఆరంభంలో జాప్యమవుతుందేమోనని విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఉత్కంఠకు గురయ్యారు. ఈ నెల 21వ తేదీన కళాశాలలు ప్రారంభమవుతాయని డీయూ రిజిస్ట్రార్ అభయమిచ్చారు. అందువల్ల అధ్యాపకులతోపాటు విద్యార్థులు తమ తమ కళాశాలలకు వెళ్లి టైంటేబుల్ తెచ్చుకోవాలని సూచించారు. కాగా నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని రద్దు చేసిన నేపథ్యంలో మూడేళ్ల కోర్సును రీస్ట్రక్చరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని డీయూ ఆయా కళాశాలలను కోరింది.