మోదీ చేతిలో నగదు రూ.4,700
ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 1.41 కోట్లు
♦ రూ.1.19 లక్షల విలువైన 4 బంగారు ఉంగరాలు
♦ స్థిరాస్తుల విలువ సుమారు రూ. కోటి
♦ చరాస్తుల విలువ రూ.41.15 లక్షలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ.1.41 కోట్లకు చేరినా ఆయన చేతిలో ఉన్న నగదు కేవలం రూ.4,700 మాత్రమే. మోదీ 13 ఏళ్ల క్రితం కొన్న ఇంటి విలువ 25 రెట్లు పెరగడంతో ఆస్తుల విలువ పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం చివరి వరకున్న మోదీ ఆస్తుల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) తాజాగా ప్రకటించింది. 2015 మార్చి 31 నాటికి ఆయన చేతిలో ఉన్న నగదు రూ. 4,700 అని, అంతకుముందు 2014, ఆగస్టు 18న ఆస్తులను ప్రకటించినప్పుడు ఆయన వద్ద రూ.38,700 ఉండిందని తెలిపింది. ఈ కాలంలో ఆయన మొత్తం స్థిర, చరాస్తులు రూ. 1,26,12,288 నుంచి రూ. 1,41,14,893కు పెరిగాయి. పీఎంఓ వివరాల ప్రకారం.. 2014, మే 26న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ పేరున ఎలాంటి వాహనం లేదు.
ఆయన ఇప్పటికీ తన బ్యాంకు ఖాతాను గుజరాత్‌లోనే కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో ఏ బ్యాంకులోనూ ఖాతా లేదు. ఆయనకు ఎలాంటి రుణాలూ లేవు. మోదీ వద్ద దాదాపు 45 గ్రాముల బరువైన నాలుగు బంగారు ఉంగరాలున్నాయి. 2015, మార్చి 31 నాటికి వాటి విలువ రూ.1.19 లక్షలు. 2014 ఆగస్టు 18 నాటితో పోలిస్తే వీటి విలువ రూ.1.21 లక్షల నుంచి స్వల్పంగా తగ్గింది. 2016 జనవరి 30 వరకు వివరాలను పీఎంఓ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇక మోదీ పెట్టుబడుల విషయానికొస్తే, రూ.20 వేల విలువైన ఎల్‌అండ్‌టీ బాండ్లు (ట్యాక్స్ సేవింగ్స్), రూ.5.45 లక్షల విలువైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, రూ.1.99 లక్షల విలువైన జీవిత బీమా పాలసీలున్నాయి.
చరాస్తుల మొత్తం విలువ రూ.41.15 లక్షలు. స్థిరాస్తి విషయానికొస్తే, గాంధీనగర్‌లోని ఒక ఇంట్లో నాలుగోవంతు వాటా ఉంది. 3,531.45 చదరపు అడుగుల ఈ వాటాలో 169.81 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా ఉంది. ఇది వారసత్వ ఆస్తి కాదని, దీన్ని 2002 అక్టోబర్ 25న రూ.1,30,488తో కొనుగోలు చేశారని పీఎంఓ తెలిపింది. దీనిపై పెట్టుబడుల రూపంలో చేసిన నిర్మాణానికి రూ.2,47,208 అయిందని పేర్కొంది.దీని ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ. కోటి ఉందని, కొనుగోలుచేసినప్పటి నుంచి ఇప్పటివరకు 25 రెట్లు పెరిగిందని తెలిపింది. బ్యాంకు డిపాజిట్లకొస్తే, ఎస్‌బీఐలో రూ.94,903, రాజ్‌కోట్ నాగ్‌రిక్ సహకారి కోఆపరేటివ్ బ్యాంకులో రూ.30,347 డిపాజిట్లు ఉన్నాయి. దీంతోపాటు ఎస్‌బీఐలో రూ.30,72,017 విలువైన ఎఫ్‌డీలున్నాయి. మోదీకి వ్యవసాయ భూమిగానీ, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఆస్తులు గానీ లేవు. ఆయన భార్య జశోదాబెన్ ఆస్తుల వివరాలు తెలియవని వెల్లడించారు.