ఒక్క మ్యాచ్‌కు... 120 కోట్ల బీర్లు
క్రికెట్ మ్యాచ్ చూస్తూ బీర్ తాగడం ఓ సరదా. సాధారణంగా రెండు బీర్లు తాగే అలవాటు ఉన్నవాళ్లు... మ్యాచ్ చూస్తూ నాలుగైదు లాగిస్తారు. అమెరికాలో జనాలు కూడా దీనికి అతీతమేం కాదు. మనం క్రికెట్ చూస్తే... వాళ్లు నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) అంటే పడిచస్తారు. గత ఆదివారం ఎన్ఎఫ్ఎల్లో భాగంగా న్యూజెర్సీలో సూపర్‌బౌల్ మ్యాచ్ జరిగింది. దీనికోసం ప్రేక్షకులు ఎగబడ్డారు. మ్యాచ్ చూస్తూ ఎంత తాగుతున్నారో అర్థం కానంతగా బీర్లు లాగిపారేశారు. ఈ ఒక్క మ్యాచ్ సందర్భంగా అమెరికా మొత్తం మీద 120 కోట్ల బీర్లు తాగేశారట. రగ్బీ తరహాలో ఉండే ఈ మ్యాచ్‌కు సంబంధించి మైదానం బయట జరిగిన విశేషాలు.
సాక్షాత్తూ ఆ దేశాధ్యక్షుడు ఒబామా మ్యాచ్‌కు ముందు బంతి వేశారు.
మ్యాచ్‌ను స్టేడియంలో ప్రత్యక్షంగా 90 వేల మంది చూశారు.
ప్రతి పది మంది అమెరికన్లలో 9 మంది ఆ రోజు టీవీలో ఇదే మ్యాచ్ చూశారు. ఏడాది కాలంలో ఎక్కువ రేటింగ్ వచ్చిన టీవీ షో ఇదే.
మ్యాచ్‌ను చూస్తూ ప్రేక్షకులు 5 కోట్ల కేసుల బీర్లు తాగేశారు (ఒక కేస్‌కు 24 బాటిల్స్ చొప్పున సుమారు 120 కోట్ల బీర్ బాటిళ్లు)
మందుతో పాటు స్టఫ్ లేకుండా మజా ఏముంటుంది. అందుకే మ్యాచ్ సమయంలో చికెన్‌ను భారీగా లాగించేశారు. వారు తిన్న లెగ్పీస్ల సంఖ్య సుమారు 125 కోట్లు.
సుమారు 4 కోట్ల 80 లక్షల మంది అమెరికన్లు ఈ మ్యాచ్ రోజు ఇంట్లో వండుకోకుండా హోటల్ ఫుడ్‌నే తిన్నారు.
సూపర్ బౌల్ మ్యాచ్ ప్రసార సమయంలో ఒక్కో టీవీ ప్రకటన విలువ 30 సెకన్లకు 40 లక్షల డాలర్లు (దాదాపు రూ. 25 కోట్లు) పలికింది.
ఇంతకీ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే... సీటెల్ సీహాక్స్ 43-8 స్కోరుతో డెన్వర్ బ్రాంకోస్‌ను ఓడించింది.