న్యాక్‌ గుర్తింపులో వెనుకంజ  | National Assessment and Accreditation Council telangana loss | Sakshi
Sakshi News home page

న్యాక్‌ గుర్తింపులో వెనుకంజ 

May 10 2019 1:21 AM | Updated on May 10 2019 1:21 AM

National Assessment and Accreditation Council telangana loss - Sakshi

రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) గుర్తింపు తెచ్చుకోవడంలో ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఆ దిశగా శ్రద్ధ పెట్టడంలేదు. న్యాక్‌ గుర్తింపు ఉన్న విద్యా సంస్థలకే నిధుల్ని మంజూరు చేస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) పెట్టిన నిబంధనను విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు. దీంతో యూజీసీ ఆశించిన విద్యా ప్రమాణాలను చేరుకోలేక న్యాక్‌ గుర్తింపును పొందలేక రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా) నిధుల్ని కోల్పోతున్నాయి.    
 

206 విద్యాసంస్థలకే న్యాక్‌ గుర్తింపు  
రాష్ట్రంలో 2,193 ఉన్నత, వృత్తి విద్యా కాలేజీలు ఉంటే అందులో కేవలం 206 విద్యా సంస్థలకే న్యాక్‌ గుర్తింపు ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి లెక్కలు తేల్చింది. అంటే రాష్ట్రంలోని 10% సంస్థలకు కూడా న్యాక్‌ గుర్తింపు లేని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు 18 ఉంటే అందులో 13 వర్సిటీలకు మాత్రమే న్యాక్‌ గుర్తింపు ఉన్నట్లు లెక్కలు వేసింది. ఈ లెక్కన ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ దాదాపుగా చివరి స్థానంలో ఉంది  

గతేడాదే స్పష్టం చేసిన రూసా 
విద్యా సంస్థలకు తాము నిధులను ఇవ్వాలంటే న్యాక్‌ గుర్తింపు ఉండాలని మూడేళ్ల కిందటే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ స్పష్టం చేయగా, ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి తాము నిధులివ్వాలంటే న్యాక్‌ గుర్తింపు తప్పనిసరిగా ఉండాల్సిందేనని గతేడాది మార్చిలో జరిగిన ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు (పీఏబీ) సమావేశంలో రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా) స్పష్టం చేసింది. కాలేజీల్లో ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఆశించిన స్థాయిలో విద్యా సంస్థలకు న్యాక్‌ గుర్తింపు తెచ్చుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఇక న్యాక్‌ నిబంధనలను కఠినతరం చేయడం కూడా మరో కారణంగా అధికారులు చెబుతున్నారు. గతంలో కాలేజీలు దరఖాస్తు చేసుకుంటే న్యాక్‌ బృందం దానిని అధ్యయనం చేసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తింపు ఇచ్చేది. ముఖ్యంగా విద్యా ప్రమాణాలను చూసేది. అయితే ఇప్పుడు కూడా అవే అంశాలు ప్రధానం అయినప్పటికీ బోధన పరిస్థితులు, విద్యా ప్రమాణాలు, పనిచేస్తున్న రెగ్యులర్‌ సిబ్బంది, నాణ్యత ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు తదితర సమగ్ర వివరాలపై విద్యార్థుల అభిప్రాయాలను తీసుకుని న్యాక్‌ గుర్తింపు ఇచ్చే విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో రాష్ట్రంలోని విద్యా సంస్థలకు న్యాక్‌ గుర్తింపు కష్టంగా మారిందని, బోధన, విద్యా ప్రమాణాలు లేక గుర్తింపు లభించడం లేదని పేర్కొంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. 

భారీగా పెంచుకున్న మహారాష్ట్ర, కర్ణాటక... 
న్యాక్‌ గుర్తింపు తెచ్చుకోవడంలో మహారాష్ట్ర విద్యా సంస్థలు ముందంజలో ఉన్నాయి. 1,539 న్యాక్‌ గుర్తింపు పొందిన విద్యా సంస్థలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. అదే తెలంగాణ కేవలం 206 విద్యా సంస్థలతో 14వ స్థానంలో ఉంది. మహారాష్ట్రంలో 2017–18 విద్యా సంవత్సరంలో కేవలం 587 విద్యా సంస్థలకే న్యాక్‌ గుర్తింపు ఉండగా, 2018–19 విద్యా ఏడాదిలో దాదాపు 1000 కాలేజీలకు అదనంగా గుర్తింపును తెచ్చుకోగలిగింది. ఇక రెండో స్థానంలో కర్ణాటక నిలిచింది. కిందటి విద్యా సంవత్సరంలో అక్కడ 336 విద్యా సంస్థలకే న్యాక్‌ గుర్తింపు ఉండగా, గత విద్యా సంవత్సరంలో మొత్తంగా 800 విద్యా సంస్థలకు న్యాక్‌ గుర్తింపు తెచ్చుకోగలిగింది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ తదితర ప్రధాన రాష్ట్రాల్లోని ఎక్కువ విద్యా సంస్థలకు న్యాక్‌ గుర్తింపు లభించినా తెలంగాణలోని విద్యా సంస్థలు కిందటేడాది కంటే గతేడాది అదనంగా 102 విద్యా సంస్థలు మాత్రమే న్యాక్‌ గుర్తింపు తెచ్చుకోగలిగాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement