Naxals Problem
-
నక్సల్స్ ప్రాంతాల్లో 4 వేల సెల్ టవర్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 4,072 సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. మొబైల్ టవర్ ఫేజ్–2 కింద 10 రాష్ట్రాల్లో టవర్ల ఏర్పాటుకు టెలికం కమిషన్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదానికి ఈ ప్రతిపాదనను పంపింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సెల్ టవర్ల ఏర్పాటు ద్వారా మొబైల్ ఫోన్ల వాడకం పెరగడంతో కొంత మేర భద్రత సవాళ్లను అధిగమించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త టవర్లలో జార్ఖండ్‌లో 1,054, ఛత్తీస్‌గఢ్‌లో 1,028, ఒడిశాలో 483, ఆంధ్రప్రదేశ్‌లో 429, బిహార్‌లో 412, పశ్చిమ బెంగాల్లో 207, ఉత్తరప్రదేశ్‌లో 179, మహారాష్ట్రలో 136, తెలంగాణలో 118, మధ్యప్రదేశ్‌లో 26 టవర్లను ఏర్పాటు చేయనున్నారు. -
గెరిల్లాలకన్నా మావో మేధావులే ఎక్కువ ప్రమాదకరం
* సుప్రీంకు నివేదించిన అఫిడవిట్లో కేంద్రం న్యూఢిల్లీ: అడవుల్లో ఉండి హింసకు తెగబడుతున్న గెరిల్లాల కన్నా నగరాల్లో ఉండే మావోయిస్టు మేధావులే అధిక ప్రమాదకరంగా తయారయ్యారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ‘2001 నుంచి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళాల సభ్యులు 8,116 మందిని హతమార్చారు. మావోయిస్టుల హింస జాతి నిర్మాణానికి పెద్ద ప్రతిబంధకంగా మారింది. సాయుధ నక్సల్స్ వేలాది అభివృద్ధి నిర్మాణాలను, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారు. చురుకైన కలెక్టర్లను, ఇతర అధికారులను కిడ్నాప్ చేస్తున్నారు. వీరికన్నా పట్టణాలు, నగరాల్లో ఉండి రాజ్యంపై దుష్ర్పచారం చేస్తూ.. మావోయిస్టు భావజాలాన్ని ఆరిపోనీకుండా నిరంతరం రాజేస్తున్న మేధావులే ఎక్కువ ప్రమాదకరంగా మారారు’ అని కేంద్ర హోం శాఖ అఫిడవిట్లో పేర్కొంది. నక్సల్స్ సమస్యను రూపుమాపేందుకు కేంద్రం ఒక విధానాన్ని రూపొందించేలా ఆదేశించమని కోరుతూ దాఖలైన పిల్‌పై కేంద్రం, 9 రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కేంద్ర హాం శాఖ స్పందిస్తూ, తప్పుడు సమాచారంతో దుష్ర్పచారం చేస్తున్న మావోయిస్టు మేధావులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకున్న చాలా సందర్భాల్లో వారు అధికారులపై మరింతగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి దిగారని పేర్కొంది. అయితే, కేంద్రం మావోయిస్టుల అణచివేతకు తీసుకున్న చర్యలతో క్రమంగా సత్ఫలితాలు వస్తున్నాయని కేంద్రం తెలిపింది. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో పాగా వేస్తున్న మావోయిస్టులు రాజకీయ కార్యకర్తలను సైతం హతమార్చుతూ ప్రాబల్యం పెంచుకుంటున్నారని తెలిపింది. గత 12 ఏళ్లలో ఇన్ఫార్మర్లు, వర్గ శత్రువుల పేరిట 5,969 మంది పౌరులను, 2,147 మంది భద్రతా సిబ్బందిని నక్సల్స్ చంపారని వివరించింది.