
కర్నూలు (అగ్రికల్చర్): అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విత్తనోత్పత్తి చేద్దామని తెలంగాణ వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రా లకు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) ప్రమాణాలకు అనుగుణంగా విత్తన ధ్రువీకరణ చేసే కేంద్రం హైదరాబాద్‌లోనే ఏర్పాటైందని చెప్పారు. ఓఈసీడీలో 65 దేశాలకు సభ్యత్వం ఉందని, అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణ సర్టిఫికెట్‌తో ఈ దేశాలన్నింటికీ విత్తనాలను ఎగుమతి చేసుకోవచ్చని తెలిపారు.
మంగళవారం ఇక్కడ తెలంగాణ విత్తన, సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సు కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విత్తన కంపెనీల ప్రతినిధులు, నేషనల్ సీడ్ కార్పొరేషన్ అధికారులు, రైతులు హాజరయ్యారు. పార్థసారథి మాట్లాడుతూ అంతర్జాతీయ విత్తన మార్కెట్‌లో భారతదేశ వాటా ఒక్క శాతం మాత్రమే ఉందని, దీన్ని కనీసం 10 శాతానికి పెంచుకునేందుకు అంత ర్జాతీయ నాణ్యతాప్రమాణాలకు అనుగు ణంగా విత్తనోత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓఈసీడీ ప్రమాణాలకు అను గుణంగా ఉత్పత్తి చేసిన విత్తనాలను వాడటం వల్ల 20 నుంచి 30 శాతం వరకు దిగుబడి పెరుగుతుందని చెప్పారు.