ధర్మవరం: ‘నమ్మి ఆయన్ను గెలిపిస్తే.. మా కుటుంబాన్ని నట్టేట ముంచాడు. ఆయన వ్యక్తిగత స్వార్థానికి చేనేత వ్యవస్థ సర్వ నాశనమైపోయింది’ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీపై ఆ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గడ్డం పార్థసారథి నిప్పులు చెరిగారు. బుధవారం స్థానిక లక్ష్మీచక్రవర్తి థియేటర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే సూరి వైఖరికి నిరసనగా తాను తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆ పార్టీ ద్వారా సంక్రమించిన జిల్లా కార్యదర్శి పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో వరదాపురం సూరి విజయానికి తమ గడ్డం ఫ్యామిలీ మొత్తం శ్రమించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేనేత వర్గానికి చెందిన తనపై వ్యక్తిగత కక్షసాధింపులకు దిగాడని, ఆయన టార్గెట్ కారణంగా చేనేత వ్యవస్థ మొత్తం నిర్వీర్యమై పోయిందని తెలిపారు. దీనికి తోడు టీడీపీలో తాము చేరినప్పటి నుంచి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లోనే రాజీనామా చేయాల్సి ఉండగా, ఇంత కాలం సూరిలో మార్పు వస్తుందని ఎదురు చూసినట్లు వివరించారు. సూరి నియంతృత్వ ధోరణి భరించలేక టీడీపీలో ఇమడలేకపోతున్నట్లు తెలిపారు. త్వరలో తన రాజకీయ భవిష్యత్తును వెల్లడిస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment