అనిశ్చితికి తెర
ఎట్టకేలకు బీటెక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు కారణం ఈ కోర్సును కొనసాగించాలని యూజీసీ ...డీయూని ఆదేశించడమే. 2013-14 విద్యాసంవత్సరంలో ఈ కోర్సుల్లో మొత్తం 2,500 మంది విద్యార్థులు చేరారు.
న్యూఢిల్లీ: నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ బీటెక్ కోర్సుపై అనిశ్చితికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెరదించింది. ఈ కోర్సును కొనసాగించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని (డీయూ) ఆదివారం ఆదేశించింది. దీంతో 2013-14 విద్యాసంవత్సరంలో ఈ కోర్సులో చేరిన బీటెక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. తన పరిధిలోని అన్ని కళాశాలల్లోనూ ఈ కోర్సును కొనసాగించాలంటూ యూజీసీ ...డీయూని ఆదేశించింది. ఈ కోర్సులో మొత్తం 2,500 మంది విద్యార్థులు చేరారు. పాలిమర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ , ఎలక్ట్రానిక్స్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో వీరంతా ప్రవేశాలు స్వీకరించారు.
కాగా నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును రద్దు చేస్తున్నట్టు యూజీసీ ప్రకటించిన నాటి నుంచి వీరంతా నిరవధిక ఆందోళనకు దిగిన సంగతి విదితమే. 2013-14 సంవత్సరంలో ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులంతా తమ విద్యాభ్యాసా న్ని కొనసాగించవచ్చని, ఎటువంటి ఇబ్బందులూ తలెత్తవని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మిగతా అన్ని కోర్సులను మినహాయిం చిన యూజీసీ... బ్యాచిలర్ ఇన్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విషయంలో మాత్రం మౌనం వహించింది. దీనిని మూడేళ్ల కోర్సుగా మార్పిడి చేసే అవకాశముందని సంబంధిత అధికారులు సూచనప్రాయంగా తెలియజేశారు. కాగా ఈ నెల 23వ తేదీన స్థాయీసమితి నాలుగేళ్ల కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్పిడి చేసే విషయమై చర్చించింది.
నేడు సమావేశం
బీఎంఎస్ కోర్సు భవితవ్యంపై చర్చించేందుకుగాను ఈ నెల 30వ తేదీన యూజీసీ ఉపాధ్యక్షుడు హెచ్.దేవ్‌రాజ్... సలహా మండలితో సమావేశమవనున్నారు. ఈ విషయమై ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సలహామండలి సమావేశం సోమవారం జరగనుందన్నారు. ఈ అంశంపై ఆ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
బీటెక్, బీఎంఎస్ విద్యార్థుల ఆందోళన
తమ కోర్సులను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయొద్దని డిమాండ్ చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతిఇరానీ కార్యాలయం ఎదుట బీటెక్, బీఎంఎస్ విద్యార్థులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. తమ విషయంలో యూజీసీ నిర్లక్ష్యం వహించినట్టయితే న్యాయస్థానానికి వెళ్లేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ‘వుయ్ వాంట్ బీటెక్, బీఎంఎస్ అంటూ నినదించారు. అంతటితో ఆగకుండా ఇరానీ నివాసంలోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ విషయమై ఆందోళనలో పాల్గొ న్న రేఖ అనే విద్యార్థిని మాట్లాడుతూ నాలుగేళ్ల కోర్సును మూడేళ్ల కోర్సుగా మారిస్తే తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందంది. తమ ప్రయోజనాలను మానవ వనరుల శాఖ మంత్రి కచ్చితంగా పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కాగా యూజీసీ ఆదేశాల మేరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్చిన సంగతి విదితమే.
కాగా 2014-15 విద్యా సంవత్సరానికి మంగళవారం నుంచి ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం 12 మంది ప్రిన్సిపాల్స్‌తో కూడిన కమిటీని ఇప్పటికే నియమించిన సంగతి విదితమే. ఈ కమిటీ ఇందుకు సంబంధించి మూడు ప్రతిపాదలను సిద్ధం చేసింది. త్వరలో జరిగే సమావేశంలో ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటారు.