జర్నలిజం విభాగానికి నేషనల్ ఎడ్యుకేషన్ అవార్డు
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం జర్నలిజం విభాగానికి ‘బి స్కూల్ విత్ ఇండస్ట్రీ రిలేటెడ్ కరికులం ఇన్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్’ అవార్డు లభించింది. మంగళవారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య నాగేశ్వరరావుకు అవార్డును జర్నలిజం విభాగాధిపతి ఆచార్య పి.బాబి వర్ధన్ అందజేశారు. ఈ సందర్భంగా వీసీ నాగేశ్వరరావు మాట్లాడుతూ వరుసగా మూడవ సంవత్సరం ఈ అవార్డులను ఏయూ జర్నలిజం విభాగం అందుకోవడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. విభాగ ఆచార్యులను అభినందించారు.
ప్రసార మాధ్యమాల రంగానికి అవసరమైన నిపుణులను ఏయూ అందిస్తోందన్నారు. సమాజానికి దర్పణంగా ప్రసార మాధ్యమాలు నిలుస్తున్నాయన్నారు. ఈ రంగానికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగాలన్నారు. విభాగాధిపతి ఆచార్య పి.బాబి వర్ధన్మాట్లాడుతూ ఆనంద్ బజార్ పత్రిక(ఏబిపి) న్యూస్ నేషనల్ ఎడ్యుకేషన్ అవార్డును 2016 సంవత్సరానికి అందుకుందన్నారు. మౌళిక వసతులు, పాఠ్య ప్రణాళిక, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను మార్పులు చేస్తున్న విధానం, ప్రొఫెషనల్ టీచర్స్‌ను కలిగి ఉండటం వలన ఇది సాధ్యపడిందన్నారు. వరుసగా మూడు సంవత్సరాలు అవార్డును సాధించడం విభాగంపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ స్థానాన్ని నిలుపుకుంటూ, మరింత మెరుగు పరచుకునే విధంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో బిఓఎస్ చైర్మన్ ఆచార్య డి.వి.ఆర్ మూర్తి, డాక్టర్ చల్లా రామక్రిష్ణ, డాక్టర్ కె.విజయకుమార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్ తదితరులు పాల్గొన్నారు.