జై నారసింహా.. జైజై లక్ష్మీనారసింహా
* మంగళాద్రిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
* ఉత్తరద్వారంలో దర్శనమిచ్చిన శ్రీవారు
మంగళగిరి : శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం స్వామివారు బంగారు గరుడవాహనంపై ఉత్తరద్వారంలో దర్శనమిచ్చారు. శనివారం రాత్రి స్వామి వారు జగన్మోహిని అలంకారంలో పుష్పకవిమానంపై గ్రామోత్సవంతో ప్రారంభమైన వేడుకలు అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు తిరువంజనోత్సవం, అభిషకాలు నిర్వహించారు. స్వామివారు బంగారు గరుడవాహనంపై ఉత్తరద్వారంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని శంఖుతీర్ధం స్యీకరించారు. రద్దీ గంటగంటకు పెరగడంతో దైవదర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది. అనంతరం సాయంత్రం శ్రీస్వామివారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి వారు ఉత్తరద్వార దర్శనం ప్రారం¿¶భమైన వెంటనే ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్వామి వారిని దర్శించుకుని శంఖుకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధం స్వీకరించారు. ఆలయ ఈవో మండెపూడి పానకాలరావు ఆలయమర్యాదలతో స్వాగతం పలికి పూజలు చేయించారు. స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకటరమణ, మురుగుడు హనుమంతరావు, ఇండియా క్రికెట్ సలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కె ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, హైకోర్టు జడ్జి మూర్తి, జిల్లా జడ్జిలు, వివిధ శాఖల అధికారులు స్వామి వారిని దర్శించుకుని శంకుతీర్ధం స్వీకరించారు. ఆలయ అధికారి మండెపూడి పానకలరావు, పాలకవర్గం సభ్యులు ఆలేటి నాగలక్ష్మి, ఊట్ల శ్రీమన్నారాయణ, అనుమోలు సాంబశివరావు, క్రోసూరి శివనాగరాజు, మోరం సాంబశివరావు, పంచుమర్తి ప్రసాద్, ఆర్ శ్రీనివాసరావు, వెనిగళ్ళ ఉమాకాంతంలు వారికి ఆలయమర్యాదలతో స్వాగతం పలకగా అర్చకులు పద్మానాభాచార్యులు తదితరులు పూజలు నిర్వహించారు.