క్విక్ కామర్స్‌లోకి మింత్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా క్విక్ కామర్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ’ఎం–నౌ’ పేరుతో 30 నిమిషాల్లోనే ఉత్పత్తులను డెలివరీ చేయనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం బెంగళూరులో ఈ సేవలను అందిస్తోంది. రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా మెట్రో, నాన్–మెట్రో నగరాల్లో విస్తరించడానికి సిద్ధంగా ఉన్నామని మింత్రా సీఈవో నందిత సిన్హా తెలిపారు. ఉత్పత్తుల కొనుగోలు కోసం సమయం వృ«థా కాకుండా ఎం–నౌ సౌకర్యవంతమైన పరిష్కారం అని చెప్పారు. అంతర్జాతీయ, దేశీయ బ్రాండెడ్ లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను వినియోగదార్లు కేవలం 30 నిమిషాల్లోనే అందుకోవచ్చని కంపెనీ ప్రకటన తెలిపింది. ఫ్యాషన్, బ్యూటీ, యాక్సెసరీస్, గృహ విభాగంలో 10,000 కంటే ఎక్కువ ఉత్పత్తుల శ్రేణిని ప్రస్తుతం ఎం–నౌ లో అందిస్తోంది. 3–4 నెలల్లో ఈ సంఖ్యను లక్షకు పైచిలుకు చేర్చనున్నట్టు మింత్రా వెల్లడించింది. మార్పిడి, వెనక్కి ఇచ్చే సౌకర్యం.. నవంబర్‌లో బెంగళూరులో మింత్రా క్విక్ కామర్స్ పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించింది. పైలట్ ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి సానుకూల స్పందన లభించిందని సిన్హా వ్యాఖ్యానించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఇతర క్విక్ కామర్స్ కంపెనీల మాదిరిగా కాకుండా ఉత్పత్తుల మార్పిడి, వెనక్కి ఇచ్చే సౌకర్యం కూడా ఉందని నందిత వెల్లడించారు. కాగా, మెట్రో నగరాల్లో మింత్రా ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలకు 2022లో శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఆర్డర్ పెట్టిన 24–48 గంటల్లో ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. మరోవైపు క్విక్ కామర్స్ రంగంలో ఉన్న సంస్థలు బ్యూటీ, ఫ్యాషన్ విభాగాలను జోడిస్తున్న తరుణంలో.. క్విక్ కామర్స్ లోని ఎంట్రీ ఇస్తున్న తొలి ఫ్యా షన్ ప్లాట్‌ఫామ్ మింత్రా కావడం గమనార్హం.