అన్నల ఇలాఖాలో పొలిటికల్ ఫీవర్
భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఉమ్మడి జిల్లాలో నక్సలైట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. జిల్లాలో కొన్ని గ్రామాలను ‘విముక్తి’ గ్రామాలుగా ప్రకటించుకున్న నక్సల్స్.. సమాంతర పాలన సాగించారు. ఆ గ్రామాల్లో గ్రామరాజ్య కమిటీల గొడుగు కిందనే పాలన సాగేది. ఏ ఎన్నికలు వచ్చినా బహిష్కరణ నినాదం వినిపించేది. ప్రస్తుతం మావోయిస్టుల ప్రాభవం క్షీణించడంతో ఆ గ్రామాల్లోకి పార్టీలు ప్రవేశించాయి.
సాక్షి, కామారెడ్డి: నక్సలైట్ ఉద్యమం జిల్లాలోనూ జోరుగా సాగింది. చాలా గ్రామాల్లో అన్నల ప్రభావం ఉండేది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నక్సలైట్లు బహిష్కరణ పిలుపు ఇచ్చేవారు. అప్పట్లో కొన్ని గ్రామాల్లో ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. కొన్నిసార్లు పారామిలటరీ బలగాలను పంపించి బలవంతంగా ఓట్లు వేయించిన సంఘటనలు ఉన్నాయి. ఎన్నికలను బహిష్కరించాలని నక్సల్స్ పిలుపునిస్తే ఆయా గ్రామాల్లో ప్రజలు ఓటు వేయడానికి ముందుకు వచ్చేవారు కాదు. ఇదే సమయంలో గ్రామాలకు రాజకీయ పార్టీల నేతలు రావడానికి జంకేవారు. పోలీసు బలగాలతో ఎంత భద్రత కల్పిస్తామని చెప్పినా పార్టీ అభ్యర్థులు అటువైపు వెళ్లడానికి వణికేవారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో ఎవరూ పోటీకి సిద్ధపడేవారు కాదు. కొన్ని చోట్ల గ్రామస్తులంతా ఐక్యంగా ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకునేవారు. ఇంకొన్నిచోట్ల అయితే అసలు పంచాయతీ పాలన ఎందుకంటూ ఎన్నికలను బహిష్కరించేవారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు వచ్చాయంటే చాలు గ్రామాల్లో పోలీసు బూట్ల చప్పుళ్లు వినిపించేవి. ఓట్లు బహిష్కరించాలని నక్సలైట్లు, ఓటు వేయాలంటూ పోలీసులు ప్రజలపై ఒత్తిడి తేవడంతో ప్రజలు నలిగిపోయేవారు.
ఎన్నికల సమయంలో పోలీసు బలగాలను, రాజకీయ పార్టీలను టార్గెట్‌గా చేసుకుని నక్సల్స్ హింసాత్మకం సంఘటనలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి నక్సల్స్ దాడులను తిప్పికొట్టేందుకు పోలీసు యంత్రాంగం కూడా అడవులను జల్లెడపట్టేది. దీంతో ఎన్నికలు పూర్తయ్యేదాకా అటవీ ప్రాంత గ్రామాలు, నక్సల్స్ ప్రభావిత పల్లెల్లో యుద్ధవాతావరణం కనిపించేది. అప్పట్లో జిల్లాలో ఎన్నో సంఘటనలు జరిగాయి. సిరికొండ మండలంలో ఎన్నికల నేపథ్యంలో భద్రత కోసం వెళ్లిన పోలీసులపై నక్సల్స్ మందుపాతర పేల్చడంతో ఒక ఎస్సై మృత్యువాత పడ్డారు. దశాబ్దం క్రితం వరకు నక్సల్స్ ముఖ్యంగా సీపీఐ మావోయిస్టు పార్టీ (అప్పట్లో పీపుల్స్‌వార్)లో ఉమ్మడి జిల్లాలో కామారెడ్డి ఏరియా దళం, ఎల్లారెడ్డి ఏరియా దళం, సిర్నాపల్లి ఏరియా దళం, బాన్సువాడ ఏరియా దళాలు పనిచేసేవి.
అంతేగాక మినీ గెరిల్లా స్క్వాడ్లు, అర్బన్ గెరిల్లా స్క్వాడ్లు కూడా ఉండేవి. అప్పుడు నక్సలైట్ ఉద్యమంలో వందలాది మంది పనిచేసేవారు. అన్నల పేరు వింటేనే రాజకీయ పార్టీల నేతలు వణికిపోయేవారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా నక్సలైట్ల అలికిడి వినిపించినా, ఏదైనా అఘాయిత్యానికి పాల్పడినా నాయకులు ఊళ్లు, పట్టణాలను వదిలి రాజధాని బాటపట్టేవారు. నక్సల్ ప్రభావిత గ్రామాల్లోనైతే రాజకీయ పార్టీల్లో పనిచేయడానికి ఎవరూ సాహసించేవారు కాదు. అప్పట్లో అధికార పార్టీకి చెందినవారైతే చాలు వారిపై నక్సల్స్ విరుచుకుపడేవారు. దీంతో చాలా మంది రాజకీయాలను వదిలిపెట్టారు. అన్నల పేరు వింటేనే వణికిపోయే పరిస్థితులు ఉండేవి. బతికుంటే బలిసాకు తిని బతుకొచ్చంటూ చాలా మంది గ్రామాలకు దూరమయ్యారు.
ఆ ఊళ్లల్లో ఇప్పుడు పొలిటికల్ వార్....
అప్పుడు అన్నల కనుసన్నల్లో నడిచిన పల్లెల్లో ఇప్పుడు పొలిటికల్ వార్ నడుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని మాచారెడ్డి, సిరికొండ, రామారెడ్డి, సదాశివనగర్, కామారెడ్డి, తాడ్వాయి, రాజంపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి, బీంగల్, కమ్మర్పల్లి, బాన్సువాడ, ఇందల్వాయి, మోర్తాడ్ తదితర మండలాల్లో నక్సల్స్ కార్యకలాపాలు జోరుగా సాగేవి. ఆయా ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలను నక్సల్స్ విముక్తి గ్రామాలుగా కూడా ప్రకటించుకున్నారు. అక్కడ ప్రభుత్వ పాలన సాగేది కాదు. మొత్తంగా నక్సల్స్ కనుసన్నల్లోనే సమాంతర పాలన సాగించారు. గ్రామాల్లో ప్రజలంతా కూర్చుని గ్రామ రాజ్య కమిటినీ ఎన్నుకునేవారు. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే పాలన సాగేది.
రామారెడ్డి మండలంలోని మద్దికుంట, గిద్ద, పోసానిపేట, మోషంపూర్, రెడ్డిపేట, సింగరాయపల్లి, అన్నారం, మాచారెడ్డి మండలంలోని ఇసాయిపేట, పోతారం, సోమారంపేట, బంజెపల్లి, ఆరెపల్లి, సిరికొండ మండలంలోని కొండాపూర్, తూంపల్లి, పాకాల, ఒన్నాజీపేట, కొటాల్పల్లి గ్రామాలతో పాటు భీంగల్, కమ్మర్పల్లి, మోర్తాడ్, తదితర మండలాల్లోని అటవీ ప్రాంత గ్రామాల్లో అప్పట్లో నక్సల్స్ కార్యకలాపాలు జోరుగా సాగడం వల్ల రాజకీయ పార్టీల ఉనికి కనిపించేది కాదు. కానీ ఇప్పుడు ఆ గ్రామాల్లో పొలిటికల్ వార్ నడుస్తోంది. అన్నల ఉనికి లేకపోవడంతో ఆ గ్రామాల్లో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు నాయకులు, క్యాడర్ ఉన్నారు. ఆధిపత్యం కోసం పోటాపోటీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. రెడ్డిపేట గ్రామంలో రెండు పార్టీల నేతల మధ్య అప్పట్లో గొడవలు జరిగి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. దాడులు, ప్రతిదాడులకు కొదవ లేదు. అన్నల జమానాలో పోలీసులు, నక్సల్స్ మధ్యనే యుద్ధం నెలకొనేది. ఇప్పుడు ఆ ఊళ్లల్లో రాజకీయ పార్టీల మధ్య గొడవలు పరిపాటిగా మారాయి. 2009 ఎన్నికలతో పాటు 2014 ఎన్నికల్లోలాగే ఈసారి కూడా నక్సల్స్ బహిష్కరణ పిలుపు వినిపించడం లేదు. నక్సల్స్ ఉనికి లేకపోవడంతో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్యపోరు లేకుంటే ఎన్నికలు మరింత ప్రశాంతంగా జరుగుతాయని ప్రజలు పేర్కొంటున్నారు.
ఉనికి కోల్పోయిన నక్సల్స్..
అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం నక్సల్స్‌పై తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడింది. ఎన్కౌంటర్లలో వందలాది మందిని కాల్చిచంపారు. అరెస్టులు, లొంగుబాట్లతో పార్టీ మరింత బలహీనపడింది. జిల్లాలో వందలాది మంది సానుభూతిపరులు అరెస్టయ్యారు. చాలా మంది ఎన్కౌంటర్లలో హతమయ్యారు. అప్పటి నుంచి జిల్లాలో నక్సల్స్ ఉనికి రోజురోజుకూ తగ్గిపోయింది. జిల్లాకు చెందిన పలువురు అజ్ఞాత నక్సల్స్ ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. నక్సల్స్‌తో ప్రభుత్వం చర్చలు జరిపిన సమయంలోనే మానాల ఎన్కౌంటర్ జరగడం, అందులో కీలకమైన నాయకత్వం హతమవడంతో జిల్లాలో నక్సల్స్ ఉనికి లేకుండాపోయింది. పన్నెండు పదమూడేళ్లుగా జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రభుత్వాలు తీవ్ర నిర్బంధం మోపడంతో పాటు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో నక్సల్స్ ఆచూకీ దొరకడం సులువుగా మారింది. దానికి తోడు ఇన్ఫార్మర్ నెట్వర్క్ పెరిగింది. మారుమూల గ్రామాలకు కూడా రోడ్డు, రవాణా సౌకర్యాలు పెరగడంతో నక్సల్స్ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది. దీంతో జిల్లాలో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఓ రకంగా నక్సలైట్ ఉద్యమం జిల్లాలో కనుమరుగైంది.