National Savings
-
ఎక్కువ ఖాతాలున్నా.. ప్రయోజనాలు సున్నా
ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇస్తున్నా కానీ, ఇతర పెట్టుబడి సాధనాల ప్రాధాన్యాన్ని విస్మరించలేం. పెట్టుబడులు అన్నింటినీ ఒక్క చోటే పెట్టేయడం రిస్క్ పరంగా అనుకూలం కాదు. వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలి. అప్పుడే రిస్క్ తగ్గించుకుని, మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది. అందుకే ఒకవైపు ఈక్విటీల్లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నప్పటికీ.. మరోవైపు చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఇప్పటికీ ఎంతో మందికి ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనాలుగా కొనసాగుతున్నాయి. రిస్క్‌లేని హామీతో కూడిన ఈ పథకాలు ముఖ్యమైన జీవిత లక్ష్యాలకు చేదోడుగా నిలుస్తాయనడంలో అతిశయం లేదు. అయితే ఇందులో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఎన్ఎస్సీ పరంగా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించిన వివరాలే ఈ వారం ప్రాఫిట్‌ప్లస్ కథనం. పీపీఎఫ్ ఒక్కటే ఎక్కువ మంది ఎంపిక చేసుకునే ఆరి్థక సాధనాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. ఇందులో ఒక ఆరి్థక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఈ మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి ముగిసిన తర్వాత మరో ఐదేళ్ల పాటు గడువును పొడిగించుకోవచ్చు. ఇందులో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపే కాకుండా, గడువు ముగిసిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంది. ఈ ప్రయోజనమే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఇది చూసే కొంత మంది ఒకటికి మించిన పీపీఎఫ్ ఖాతాలను తెరిచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. పోస్టాఫీస్‌లో ఒకటి, బ్యాంక్‌లో ఒకటి తెరుస్తున్నారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఒకరి పేరిట ఒక పీపీఎఫ్ ఖాతానే ప్రారంభించడం లేదా కొనసాగించడం చేయగలరని కేంద్ర ఆరి్థక శాఖ జూలై 12న ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఒకటికి మించిన ఖాతాలను గుర్తించినట్టయితే అందులో ఒక దానిని ప్రాథమిక ఖాతాగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రెండో ఖాతాలో జమలపై ఎలాంటి వడ్డీ రాదన్నది తాజా ఉత్తర్వుల సారాంశం. ఒకవేళ రెండు ఖాతాలున్నట్టు తేలితే రెండో ఖాతాలోని జమలను మొదటి ఖాతాకు బదిలీ చేస్తారు. ఒక ఆర్థిక సంత్సరంలో గరిష్ట పెట్టుబడి రూ.1.5 లక్షలకు మించి జమ చేసినట్టయితే, అదనంగా ఉన్న మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా వెనక్కిచ్చేస్తారు. రెండు కంటే ఎక్కువ ఖాతాలున్నట్టు తేలితే అప్పుడు ప్రారంభించిన తేదీ నుంచి సున్నా వడ్డీయే లభిస్తుంది.పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతాలు... కొంత మంది పిల్లల పేరుతోనూ ఒకటికి మించిన పీపీఎఫ్ ఖాతాలను తెరుస్తున్నారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించొచ్చు. ఒక మైనర్ (బాలుడు/బాలిక) పేరిట ఒక పీపీఎఫ్ ఖాతాకే పరిమితం కావాలి. ఇలా ఒక మైనర్ పేరిట ఒకటికి మించి ఉన్న ఖాతాలను ఇరెగ్యులర్ (అక్రమం) అకౌంట్లుగా గుర్తిస్తారు. అప్పుడు మైనర్ పేరిట ఉన్న ఖాతాల్లో ఒకదానిని మెయిన్ అకౌంట్‌గా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు గుర్తించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఖాతాకు నిబంధనల మేరకు ప్రస్తుత వడ్డీ రేటు అమలవుతుంది. ఒకటికి మించి అదనంగా ఉన్న ఖాతాల్లోని జమలకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 4 శాతం చొప్పున 18 ఏళ్లు వచ్చే వరకు చెల్లిస్తారు. 18 ఏళ్లు నిండగానే మేజర్ అయిన తర్వాత సాధారణ పీపీఎఫ్ ఖాతా కింద దాన్ని పరిగణిస్తారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ ఖాతాపై చర్యలు ఉంటాయి. నిబంధనల ప్రకారం పీపీఎఫ్ ఖాతాలో ఒక ఆరి్థక సంవత్సరానికి కనీసం రూ.500 నుంచి, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నిజానికి ఇద్దరు పిల్లలు ఉంటే విడిగా ఇద్దరి పేరిట రెండు ఖాతాలు తెరిచి నిర్వహించుకోవచ్చు. అయినప్పటికీ, తన పేరుతో, తన పిల్లల పేరుతో ఇలా అన్నింటిలోనూ గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలకు మించి ఇన్వెస్ట్ చేసుకోరాదు. పీపీఎఫ్ ఖాతాను తాత, బామ్మ, అమ్మమ్మలు (గ్రాండ్ పేరెంట్స్) నిర్వహించరాదు. కేవలం తల్లిదండ్రులు మరణించి, పిల్లలకు ఆధారంగా మారిన వారే చట్టబద్ధ సంరక్షకులుగా వ్యవహరించడానికి అనుమతి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన... సుకన్య సమృద్ధి యోజన ఎంతో ప్రాచుర్యం పొందిన పథకం. రోజుల శిశువు నుంచి పదేళ్లలోపు కుమార్తెల పేరిట ఖాతా తెరిచి ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు ఇది కొనసాగుతుంది. ఇందులో ఒక ఆరి్థక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఖాతాకు 8.2 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఇందులో చేసే పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, ఇందులో రాబడులపైనా పన్ను లేదు. ఒక కుటుంబం తరఫున గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిటే సుకన్య సమృద్ధి ఖాతాను తెరవడానికి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను (ఎస్ఎస్ఏఎస్) బాలిక తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తెరవడానికి అనుమతి ఉంటుంది. అయితే, కొందరు మనవరాలి పేరిట కూడా ఖాతాలను తెరిచి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో పిల్లలకు సహజ సంరక్షకులు అయిన తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అయిన వారే సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవడానికి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఒకవేళ మనవరాలి పేరిట తాత, అమ్మమ్మ, బామ్మలు తెరిచినట్టు గుర్తించినట్టయితే అప్పుడు సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులకు బదిలీ అవుతుంది. ఒక కుటుంబానికి రెండుకు మించి ఖాతాలున్నట్టు తేలితే అదనంగా ఉన్న వాటిని మూసివేస్తారు. వాటిలో జమ చేసే మొత్తాలపై వడ్డీ రాదు.నేషనల్ సేవింగ్స్ స్కీమ్... ఎంతో పాపులర్ అయిన చిన్న మొత్తాల పొదుపు పథకం ఇది. గతంలో ఏదైనా పోస్టాఫీస్ శాఖలో నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ప్రారంభించేందుకు అవకాశం ఉండేది. దీన్ని 2002 నుంచి నిలిపివేశారు. కాకపోతే అప్పటికే తెరిచిన ఖాతాలను కొనసాగించేందుకు అనుమతించారు. 1990 ఏప్రిల్ 2కు ముందు తెరిచిన మొదటి ఖాతాకు ప్రస్తుత పథకం రేటు, రెండో ఖాతాకు పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా రేటు (4 శాతం)కు అదనంగా 2 శాతం చెల్లిస్తారు. అక్టోబర్ 1 నుంచి ఈ రెండు ఖాతాలకు ఎలాంటి వడ్డీ రాదు. 1990 ఏప్రిల్ 2 తర్వాత తెరిచిన నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలకు సైతం అక్టోబర్ నుంచి ఎలాంటి వడ్డీ చెల్లించరు. దీంతో ఈ ఖాతాలను మూసివేసుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. ఎన్ఆర్ఐలు అలా చేయడం కుదరదు..ఎన్ఆర్ఐ హోదాను వెల్లడించకుండా పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం చెల్లదు. అలాంటి ఖాతాల్లోని జమలకు పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ రేటు 4 శాతమే అమలవుతుంది. అది కూడా 2024 సెపె్టంబర్ 30 వరకే. ఆ తర్వాత నుంచి బ్యాలన్స్‌పై వడ్డీ రాదు. నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐలు పీపీఎఫ్ ఖాతా తెరవడానికి అనుమతి లేదు. ‘‘భారత్‌లో పీపీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత విదేశాలకు వెళ్లి ఎన్ఆర్ఐగా మారితే 15 ఏళ్ల గడువు ముగిసేంత వరకు ఆ ఖాతాను కొనసాగించొచ్చు. అందులో చేసే పెట్టుబడులకు ఇతరులకు మాదిరే వడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే, నాన్ రీపాట్రియేషన్ నిబంధనల కిందే వీరు పీపీఎఫ్ ఖాతాను కొనసాగించుకోగలరు. అంటే గడువు ముగిసిన తర్వాత వచ్చే మెచ్యూరిటీని ఎన్ఆర్ఐ తన విదేశీ ఖాతాకు బదిలీ చేసుకోవడం కుదరదు. లేదా విదేశీ కరెన్సీలోకి మార్చుకోవడం కుదరదు. తన నివాస హోదాలో మార్పు చోటుచేసుకున్న వెంటనే సంబంధిత వ్యక్తి బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు తెలియజేయడం తప్పనిసరి’’ అని స్టెబుల్ ఇన్వెస్టర్ వ్యవస్థాపకుడు దేవ్ ఆశిష్ తెలిపారు.మార్గం ఉంది.. పీపీఎఫ్‌లో పెట్టుబడులు, రాబడులపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలంటే.. అప్పుడు దంపతులు ఇద్దరూ తమ పేరిట పీపీఎఫ్ ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇద్దరు పిల్లలు ఉంటే భార్య, భర్త చెరొక పీపీఎఫ్ ఖాతా తెరిచి గరిష్ట పరిమితి మేరకు ఒక్కో ఖాతాలో ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పిల్లల పేరిట తెరిచిన పీపీఎఫ్ ఖాతాను ఐదేళ్లు నిండిన తర్వాత వైద్య పరమైన అవసరాల కోసం మూసివేసేందుకు అనుమతి ఉంటుంది. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
సొంత కారులేదు.. అప్పులూ లేవు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సగటు వేతన జీవిలా తనకు వచ్చే వేతనాన్ని బ్యాంకు ఖాతాల్లో, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో భద్రంగా దాచుకుంటున్నారు. ఆదాయ పన్ను మినహాయింపు కోసం ఆయన ఎక్కువగా తనకి వచ్చే వేతనాన్ని నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), జీవిత బీమా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల రూపంలో ఉంచుతున్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఆయన ఆదాయంలో రూ.36.53 లక్షలు పెరుగుదల కనిపించింది. మోదీ తాజాగా తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి ప్రధాని మొత్తం ఆస్తుల విలువ రూ.2.85 కోట్లుగా ఉంది. గత ఏడాది రూ.2.49 కోట్ల చరాస్తులుంటే ఏడాదిలో 26.26% పెరుగుదల కనిపించింది. ► మోదీ నెల జీతం రూ. 2 లక్షలు. అందులో కరోనా సాయం కింద 30% ఆయన వేతనంలోంచి కట్ అవుతోంది. ► ప్రధాని సేవింగ్స్ అకౌంట్లో రూ. 3.38 లక్షలు ఉన్నాయి. నగదు రూపంలో ఆయన దగ్గర రూ.31,450 మాత్రమే ఉన్నాయి. ► గుజరాత్ గాంధీనగర్‌లోని ఎస్బీఐ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ.1.60 కోట్ల ఉన్నాయి ► నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ రూపంలో రూ. 8.5 లక్షలు. రూ. 7.61 లక్షలు ఉన్నాయి. జీవిత బీమా పథకం కింద రూ.1.51 లక్షలు, రూ.1.90 లక్షలు కడుతూ ఉంటారు. ► నాలుగు బంగారం ఉంగరాలు ఉన్నాయి. 45 గ్రాముల బరువుండే వాటి విలువ రూ1.5 లక్షలుగా ఉంది. ► గాంధీనగర్‌లో పూర్వీకుల నుంచి వచ్చిన ఇల్లు, స్థలం ఉన్నాయి. వాటి విలువ రూ.1.1 కోట్లు. కుటుంబ సభ్యులతో పాటు మోదీకి ఆ ఇంట్లో 25% హక్కు ఉంది. ► ప్రధానికి సొంత కారు లేదు. అప్పులు కూడా లేవు. అమిత్ షా ఆస్తులు తగ్గాయ్ ! కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆస్తుల విలువ గత ఏడాదితో పోల్చి చూస్తే స్వల్పంగా తగ్గింది. షేర్ మార్కెట్లో డబ్బులు ఉంచడంతో ఆయనకి ఉన్న చరాస్తుల్లో తగ్గుదల కనిపించింది. గత ఏడాది అమిత్ షా వద్ద రూ. 32.3 కోట్లు ఉంటే ఈ ఏడాది రూ. 28.63 కోట్లకి తగ్గిపోయాయి. ఇక రూ.13.56 కోట్ల విలువైన స్థిరాస్తులు షా పేరు మీద ఉన్నట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. షా బ్యాంకు ఖాతాలో రూ.1.04 కోట్లు ఉంటే ఆయన దగ్గర నగదు రూపంలో రూ.15,814 ఉన్నాయి. రూ.44.47 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. -
మోదీ చేతిలో నగదు రూ.4,700
ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 1.41 కోట్లు ♦ రూ.1.19 లక్షల విలువైన 4 బంగారు ఉంగరాలు ♦ స్థిరాస్తుల విలువ సుమారు రూ. కోటి ♦ చరాస్తుల విలువ రూ.41.15 లక్షలు న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ.1.41 కోట్లకు చేరినా ఆయన చేతిలో ఉన్న నగదు కేవలం రూ.4,700 మాత్రమే. మోదీ 13 ఏళ్ల క్రితం కొన్న ఇంటి విలువ 25 రెట్లు పెరగడంతో ఆస్తుల విలువ పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం చివరి వరకున్న మోదీ ఆస్తుల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) తాజాగా ప్రకటించింది. 2015 మార్చి 31 నాటికి ఆయన చేతిలో ఉన్న నగదు రూ. 4,700 అని, అంతకుముందు 2014, ఆగస్టు 18న ఆస్తులను ప్రకటించినప్పుడు ఆయన వద్ద రూ.38,700 ఉండిందని తెలిపింది. ఈ కాలంలో ఆయన మొత్తం స్థిర, చరాస్తులు రూ. 1,26,12,288 నుంచి రూ. 1,41,14,893కు పెరిగాయి. పీఎంఓ వివరాల ప్రకారం.. 2014, మే 26న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ పేరున ఎలాంటి వాహనం లేదు. ఆయన ఇప్పటికీ తన బ్యాంకు ఖాతాను గుజరాత్‌లోనే కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో ఏ బ్యాంకులోనూ ఖాతా లేదు. ఆయనకు ఎలాంటి రుణాలూ లేవు. మోదీ వద్ద దాదాపు 45 గ్రాముల బరువైన నాలుగు బంగారు ఉంగరాలున్నాయి. 2015, మార్చి 31 నాటికి వాటి విలువ రూ.1.19 లక్షలు. 2014 ఆగస్టు 18 నాటితో పోలిస్తే వీటి విలువ రూ.1.21 లక్షల నుంచి స్వల్పంగా తగ్గింది. 2016 జనవరి 30 వరకు వివరాలను పీఎంఓ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇక మోదీ పెట్టుబడుల విషయానికొస్తే, రూ.20 వేల విలువైన ఎల్అండ్టీ బాండ్లు (ట్యాక్స్ సేవింగ్స్), రూ.5.45 లక్షల విలువైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, రూ.1.99 లక్షల విలువైన జీవిత బీమా పాలసీలున్నాయి. చరాస్తుల మొత్తం విలువ రూ.41.15 లక్షలు. స్థిరాస్తి విషయానికొస్తే, గాంధీనగర్‌లోని ఒక ఇంట్లో నాలుగోవంతు వాటా ఉంది. 3,531.45 చదరపు అడుగుల ఈ వాటాలో 169.81 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా ఉంది. ఇది వారసత్వ ఆస్తి కాదని, దీన్ని 2002 అక్టోబర్ 25న రూ.1,30,488తో కొనుగోలు చేశారని పీఎంఓ తెలిపింది. దీనిపై పెట్టుబడుల రూపంలో చేసిన నిర్మాణానికి రూ.2,47,208 అయిందని పేర్కొంది.దీని ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ. కోటి ఉందని, కొనుగోలుచేసినప్పటి నుంచి ఇప్పటివరకు 25 రెట్లు పెరిగిందని తెలిపింది. బ్యాంకు డిపాజిట్లకొస్తే, ఎస్బీఐలో రూ.94,903, రాజ్‌కోట్ నాగ్రిక్ సహకారి కోఆపరేటివ్ బ్యాంకులో రూ.30,347 డిపాజిట్లు ఉన్నాయి. దీంతోపాటు ఎస్బీఐలో రూ.30,72,017 విలువైన ఎఫ్‌డీలున్నాయి. మోదీకి వ్యవసాయ భూమిగానీ, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఆస్తులు గానీ లేవు. ఆయన భార్య జశోదాబెన్ ఆస్తుల వివరాలు తెలియవని వెల్లడించారు.