National Electronic Fund Transfer System
-
ఇక రోజంతా ఆర్టీజీఎస్ సర్వీసులు
ముంబై: పెద్ద మొత్తంలో నగదు బదిలీ లావాదేవీలకు ఉపయోగించే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) సర్వీసులు ఇకనుంచీ రోజంతా 24 గంటలూ .. అందుబాటులో ఉండనున్నాయి. ఈ విధానం ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఇలాంటి సర్వీసులను ఏడాది పొడవునా, వారమంతా, ఇరవై నాలుగ్గంటలూ అందిస్తున్న అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చోటు దక్కించుకుంది. దీన్ని సుసాధ్యం చేసిన భాగస్వాములందరినీ అభినందిస్తూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ .. ట్విటర్లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం రూ. 2 లక్షల దాకా నిధుల బదలాయింపునకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) విధానాన్ని, అంతకు మించితే ఆర్టీజీఎస్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. నెఫ్ట్ సేవలు ఇప్పటికే రోజంతా అందుబాటులో ఉంటుండగా.. తాజాగా ఏడాది తర్వాత ఆర్టీజీఎస్ సేవలను కూడా ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చింది. 2004 మార్చి 26న ఆర్టీజీఎస్ విధానం అమల్లోకి వచ్చింది. అప్పట్లో నాలుగు బ్యాంకులతో మొదలైన ఈ విధానం ద్వారా ప్రస్తుతం రోజుకు రూ. 4.17 లక్షల కోట్ల విలువ చేసే 6.35 లక్షల పైచిలుకు లావాదేవీలు జరుగుతున్నాయి. 237 బ్యాంకులు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. 2020 నవంబర్‌లో ఆర్టీజీఎస్లో సగటు లావాదేవీ పరిమాణం రూ. 57.96 లక్షలుగా నమోదైంది. జైపూర్‌లో బ్యాంక్‌నోట్ ప్రాసెసింగ్ సెంటర్ బ్యాంక్ నోట్ల చలామణీ పెరుగుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ కోసం జైపూర్‌లో ఆటోమేటెడ్ బ్యాŠంక్నోట్ ప్రాసెసింక్ కేంద్రాన్ని (ఏబీపీసీ) ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి వచ్చే కరెన్సీ నోట్ల జమ, నిల్వ, డిస్పాచ్ మొదలైన కార్యకలాపాల కోసం దీన్ని ఉపయోగించనున్నారు. ఏబీపీసీ ఏర్పాటుకు అవసరమయ్యే సేవల నిర్వహణ కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆర్బీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. 2039–40 నాటికి దశలవారీగా సగటున రోజుకి 685 కోట్ల కొత్త నోట్లను, 2,775.7 కోట్ల పాత నోట్లను నిల్వ చేసే సామర్థ్యంతో ఏబీపీసీని రూపొందించనున్నారు. 2001 మార్చి నుంచి 2019 మార్చి దాకా చలామణీలో ఉన్న బ్యాంక్ నోట్ల పరిమాణం 3 రెట్లు పెరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరుతుందని అంచనా. -
ఆన్లైన్ మోసం..!
నల్లగొండ క్రైం : చాకచక్యంతో ఓ వ్యక్తి ఖాతా నుంచి ఓ మోసగాడు చేసిన రూ. 5 లక్షల దోపిడీని పోలీసులు అడ్డుకున్నారు. వన్‌టౌన్ సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మాన్కంచల్కకు చెందిన ముక్కమల్ల దాదాబాషా బత్తాయి వ్యాపారం చేస్తుంటాడు.బత్తాయి లోడ్ లారీలను ఢిల్లీకి పంపించడంతో అక్కడి వ్యాపారులు దాదాబాషా ఖాతాలో డబ్బులను జమచేస్తుం టారు. ఉదయం 11గంటలకు ఢిల్లీ వ్యాపారులు రూ.5లక్షలు ఖాతాలో వేశారు. దాదాబాషాకు మధ్యాహ్నం 2.15 గంటలకు రాజా అనే వ్యక్తి ఫోన్‌చేసి నీ ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యిందని చెప్పాడు. తాను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని, దానిని సరిచేయడానికి నీ పిన్‌నంబర్ సరిచేయాలని కోడ్ నెంబర్ చెప్పమని అడిగాడు. దీంతో పాషా నంబర్ చెప్పాడు. వెంటనే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా పాషా ఖాతాలో ఉన్న రూ.5లక్షలను రాజా తన ఖాతాలోకి వేసుకున్నాడు. ఓ రైతు ఫోన్‌చేసి పాషాను బత్తాయి డబ్బులు కావాలని కోరడంతో ఐసీఐసీఐ బ్యాంకులో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లారు. ఖాతాలో డబ్బులు లేకపోవడంతో నివ్వెరపోయి మేనేజర్‌ను సంప్రదించాడు. నీ ఖాతాలోని డబ్బులు నేషనల్ ఎలక్ట్రానిక్ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా రాజా ఖాతాలోకి వెళ్లాయని చెప్పాడు. తాను డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదని ఓ వ్యక్తి ఫోన్‌చేసి ఫిన్కోడ్ బ్లాక్ అయ్యిం దని, నంబర్ చెప్పాలంటే చెప్పానని వివరించడంతో పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఏఎస్పీ గంగారామ్‌ను కలిసి జరిగిన విషయాన్ని వివరించాడు. వెంటనే సీఐను పిలిచి సమస్యను వివరించాడు. ఐసీఐసీఐ బ్యాంకు అధికారులను సంప్రదించిన సీఐ రూ.5లక్షలు రాజా ఖాతా నుంచి డ్రా కాకుండా బ్లాక్ చేయించారు. ఈ విషయాన్ని పసిగట్టిన రాజా పోలీసులు తనపై నిఘా వుంచారని అనుమానించి వెంటనే తిరిగి రూ.5లక్షలను పాషా ఖాతాలోకి జమచేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బ్యాంకు ఖాతానంబర్లు, ఏటీఎం కార్డు నంబర్లుగానీ, కోడ్‌నంబర్లు గానీ ఎవరు అడిగినా చెప్పవద్దన్నారు. ఆన్లైన్లో ఇలాంటి మోసాలు జరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేశారు. తనకు 5లక్షల రూపాయలు ఇప్పించిన పోలీసులకు పాషా కృతజ్ఞతలు తెలిపారు.