మధ్యతరగతి గృహాలపై దృష్టిపెట్టండి!  | Focus on middle class houses - modi | Sakshi
Sakshi News home page

మధ్యతరగతి గృహాలపై దృష్టిపెట్టండి! 

Published Sat, Feb 16 2019 12:01 AM | Last Updated on Sat, Feb 16 2019 12:01 AM

Focus on middle class houses - modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో మధ్య తరగతి జనాభా శరవేగంగా పెరుగుతుంది. వీరి ఆకాంక్షలు సొంతింటి నుంచే మొదలవుతాయి. అందుకే మధ్యతరగతి అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా గృహాలను నిర్మించాలని, వాళ్లను ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలనూ తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. నిర్మాణ సంస్థల మార్కెట్, వ్యాపార ధోరణిని సామాన్య, మధ్య తరగతికి అనుబంధంగా సాగాలని, అలాంటి కంపెనీలు చిన్నవైన సరే బహుళ జాతి సంస్థల కంటే శరవేగంగా వృద్ధి చెందుతాయని అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (క్రెడాయ్‌) యూత్‌కాన్‌–2019 సదస్సులో మోదీ ప్రసంగించారు. 

రియల్టీ రంగం ప్రధాన అడ్డంకులు పాలసీలు, నిధుల సమస్య కాదు. భరోసా లేకపోవటం. డెవలపర్‌కు, కొనుగోలుదారులకు మధ్య నమ్మకం లేకపోతే ఈ రంగం కుదేలవుతుంది. అందుకే గత నాలుగున్నర ఏళ్లలో రియల్టీ రంగంలో భరోసా, పారదర్శకత చేకూర్చే పలు నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. ‘‘నోట్ల రద్దుతో అక్రమ పెట్టుబడులను నిరోధించాం. బినామీ, రెరా చట్టాలతో లావాదేవీల్లో పారదర్శకత, కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని తీసుకొచ్చాం. జీఎస్‌టీతో పన్నులను తగ్గించాం. రీట్స్‌ పెట్టుబడులపై డివెడెండ్‌ డిస్ట్రిట్యూషన్‌ పన్నును, విదేశీ పెట్టుబడుల సరళతరం కోసం సెక్టరల్‌ రిమ్మిటన్స్‌లను ఎత్తేశాం. వీటన్నింటితో రియల్టీ రంగంలో మళ్లీ భరోసా నెలకొంది. 

టెక్నాలజీ వినియోగం పెరగాలి.. 
రియల్టీ రంగంతో అభివృద్ధితో సిమెంట్, టైల్స్, పెయింట్స్‌ వంటి అనుబంధ రంగాలు కూడా వృద్ధి చెందుతాయి. ఉద్యోగ అవకాశాలూ పెరుగుతాయి. నిర్మాణ రంగంలో సాంకేతికత వినియోగం పెరగాలి. 12 లక్షల పీఎంఏవై గృహాలను సరికొత్త టెక్నాలజీతో నిర్మిస్తున్నాం. దీంతో నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటూ వేగవంతంగా పూర్తవుతాయన్నారు. టెక్నాలజీ వినియోగంతో పాటూ సహజ ఇంధన వనరులను వినియోగించాలి. వ్యర్థాల పునర్వినియోగం, వర్షపు నీరు, మురుగు నీటి శుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, పర్యావరణహితమైన నిర్మాణ సామగ్రిని వినియోగించాలని సూచించారు. 

జీవించడమూ నేర్పించాలి 
‘గోడలు మారినంత మాత్రాన జీవితం మారదు’. అంటే అప్పటివరకు గుడిసెళ్లో ఉన్న వాళ్లకి సొంతిల్లు అందిస్తే అందులో ఎలా జీవించాలో తెలియదు. అందుకే డెవలపర్లు గృహాలు నిర్మించడంతో పాటూ ఆయా ఇళ్లలో ఎలా జీవించాలో కూడా నేర్పించాలి. టాయిలెట్‌ వినియోగం, నల్లా, ఎల్‌పీజీ గ్యాస్,  ఇంధన వనరుల వాడకం వంటి వాటిపై అవగాహన చేయాలి. ఇందుకోసం క్రెడాయ్‌ మహిళ విభాగాలను ఏర్పాటు చేసి.. ఎన్‌జీవోలతో కలిసి ఆయా శిక్షణ శిబిరాలను చేపట్టాలని సూచించారు.  

గృహాల్లో యూపీఏ వర్సెస్‌ ఎన్‌డీఏ 
యూపీఏ ప్రభుత్వం పదేళ్లలో పేదల గృహాల నిర్మాణం కోసం రూ.38 వేల కోట్లు వెచ్చిస్తే.. ఎన్‌డీఏ ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్లలో రూ.4 లక్షల కోట్లను వెచ్చించింది. పదేళ్లలో దేశంలో 13 లక్షల గృహాలను నిర్మిస్తే.. గత నాలుగున్నర ఏళ్లలో 73 లక్షల గృహాలను నిర్మించింది. పదేళ్లలో పట్టణ పేదల కోసం 8 లక్షల గృహాలను నిర్మిస్తే.. నాలుగున్నర ఏళ్లలో 1.5 లక్షల గృహాలను నిర్మించింది. ఇదే లక్ష్యంగా 2022 నాటికి దేశంలోని పేదలందరికీ గృహాలను అందిస్తామని ధీమావ్యక్తం చేశారు. 

ఎన్‌సీఎల్‌టీకి రియల్టీ కేసు వస్తే? 
రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఏమైనా కేసులు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కి వస్తే.. ముందుగా సంబంధిత రెరా అథారిటీకి సమాచారం అందించాలని మహారాష్ట్ర రెరా చీఫ్‌ గౌతమ్‌ చటర్జీ కోరారు. ‘‘ఎన్‌సీఎల్‌టీలో కేసు నమోదైతే సెక్షన్‌–14 ప్రకారం 6–9 నెలల పాటు ప్రాజెక్ట్‌లో ఎలాంటి కార్యకలాపాలు, లావాదేవీలు జరగవు. ఇది ఆయా నిర్మాణ సంస్థలకు ఆర్థిక ఇబ్బంది. ఒకవేళ ఐబీసీ కింద దివాళా ప్రక్రియకు ఆదేశిస్తే 30–50 శాతం నష్టాలు తప్పవు. ఐబీసీ కింద గృహ కొనుగోలుదారులు కూడా క్రెడిటర్స్‌ (రుణదాతలు) కాబట్టి వీళ్లూ 50 శాతం నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఎన్‌సీఎల్‌టీ కేసును ఆమోదించకముందే రెరాకు నివేదించాలని ఆయన సూచించారు. సమస్యను పరిష్కరించేందుకు అథారిటీకి 3–4 నెలల సమయం ఇవ్వాలని, అప్పటికీ పరిష్కారం కాకపోతే ఎన్‌సీఎల్‌టీ కేసును నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో నమో దు కానీ ప్రాజెక్ట్‌లను గుర్తించి సమాచారం అందించేందుకు ఇన్‌ఫార్మర్స్‌ పథకాన్ని ప్రారంభించామని చైర్మన్‌ ఆంటోనీ డీ సా తెలిపారుప్రస్తుతం రెరా చట్టం 28 రాష్ట్రాల్లో అమలులో ఉంది. 21 రాష్ట్రాలు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశాయి. ఇప్పటివరకు 35 వేల ప్రాజెక్ట్‌లు, 27 వేల మంది ఏజెంట్లు రెరాలో నమోదయ్యాయి.

నెలకు రూ.3 వేలు పెన్షన్‌! 
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం సరికొత్త పెన్షన్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధాన్‌మంత్రి శ్రమ్‌యోగి మాన్‌ధన్‌ (పీఎంఎస్‌వైఎం) పథకంలో నమోదైన కార్మికులకు నెలకు రూ.3 వేలు పెన్షన్‌ రూపంలో అందించనుంది. తొలి విడతగా ఈ స్కీమ్‌కు రూ.500 కోట్లను కేటాయించింది. స్కీమ్‌లో నమోదైన కార్మికులు వయస్సును బట్టి నెలకు రూ.55–100 జమ చేయాలి. అంతే మొత్తాన్ని కేంద్రం కూడా జమ చేస్తుంది. కార్మికునికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3 వేలు పెన్షన్‌ను అందుతుందని.. ఈ స్కీమ్‌తో వచ్చే ఐదేళ్లలో సుమారు 10 కోట్ల మంది కార్మికులు లబ్ధి పొందుతారని కేంద్రం అంచనా వేసింది. పీఎంఎస్‌వైఎం, పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై పథకాల్లో నిర్మాణ కార్మికులను భాగస్వామ్యం చేసేందుకు డెవలపర్లు ముందుకురావాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement