ఎఫ్‌వైయూపీ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేనా?
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం ( ఎఫ్‌వైయూపీ)పై చెలరేగిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు. ఢిల్లీ యూనివర్సిటీ, యూజీసీల మధ్య తలెత్తిన వివాదంపై తక్షణం విచారణ జరపలేనని హైకోర్టు తెలిపింది. యూజీసీ ఆదేశాల మేరకు మూడేళ్ల కోర్సును అమలు చేయాలని ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాల్సిందిగా కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజనవ్యాజ్యంపై వచ్చే నెల ఒకటో తేదీన విచారణ చేపడతానని ఢిల్లీ హైకోర్టు బుధవారం తెలిపింది. ఇందుకు సంబంధించి ైహైకోర్టులో మంగళవారం రెండు పరస్పర విరుద్ధమైన పిటిషన్లు దాఖలయ్యాయి. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంను కొనసాగించాలని ఒకటి కోరగా, మరొకటి మూడేళ్ల కోర్సును అమలు చేయాలని విన్నవించింది.
వీటిపై తక్షణం విచారణ జరపడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఈ వ్యవహారంపై విస్తృత విచారణ జరపాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. వెకేషన్ బెంచ్‌లోని ఓ న్యాయమూర్తి వీకే రావు... ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (డ్యూటా) న్యాయవాదిగా గతంలో వ్యవహరించారు. అందువల్ల కేసు విచారణను జూలై ఒకటి తరువాత మరో ధర్మాసనానికి అప్పగించి సెలవుల తరువాత కోర్టు తెరచినప్పుడు రెగ్యులర్ బెంచ్‌తో విచారణ జరిపించాలని ప్రతిభారాణి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం అభిప్రాయపడింది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు జాతీయ విద్యా విధానాన్ని ఉల్లంఘిస్తోందని, అందువల్ల మూడేళ్ల కోర్సును మళ్లీ ప్రారంభించాలని కోరిన పిటిషన్‌ను ఆర్‌కే కపూర్ అనే వ్యక్తి దాఖలు చేశారు.
నాలుగు సంవత్సరాల కోర్సును కొనసాగించాలని కోరుతూ మంగళవారం సుప్రీంకోర్టుకు వెళ్లిన డ్యూటా మాజీ అధ్యక్షుడు ఏఎన్ మిశ్రా బుధవారం హైకోర్టుకు హాజరైనప్పటికీ ఆయన పిటిషన్ దాఖ లు చేయలేదు. న్యాయస్థానం వచ్చే నెల ఒకటో తేదీన విచారణ జరుపుతామని పేర్కొనడంతో పిటిషన్ దాఖలు చేయలేదని మిశ్రా తెలిపారు. మంగళవారం ఈ వ్యవహారంపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.
ఇదిలా ఉండగా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని 57 కళాశాలలు యూజీసీ కోరినవిధంగానే మూడేళ్ల కోర్సును అమలుచేయడానికి సుముఖత వ్యక్తం చేశాయి. మరో ఏడు కళాశాలలు తమ వైఖరిని స్పష్టం చేయలేదు. ఎఫ్‌వైయూపీ విషయంలో డీయూ, యూజీసీలు తమ తమ వైఖరిని మార్చుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో రెండింటి మధ్య కొనసాగుతోన్న వివాదం పరిష్కారమయితేతప్ప ప్రవేశాల ప్రక్రియ ఆరంభమయ్యే సూచనలు కనిపించడం లేదు.
ఈ అనిశ్చితి డీయూలో ప్రవేశాల కోసం వచ్చిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను ఇబ్బందుల పాలు చేసింది. అడ్మిషన్ కోసం దూరప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు రైలు టికెట్లను రద్దు చేసుకుని, హోటళ్లు, గెస్ట్‌హౌజ్‌లలో ఉంటున్నారు. డీయూ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తుండడంతోపాటు క్యాంపస్‌లోని హెల్త్ డెస్క్‌లను ఆరా తీస్తూ కాలం గడుపుతున్నారు. ఢిల్లీలో చిక్కుకుపోవడం వల్ల ఇతర కళాశాలల్లో కౌన్సెలంగ్‌లకు హాజరు కాలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఈ సంవత్సరం నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు వచ్చిన రెండు లక్షలకు పైగా దరఖాస్తులలో సగం ఇతర ప్రాంతాలకు చెందినవారివేనని డీయూ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో అత్యధిక శాతం మంది యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, హర్యానాలకు చెందినవారే. యూపీ, ఉత్తరాఖండ్‌లకు చెందినవారి దరఖాస్తులే 66 వేలున్నాయి.
బీ.టెక్ విద్యార్థుల నిరసన ప్రదర్శన
యూజీసీ తీరుపై బీ.టెక్ విద్యార్థులు మండిపడ్డారు. తాము చదువుతున్న నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయొద్దని డిమాండ్ చేస్తూ యూజీసీ కార్యాలయం వద్ద వారంతా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం ఈ మేరకు సంబంధిత అధికారులకు వారు ఓ వినతిపత్రం అందజేశారు.
సత్వరమే పరిష్కరించండి
నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)పై తలెత్తిన వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని పలువురు విద్యావేత్తలు యూజీసీ, డీయూలను కోరారు. ఇందులోభాగంగా గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అనిల్ త్యాగి, పంజాబ్ యూనివర్సిటీ వీసీ అరుణ్ గ్రోవర్, సెయింట్ స్టీఫెన్ కళాశాల ప్రిన్సిపల్ వేల్సన్ థంపు కొన్ని ప్రతిపాదనలను రూపొందించి యూజీసీ, డీయూలకు పంపారు.