narayanagiri
-
భక్త జనసంద్రం.. నారాయణగిరి క్షేత్రం
ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించిన చినజీయర్‌స్వామి రంపచోడవరం : నారాయణగిరి క్షేత్రం వేంకటేశ్వరస్వామి ఆలయం భక్త జనసంద్రంగా మారింది. ఆలయంలో మంగళవారం నుంచి జరుగుతున్న కార్యక్రమాలు శుక్రవారానికి మూడో రోజుకు చేరాయి. చినజీయర్‌స్వామి ఆలయానికి వచ్చి వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముహూర్త సమయానికి మేళాతాళాల మధ్య ధ్వజస్తంభ అవరోహణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం భక్తులనుద్దేశించి జీయర్‌స్వామి మాట్లాడారు. రంపచోడవరంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారని హిందూధర్మ పరిరక్షణకు ఇదో తార్కాణమన్నారు. గుడి నిర్మాణంలో ఎంతో కృషి చేసిన సాదిక్‌మాస్టార్‌ను ఆయన అభినందించారు. భక్తులు సనాత హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల ఆలయ అధికారి వేండ్ర త్రినాథరావు, దేవాదాయశాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ అజాద్ తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి శుక్రవారం ఉదయం చిన్నజీయర్‌స్వామివారిని కలిసి ఆయన ఆశీస్సులు పొందారు. శుక్రవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పోటెత్తారు. -
ఆటో బోల్తా.. తొమ్మిది మందికి గాయాలు
వరంగల్ : వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. కూలీలను తీసుకెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా.. కొట్టడంతో అందులో ఉన్న తొమ్మిది మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను 108 సాయంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. -
వైభవంగా శ్రీవారి నూతన పాదాల ప్రతిష్టాపన
తిరుపతి : నారాయణగిరి పర్వత శ్రేణుల్లో పాదాల మండలంలో ఇటీవల బొటవేలు దెబ్బతిన్న శ్రీవారి పాదాల స్థానంలో నూతన పాదాల ప్రతిష్టాపన బుధవారం ఉదయం వైభవంగా జరిగింది. దెబ్బతిన్న పాదాల స్థానంలో నూతన పాదాలను ఈరోజు ఉదయం మీన లగ్నంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య సంప్రదాయ బద్ధంగా పండితులు ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు. అయితే.. ఇప్పుడే శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి వెంకటేశ్వరుడి భక్తులకు అనుమతి ఇవ్వడంలేదు. సోమవారం వరకు పనులు జరుగనున్నాయి. అప్పటి వరకు భక్తుల దర్శనాలను నిలిపేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. బొటనవేలు విరిగిన శ్రీవారి పాదాలను దేవాలయానికి చెందిన మ్యూజియంలో భద్రపరుస్తామన్నారు. కొత్తగా ప్రతిష్ఠించిన శ్రీవారి పాదాల పరిరక్షణ కోసం ... గాజుతో ఓ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే తిరుమలలో శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రతం సందర్బంగా శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. ప్రతియేటా బ్రహ్మోత్సవాల చివరి రోజు, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభస్వామి చతుర్దశి రోజు చక్రస్నానం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 5.30 గంటలకు ఆలయం నుంచి సుదర్శన చక్రతాళ్వార్‌ను ఊరేగింపుగా పురవీధుల గుండా పుష్కరణి వద్దకు తీసుకు వచ్చారు. అక్కడ ఆగమబద్దంగా పూజలు, స్నపన తిరుమంజనం నిర్వహించి, పవిత్ర స్నానం చేయించారు. ఈ సందర్భంగా వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.