National assessments and accreditation
-
న్యాక్ గుర్తింపులో వెనుకంజ
రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు తెచ్చుకోవడంలో ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఆ దిశగా శ్రద్ధ పెట్టడంలేదు. న్యాక్ గుర్తింపు ఉన్న విద్యా సంస్థలకే నిధుల్ని మంజూరు చేస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పెట్టిన నిబంధనను విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు. దీంతో యూజీసీ ఆశించిన విద్యా ప్రమాణాలను చేరుకోలేక న్యాక్ గుర్తింపును పొందలేక రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) నిధుల్ని కోల్పోతున్నాయి. 206 విద్యాసంస్థలకే న్యాక్ గుర్తింపు రాష్ట్రంలో 2,193 ఉన్నత, వృత్తి విద్యా కాలేజీలు ఉంటే అందులో కేవలం 206 విద్యా సంస్థలకే న్యాక్ గుర్తింపు ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి లెక్కలు తేల్చింది. అంటే రాష్ట్రంలోని 10% సంస్థలకు కూడా న్యాక్ గుర్తింపు లేని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు 18 ఉంటే అందులో 13 వర్సిటీలకు మాత్రమే న్యాక్ గుర్తింపు ఉన్నట్లు లెక్కలు వేసింది. ఈ లెక్కన ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ దాదాపుగా చివరి స్థానంలో ఉంది గతేడాదే స్పష్టం చేసిన రూసా విద్యా సంస్థలకు తాము నిధులను ఇవ్వాలంటే న్యాక్ గుర్తింపు ఉండాలని మూడేళ్ల కిందటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పష్టం చేయగా, ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి తాము నిధులివ్వాలంటే న్యాక్ గుర్తింపు తప్పనిసరిగా ఉండాల్సిందేనని గతేడాది మార్చిలో జరిగిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశంలో రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) స్పష్టం చేసింది. కాలేజీల్లో ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఆశించిన స్థాయిలో విద్యా సంస్థలకు న్యాక్ గుర్తింపు తెచ్చుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఇక న్యాక్ నిబంధనలను కఠినతరం చేయడం కూడా మరో కారణంగా అధికారులు చెబుతున్నారు. గతంలో కాలేజీలు దరఖాస్తు చేసుకుంటే న్యాక్ బృందం దానిని అధ్యయనం చేసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తింపు ఇచ్చేది. ముఖ్యంగా విద్యా ప్రమాణాలను చూసేది. అయితే ఇప్పుడు కూడా అవే అంశాలు ప్రధానం అయినప్పటికీ బోధన పరిస్థితులు, విద్యా ప్రమాణాలు, పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బంది, నాణ్యత ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు తదితర సమగ్ర వివరాలపై విద్యార్థుల అభిప్రాయాలను తీసుకుని న్యాక్ గుర్తింపు ఇచ్చే విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో రాష్ట్రంలోని విద్యా సంస్థలకు న్యాక్ గుర్తింపు కష్టంగా మారిందని, బోధన, విద్యా ప్రమాణాలు లేక గుర్తింపు లభించడం లేదని పేర్కొంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. భారీగా పెంచుకున్న మహారాష్ట్ర, కర్ణాటక... న్యాక్ గుర్తింపు తెచ్చుకోవడంలో మహారాష్ట్ర విద్యా సంస్థలు ముందంజలో ఉన్నాయి. 1,539 న్యాక్ గుర్తింపు పొందిన విద్యా సంస్థలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. అదే తెలంగాణ కేవలం 206 విద్యా సంస్థలతో 14వ స్థానంలో ఉంది. మహారాష్ట్రంలో 2017–18 విద్యా సంవత్సరంలో కేవలం 587 విద్యా సంస్థలకే న్యాక్ గుర్తింపు ఉండగా, 2018–19 విద్యా ఏడాదిలో దాదాపు 1000 కాలేజీలకు అదనంగా గుర్తింపును తెచ్చుకోగలిగింది. ఇక రెండో స్థానంలో కర్ణాటక నిలిచింది. కిందటి విద్యా సంవత్సరంలో అక్కడ 336 విద్యా సంస్థలకే న్యాక్ గుర్తింపు ఉండగా, గత విద్యా సంవత్సరంలో మొత్తంగా 800 విద్యా సంస్థలకు న్యాక్ గుర్తింపు తెచ్చుకోగలిగింది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రధాన రాష్ట్రాల్లోని ఎక్కువ విద్యా సంస్థలకు న్యాక్ గుర్తింపు లభించినా తెలంగాణలోని విద్యా సంస్థలు కిందటేడాది కంటే గతేడాది అదనంగా 102 విద్యా సంస్థలు మాత్రమే న్యాక్ గుర్తింపు తెచ్చుకోగలిగాయి. -
విద్యా సంస్థలకు ‘న్యాక్’ షాక్!
రూసా నిధుల్లో తెలంగాణకు దక్కని ప్రాధాన్యం రూ.400 కోట్లు అడిగితే.. రూ.112 కోట్లకే ఓకే అక్రెడిటేషన్ లేనందువల్లే నిధుల్లో భారీ కోత హైదరాబాద్: రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం దక్కలేదు. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు రూ. 400 కోట్లు అవసరమని రూసా ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశంలో ప్రతిపాదనలు అందజేస్తే కేవలం రూ.112 కోట్ల విలువైన కార్యక్రమాలకే ఓకే చెప్పింది. యూనివర్సిటీలు, కాలేజీలు నిర్వహించే కోర్సులకు నేషనల్ అసేస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ (న్యాక్) గుర్తింపు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతోంది. యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పాత డిగ్రీ కాలేజీలను మోడల్ డిగ్రీ కాలేజీలుగా అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు అడిగింది. అయితే, న్యాక్ అక్రెడిటేషన్ లేకపోవడంతో నిధులు ఇప్పుడు ఇవ్వడం కుదరదని, అక్రెడిటేషన్ తెచ్చుకున్నాకే ఇస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా, రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అధికంగా ఉన్నాయని, కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకని ప్రశ్నించింది. వీటిపై ప్రతిపాదనలను మళ్లీ అందజేయాలని చేయాలని పేర్కొంది. ఏప్రిల్‌లో జరిగిన రూ సా సమావేశానికి రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కళాశాల విద్యా కమిషనర్ తదితరులు హాజరయ్యారు. ఆ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నత విద్య అభివృద్ధికి సం బంధించిన వివిధ ప్రతిపాదనలను రూసా అధికారులకు అందజేశారు. అందులో కొన్నిం టికి ఒప్పుకోగా, మరికొన్నింటికి వివరణలు అడిగారు. ఇంకొన్నింటికి న్యాక్ గుర్తింపు లేనందునా నిధులు ఇచ్చేందుకు నిరాకరించారు. వీసీలు లేకపోవడమూ కారణమే.. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్, శాతవాహన, పాలమూ రు యూని వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో యూనివర్సిటీకి రూ. 20 కోట్ల చొప్పున రూ. 100 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరితే.. కేవలం ఉస్మానియా వర్సిటీకి మాత్రమే రూ. 20 కోట్లు ఇచ్చేం దుకు ఒప్పుకుంది. మిగిలిన వర్సిటీలకు న్యాక్ గుర్తింపు లేనందున నిధులు ఇవ్వబోమని పేర్కొంది. అయితే, 4 వర్సిటీలకు రెండు మూడేళ్లుగా రెగ్యులర్ వైస్ చాన్స్లర్లు లేకపోవడం.. ఇన్చార్జి వైస్ చాన్స్లర్లు వాటికి న్యాక్ గుర్తింపు కోసం ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఆ యూనివర్సిటీలకు నిధులు రాకుండాపోయాయి. ఇతర ప్రతిపాదనలదీ అదే దారి.. ఆదిలాబాద్ లో రూ. 12 కోట్లతో మోడల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ఓకే చెప్పకుండా... మరింత సమాచారం కావాలని కోరింది.ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఒక్కోదానికి రూ.26 కోట్లతో కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కోసం రాష్ర్టం ప్రతిపాదించగా... ఇప్పటికే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అధికంగా ఉన్నాయంటూ మంజూరుకు అంగీకారం తెలపలేదు. హైదరాబాద్‌లో రెండు, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌లో ఒకటి చొప్పున పాత డిగ్రీ కాలేజీలకు న్యాక్ గుర్తింపు తెచ్చుకుంటే మోడల్ డిగ్రీ కాలేజీలుగా అభివృద్ధికి నిధులు ఇస్తామని పేర్కొన్నారు. 44 డిగ్రీ కాలేజీలకు అభివృద్ధి చేసేందుకు ఒక్కో దానికి రూ. 2 కోట్ల చొప్పున నిధులు అడిగితే.. న్యాక్ గుర్తింపు ఉన్న 30 కాలేజీలకు మాత్రమే అనుమతి. మిగితా వాటికి న్యాక్ గుర్తింపు వచ్చాకే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. కొత్త యూనివర్సిటీల ఏర్పాటు, క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన అంశాలకు మోక్షం లభించలేదు. రూసా అమలులో భాగంగా ముందస్తు ఏర్పాట్ల కోసం ఇప్పటికే రూ. 2.6 కోట్లు మంజూరు చేసింది. మరో రూ. 1.4 కోట్లు రాష్ట్ర వాటాగా వెచ్చించి ఏర్పాట్లు చేయాలని పేర్కొంది.