National seed companies
-
65 సభ్య దేశాలకు విత్తనాల ఎగుమతి
కర్నూలు (అగ్రికల్చర్): అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విత్తనోత్పత్తి చేద్దామని తెలంగాణ వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రా లకు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ డెవలప్మెంట్(ఓఈసీడీ) ప్రమాణాలకు అనుగుణంగా విత్తన ధ్రువీకరణ చేసే కేంద్రం హైదరాబాద్లోనే ఏర్పాటైందని చెప్పారు. ఓఈసీడీలో 65 దేశాలకు సభ్యత్వం ఉందని, అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణ సర్టిఫికెట్తో ఈ దేశాలన్నింటికీ విత్తనాలను ఎగుమతి చేసుకోవచ్చని తెలిపారు. మంగళవారం ఇక్కడ తెలంగాణ విత్తన, సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సు కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విత్తన కంపెనీల ప్రతినిధులు, నేషనల్ సీడ్ కార్పొరేషన్ అధికారులు, రైతులు హాజరయ్యారు. పార్థసారథి మాట్లాడుతూ అంతర్జాతీయ విత్తన మార్కెట్లో భారతదేశ వాటా ఒక్క శాతం మాత్రమే ఉందని, దీన్ని కనీసం 10 శాతానికి పెంచుకునేందుకు అంత ర్జాతీయ నాణ్యతాప్రమాణాలకు అనుగు ణంగా విత్తనోత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓఈసీడీ ప్రమాణాలకు అను గుణంగా ఉత్పత్తి చేసిన విత్తనాలను వాడటం వల్ల 20 నుంచి 30 శాతం వరకు దిగుబడి పెరుగుతుందని చెప్పారు. -
విత్తనంపై పెత్తనానికి చెల్లు!
♦ బీటీ-2 పత్తి విత్తనానికి ప్రత్యామ్నాయంగా బీటీ-3 ♦ దేశీయంగా కొత్త వంగడం రెడీ.. బీటీ-2 ధరలో సగమే ♦ రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీల ఏర్పాట్లు ♦ బీటీ-3 వస్తే మోన్శాంటో గుత్తాధిపత్యానికి చెక్! సాక్షి, హైదరాబాద్: పత్తి విత్తన వ్యాపారంలో మోన్శాంటో గుత్తాధిపత్యానికి తెరదించే రోజు లొచ్చాయి! మోన్శాంటో బీటీ-2 పత్తి విత్తనానికి ప్రత్యామ్నాయంగా దేశీయంగా బీటీ-3 పేరుతో కొత్త వంగడం సిద్ధమైంది. దేశీయంగా అనేక కంపెనీలు బీటీ-3 విత్తనాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. కేంద్రం అనుమతిస్తే రెండేళ్లలోనే ఈ సరికొత్త పత్తి విత్తనాన్ని రైతుల ముందుకు తీసుకొస్తామని జాతీయ విత్తన సంఘం చెబుతోంది. బీటీ-2 విత్తన ధరలో దాదాపు సగానికే దీన్ని అందిస్తామని పేర్కొంటోంది. జన్యువును ప్రవేశపెట్టే ప్రక్రియ పూర్తి 2006 వరకు దేశంలో బీటీ-1 పత్తి విత్తనం హవా కొనసాగింది. అయితే బీటీ-1లో ఒకే జన్యువు ఉండటంతో అది పురుగును తట్టుకునే శక్తిని కోల్పోయింది. దీంతో 2006లో బీటీ-2ను ప్రవేశపెట్టారు. అందులో రెండు జన్యువులు ఉండడంతో పురుగును తట్టుకునే శక్తి వచ్చింది. అయితే గతేడాది నుంచి బీటీ-2 పత్తి విత్తనానికి కూడా పురుగులు ఆశించాయి. దేశవ్యాప్తంగా అనేకచోట్ల గులాబీ రంగు పురుగు ఏర్పడింది. అనేకచోట్ల కాయ, పూత సరిగా లేక దిగుబడి పడిపోయింది. ఫలితంగా దేశవ్యాప్తంగా 30 శాతం దిగుబడి తగ్గింది. ఈ నేపథ్యంలో బీటీ-2కు ప్రత్యామ్నాయంగా జాతీయ విత్తన కంపెనీలు ‘స్వర్ణభారత్ కన్సార్షియం’గా ఏర్పడి బీటీ-3 కొత్త వంగడాన్ని ప్రయోగశాలలో సిద్ధం చేశాయి. ఇప్పటివరకు ‘ఈసీ’ అనే జన్యువును పత్తి మొక్కలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ పూర్తయింది. బీటీ టెక్నాలజీని హైబ్రీడ్గా మార్చి తర్వాత బీటీ-3 పత్తి వంగడం తయారు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు మోన్శాంటో గుత్తాధిపత్యం కారణంగా పత్తి విత్తనంలో జన్యువును ప్రవేశపెట్టలేకపోయామని చెబుతున్నారు. కొత్త వంగడానికి గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి ఉందని తేలిందంటున్నారు. మోన్శాంటో అడ్డు తొలగించిన సీసీఐ గతనెలలో కాంపిటీషన్ క మిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మోన్శాంటో గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఆదేశాలిచ్చింది. మోన్శాంటోకు బీటీ టెక్నాలజీపై గుత్తాధిపత్యం లేదని, దేశీయ పత్తి విత్తన కంపెనీలు బీటీ టెక్నాలజీని వాడుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో బీటీ టెక్నాలజీతో తయారైన బీటీ-3కి అడ్డంకులు తొలగినట్లేనని, కేంద్రం అనుమతిస్తే రెండేళ్లలో గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి ఉన్న వంగడాన్ని రైతులకు చేరుస్తామని విత్తన కంపెనీలు చెబుతున్నాయి. బీటీ-2 పత్తి విత్తనం విఫలమైందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో ఇప్పటికే నివేదించినందున దాన్ని నిషేధించి బీటీ-3కి అనుమతి ఇవ్వాలని దేశీయ కంపెనీలు కోరుతున్నాయి. మరోవైపు స్థానికంగా బీటీయేతర విత్తనాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని కొందరు వ్యవసాయ రంగ నిపుణులు కోరుతున్నారు. మోన్శాంటో పని అయిపోయినట్లేనా? బీటీ-3 పత్తి వంగడం రైతుల వద్దకు చేరితే మోన్శాంటోకు కాలం చెల్లినట్లేనని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు మోన్శాంటో కంపెనీ మహారాష్ట్ర హైబ్రిడ్ కంపెనీ(మైకో)తో కలిసి దేశవ్యాప్తంగా 2002 నుంచి బీటీ-1 పత్తి విత్తన వ్యాపారం చేస్తోంది. ఇతర విత్తన కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఏ ఇతర పత్తి విత్తనాలు మార్కెట్లోకి అడుగుపెట్టకుండా చూస్తోంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రాయల్టీ ద్వారానే దాదాపు రూ.6 వేల కోట్లు కొల్లగొట్టిందని జాతీయ విత్తన సంఘం ప్రతినిధులు అంటున్నారు. బీటీ-1 పత్తి (మోన్ 531 జీన్) విత్తనానికి సంబంధించి మోన్శాంటోకు పేటెంట్ హక్కు లేదని, రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగానే వాడుకోవచ్చని జాతీయ పత్తి పరిశోధన సంస్థ (సీఐసీఆర్) తేల్చి చెప్పింది. కానీ దేశీయ విత్తన తయారీదారులు కోట్ల రూపాయల రాయల్టీని మోన్శాంటోకు చెల్లిస్తూనే ఉన్నారు. ఆ సొమ్మును రైతు నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. 2006 నుంచి బీటీ-2 పత్తి విత్తనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టిన మోన్శాంటో.. దానికి పేటెంట్ ఉందని చెబుతూ రాయల్టీ నిర్ణయించింది. అయినా ఇప్పటికీ బీటీ-1కు అక్రమంగా రాయల్టీని వసూలు చేస్తోంది.