నంది నాటకోత్సవాలు: సీఎం జగన్ 100 అడుగుల కటౌట్
సాక్షి, గుంటూరు: నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురాడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి నాటకోత్సవాలను ప్రారంభించారు. నంది నాటకోత్సవాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీఎం జగన్ 100 అడుగుల భారీ కటౌట్ ఆకట్టుకుంటోంది.
ప్రాథమిక దశలో మెప్పించి తుది పోటీలకు అర్హత పొందిన కళాకారులు ఈ ఉత్సవాల్లో సత్తా చాటి బహుమతులు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. మొత్తం ఐదు విభాగాలుగా పోటీలు జరగనున్నాయి. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, కళాశాల, యూనివర్సిటీ స్థాయి నాటికలు, బాలల నాటికల ప్రదర్శనలు ఆహూతులను అలరించనున్నాయి. ఈ పోటీల్లో 73 అవార్డులు గెలుచుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 38 నాటక సమాజాల నుంచి 1,200 మంది కళాకారులు పాల్గొంటున్నారు. కళాకారులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఏర్పాట్లు చేశారు. నాటక ప్రదర్శనలను కళాకారులు, విద్యార్థులు, కళాభిమానులు ఉచితంగా తిలకించే అవకాశం కల్పించారు. ఈ వేడుకలు 29 వరకు జరగనున్నాయి.
నేటి నాటక ప్రదర్శనలివే
● శనివారం ప్రారంభ సభానంతరం ఉదయం 11 గంటలకు రాజాంకు చెందిన కళా సాగర నాటక సంక్షేమ సంఘం వారి ’శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం’ పద్య నాటక ప్రదర్శనతో ఉత్సవాలు ఆరంభమవుతాయి. కళారత్న డాక్టర్ మీగడ రామలింగ స్వామి రచనలో రూపుదిద్దుకున్న ఈ నాటకానికి మీగడ మల్లికార్జున స్వామి దర్శకత్వం వహిస్తారు.
● మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారి ’ఎర్ర కలువ’ సాంఘిక నాటకం ప్రదర్శితమవుతుంది. రచన: ఆకురాతి భాస్కర్ చంద్ర. దర్శకత్వం : డాక్టర్ వెంకట్ గోవాడ
● సాయంత్రం 5 గంటలకు గుంటూరు అమృతలహరి థియేటర్ ట్రస్ట్ వారి ‘నాన్నా.. నేనొచ్చేస్తా’ సాంఘిక నాటిక ప్రదర్శన ఉంటుంది. రచన: తాళాబత్తుల వెంకటేశ్వరరావు. దర్శకత్వం: అమృత లహరి.
● సాయంత్రం 6.30 గంటలకు తెనాలి శ్రీదుర్గా భవాని నాట్యమండలి వారి ‘శ్రీరామభక్త తులసీదాసు’ పద్య నాటకం ప్రదర్శితమవుతుంది. రచన: డాక్టర్ ఐ.మల్లేశ్వరరావు. దర్శకత్వం : ఆదినారాయణ
వైఎస్సార్, ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాలు
ఈ ఏడాది డాక్టర్ వైఎస్సార్ రంగస్థల అవార్డును కాకినాడకు చెందిన యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్‌కు ఇస్తున్నట్టు పోసాని కృష్ణమురళి తెలిపారు. రూ.5,00,000 నగదు ప్రోత్సాహం అందించనున్నట్టు వెల్లడించారు. ఎన్టీఆర్ రంగస్థల పురస్కారానికి విశాఖపట్నానికి చెందిన డాక్టర్ మీగడ రామలింగస్వామి ఎంపికై నట్లు చెప్పారు. ఈయనకు రూ.1,50,000 నగదు ప్రోత్సాహకం అందించనున్నారు.