కేంద్ర మంత్రులు విరుద్ధ ప్రకటనలు మానుకోవాలి
నెల్లూరుసిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరిగిపోయినట్లు కేంద్ర మంత్రులు చేస్తునటువంటి విరుద్ధ ప్రకటనలు ఇకనైనా మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక కో-ఆర్డినేటర్ షేక్ గాజుల ఫారూఖ్‌అలీ అన్నారు. నగరంలోని టౌన్‌హాల్ రీడింగ్‌రూంలో గురువారం పరిరక్షణ వేదిక విస్తృత సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా నవంబరు ఒకటో తేదీన జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలు, సమైక్యవాదులందరూ విభజనను వ్యతిరేకిస్తూ ఎక్కడికక్కడ మానవహారాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నవంబరు 5వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు టౌన్హాల్లో నిర్వహించనున్న సదస్సును విజయవంతం చేసేందుకు జిల్లా ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసదస్సుకు మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ సుజాతారావు, పర్యరక్షణ వేదిక రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణ్‌రెడ్డి, డాక్టర్ మిత్రా, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, మాజీ వైస్‌చాన్సలర్ సి.వేణుగోపాల్‌రెడ్డి, ప్రోఫెసర్ నారాయణరెడ్డి హాజరవుతారని తెలిపారు. సమైక్యరాష్ట్ర పరిరక్షణ కోసం సమైక్యవాదులందరూ అవిశ్రాంత పోరాటం కొనసాగించాలన్నారు.
ఈ సమావేశంలో పరిరక్షణ వేదిక రీజియన్ కో-ఆర్డినేటర్, వీఎస్‌యూ మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ నారాయణరెడ్డి, కట్టంరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, బత్తిని విజయ్‌కుమార్, చెన్నారెడ్డి, జెవీవీ రాష్ట్ర నాయకులు ఎన్.నారాయణ, వెలుగొండ ప్రాజెక్ట్ పోరటా సమితి నాయకులు కండ్లగుంట వెంకటేశ్వర్లురెడ్డి, ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు సి.రవీంద్రబాబు, ఎస్‌యూపీఎస్ జిల్లా కన్వినర్ ఎస్.నాగేంద్రకుమార్, రైతుసంఘం నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, వీఎస్‌యూ అధ్యాపక జేఏసీ నాయకులు డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర్ వీరారెడ్డి, బార్అసోసియేషన్ ప్రతినిధి రామిరెడ్డి, విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-కన్వినర్ జీవీ.ప్రసాద్, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.